తిరుపతి: భగవద్గీత గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ నాయుడికి లేదని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. బీఆర్ నాయుడికి భగవద్గీతలోని మొదటి రెండు అక్షరాలే అర్థమవుతాయని, ఆయన దృష్టిలో ‘భక్తి అంటే కామ పూజ. భజన అంటే వంటగదిలో జంట విన్యాసం’ అని భూమన చురకలంటించారు. భగవద్గీత లాంటి పవిత్రతను అర్థం చేసుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని వాడుకోవడం తగదని తేల్చి చెప్పారు. యువతకు భగవద్గీత సారాన్ని సులభంగా అర్థమయ్యేలా చేయాలనే ఉద్దేశంతో తాము సరళమైన భాషలో పుస్తకంగా ప్రచురించే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. టీటీడీ మాన్యువల్‌లోనే విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేయాలనే నిబంధన ఉందని తిరుపతిలోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రెస్‌మీట్‌లో భూమన కరుణాకర్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే.. భగవద్గీతను విసిరివేసిన వ్యక్తి బీఆర్ నాయుడు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవల తన పత్రికా సమావేశంలో నాపై తీవ్ర ఆరోపణలు చేశారు. భగవద్గీత పుస్తకాల ముద్రణ పేరుతో నేను రూ.50 కోట్లు ఖర్చు చేసి అవినీతికి పాల్పడ్డానని, అవి చెన్నైలో ప్రింట్ చేశారని, అందులో నా కుమారుడు భాగస్వామి అని ఆయన ఆరోపించారు. ఆ పుస్తకాన్ని చూపిస్తూ ‘ఇందులో ఏముంది చెత్త’ అని వ్యాఖ్యానించారు. అంతకు ముందు టీటీడీ సమావేశంలో కూడా అదే పుస్తకాన్ని విసిరివేశారు. కారణం ఒక్కటేం అందులో ముందుమాట నేను రాశానని సహించలేక అలా చేశారు. బీఆర్ నాయుడికి ఛాలెంజ్ చేస్తున్నా..: ఈ పుస్తకాలు ఐదు భాషల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా ముంబైకి చెందిన ఒక పేపర్ సంస్థకు తక్కువ టెండర్ రావడంతో ముద్రణకు అప్పగించారు. చెన్నైకి ఈ పుస్తకాలతో ఎలాంటి సంబంధం లేదు. ఐదు భాషల్లో కోటి పుస్తకాలు ముద్రించేందుకు మొత్తం రూ.3.71 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి. అందులో కూడా సుమారు 52 లక్షల పుస్తకాలు మాత్రమే ముద్రించబడ్డాయి. ఇవన్నీ నేను ప్రింట్ చేయించినవి కావు. టీటీడీ వర్క్ ఆర్డర్‌లోనే స్పష్టంగా ఉంది. అయినా బీఆర్ నాయుడు పచ్చి అబద్ధాలు చెబుతూ కొన్ని టీవీ చానళ్లలో డిబేట్లు పెట్టించి అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను చెప్పింది అబద్ధమైతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. మీరు చెప్పింది అబద్ధమైతే టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. శ్రీకృష్ణుడినే అవమానపరచినట్టే: ఈ భగవద్గీత పుస్తకంలో ఏముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. భగవద్గీత అనేది 700 శ్లోకాలతో మాత్రమే కాకుండా ఇంకా విçస్తృతంగా ఉన్న గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం. దాన్ని ఎందుకు చదవాలి అన్న విషయాన్ని నేను ముందుమాటగా రాశాను. కానీ ఈ పుస్తకం గురించి మాట్లాడుతున్న తీరు భగవద్గీతను కించపరిచేలా ఉంది. అలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే శ్రీకృష్ణుడినే అవమానపరచినట్టే. ఫోర్న్ వీడియోలు, పుస్తకాలు చూసే వ్యక్తులు కూడా ఇప్పుడు భగవద్గీత గురించి మాట్లాడుతున్నారు. గంధపు వాసనకు గాడిద ముఖం చిట్లించినట్లుగా కొందరు భగవద్గీతను చేతిలో పట్టుకుని నాపై దాడి చేస్తున్నారు. భక్తి అంటే కామపూజ, భజన అంటే వంటగదిలో జంట విన్యాసం అనుకునే వారికి భగవద్గీతలోని మొదటి రెండు అక్షరాలే అర్థమవుతాయి. సులభంగా అర్థం చేసుకునేందుకు సరళమైన పుస్తకం: యువతరం సులభంగా అర్థం చేసుకునేందుకు భగవద్గీత సారాన్ని సరళమైన శైలిలో పుస్తకంగా ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేయాలని టీటీడీ మాన్యువల్‌లోనే ఉంది. మీ హయాంలో చేయని పనిని మేము ప్రారంభించాం. ఆ పుస్తకాల్లో నేను, అప్పటి ఈవో ధర్మారెడ్డి రాసిన ముందుమాట ఉండటాన్ని చూసి బీఆర్ నాయుడు సహించలేక పుస్తకాన్ని విసిరివేశారు. మా పేర్లు ఉంటే మీ పేరు పెట్టుకుని పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేయవచ్చు కదా. ముందుగా ఆ పుస్తకం చదవండి: నేటి తరానికి సులభంగా అర్థమయ్యేలా మేము తీసుకొచ్చిన ఈ గ్రంథం కేవలం 26 పేజీలే అయినా అందులో భగవద్గీత సారం మొత్తం ఉంటుంది. ఇందులో భగవద్గీత సారం లేదని పండితులతో నిరూపించండి. భగవద్గీత భావాలకు విరుద్ధంగా ఉందని చెప్పించండి. ఇందులో భగవద్గీత సారం లేదని నిరూపిస్తే ఇకపై రాజకీయాల గురించి మాట్లాడను. ఐదు భాషల్లో భక్తులకు పంచేందుకు ప్రారంభించిన మంచి కార్యక్రమాన్ని మీరు అపహాస్యం చేస్తున్నారు. మీ మీద పడిన కళంకాన్ని తుడుచుకోలేక శ్రీకృష్ణ భగవానుడిపై అపవాదు మోపుతున్నారు. మీరు వచ్చినప్పటి నుంచి జరుగుతున్నది అన్నీ అరాచకాలు, మహాపాతకాలే. అందుకే బీఆర్ నాయుడు చేసే అన్యాయాలపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.