చిత్తూరు జిల్లా: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ ధ్వజమెత్తారు. వి. కోట మండలంలోని తోటకనుమ గ్రామ పంచాయతీ పరిధిలోని రాఘవపల్లి, కస్తూరి నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన “గడప గడపకు వెంకటన్న” కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో భాగంగా వెంకటే గౌడ ప్రతి ఇంటికి వెళ్లి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ప్రస్తుత ప్రభుత్వ పాలనపై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ హయాంలోనే సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అరకొరగా ఉండటంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పలువురు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటే గౌడ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. మేనిఫెస్టో హామీలను వెబ్‌సైట్‌లో నుంచి మాత్రమే కాకుండా ప్రజల మైండ్ నుంచి కూడా తీసేశారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. హామీలు ఇవ్వడంలో ముందుండే ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో, ముఖ్యంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో కూడా ఏడాదికి పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా పాలన సాగించారని చెప్పారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం హామీలు అమలు చేయకుండానే అప్పులు మాత్రం మూడు రెట్లు పెంచిందని విమర్శించారు. అభివృద్ధి పేరుతో సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టి పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను వెంకటే గౌడ దృష్టికి తీసుకొచ్చారు.