కాగ్ నివేదికతో బయటపడ్డ సర్కార్ డొల్లతనం

దివాళా దిశగా పయనిస్తున్న రాష్ట్రం

అయినా అబద్ధాలతో మభ్యపెట్టే యత్నం

బడ్జెట్ సమావేశాలూ వృథా

మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్

ఏలూరులోని వైయ‌స్ఆర్‌సీపీ  జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు

డొల్లగా మారిన బడ్జెట్ సమావేశాలు

కాగ్ నివేదికతో బయటపడ్డ ఆర్దిక పరిస్ధితి

దాదాపు ప్రతీ రోజూ అప్పులే

డబ్బులు ఎటుపోతున్నాయో తెలియదు

20 నెలల్లో  3.18 లక్షల కోట్ల అప్పు

ఎఫ్ఆర్బీఎం రూల్స్ యథేచ్ఛగా ఉల్లంఘన

కేంద్రం నుంచీ తగ్గిపోయిన నిధులు

అయినా అడగలేని దుస్దితిలో చంద్రబాబు

అస్తవ్యస్తంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం

వరుస తప్పిదాలతో కోట్ల రూపాయలు వృథా

చంద్రబాబు తప్పిదాల్ని బయటపెట్టిన కాగ్

ప్రాజెక్టుకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది?

జనం కష్టాలు పట్టని కూటమి ఎమ్మెల్యేలు

బడ్జెట్ చర్చ వదిలేసి డ్యాన్సులు, స్కిట్ లు

రాష్ట్రంలో ఎటు చూసినా కల్తీ మరణాలు

ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు ?

మాజీ మంత్రి కురసాల కన్నబాబు సూటి ప్రశ్న..

ఏలూరు: అప్పులు చేయకుండా రోజు గడవని పరిస్ధితుల్లో రాష్ట్రాన్ని నిలబెట్టిన కూటమి ప్రభుత్వం.. అసెంబ్లీలో మాత్రం బడ్జెట్ పై సమగ్ర చర్చ జరపకుండా పారిపోయిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆక్షేపించారు. ప్రభుత్వ అస్తవ్యస్ద ఆర్ధిక నిర్వహణ కారణంగా రాష్ట్రం దివాళా దిశగా పయనిస్తోందని కాగ్ నివేదిక బయటపెట్టిందన్నారు. అయినా దీనిపై అసెంబ్లీలో చర్చ చేయకుండా ఎమ్మెల్యేలు డ్యాన్సులు, స్కిట్ లు చేసుకోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో కల్తీ మరణాలు, బాణాసంచా పేలుడు ఘటనల్లో పదుల సంఖ్యలో జనం చనిపోయినా ప్రభుత్వానికి పట్టడం లేదని కురసాల కన్నబాబు ఆరోపించారు. 
ప్రెస్ మీట్ లో కన్నబాబు ఇంకేమన్నారంటే..
    
సర్కార్ తప్పుడు లెక్కల్ని బయటపెట్టిన కాగ్

ఈసారి బడ్జెట్ సమావేశాలు డొల్లగా కనిపించాయి. చంద్రబాబు కేవలం మాటలతో, ప్రచారంతో కాలం గడుపుతారు తప్ప ఆయనకు పెద్దగా ప్రజలకు ఏదో చేయాలి, తన మార్కు ఉండాలన్న ఆలోచన ఉండదు. ఆ రోజుకు హెడ్ లైన్స్ లో ఉన్నామా లేదా అన్నదే తప్ప పెద్దగా లక్ష్యాలు ఏవీ ఉండవు. ఈ రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఎంత దారుణంగా దిగజారి పోయిందో కాగ్ నివేదిక బయటపెట్టింది. కానీ చంద్రబాబు మాత్రం తప్పుడు లెక్కలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్ర పరిస్ధితి అల్లకల్లోలంగా ఉంది. అరాచకంగా ఆర్దిక వ్యవస్థను నడుపుతున్నారు. అప్పులు చేయకుండా రోజు గడవని పరిస్ధితి ఉంది. యుద్దాలు, సంక్షోభాలతో ఉన్న దేశాల కన్నా ఏపీ ఆర్ధిక పరిస్ధితి దారుణంగా ఉందని కాగ్ నివేదికతో మరోసారి తేలిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం గత 365 రోజుల్లో 357 రోజులు అప్పులు చేశారు. సంపద సృష్టిస్తాను, నా కన్నా సీనియర్ లేరని చెప్పుకునే చంద్రబాబు.. అప్పులు తప్ప ఈ రాష్ట్రానికి ఆర్ధిక ప్రయోజనం కలిగించే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. తాజాగా కేంద్రం వాహనాలపై జీఎస్టీ తగ్గిస్తే దాన్ని కూడా 10 శాతం రోడ్డు సెస్సు విధించి లాక్కునే ప్రయత్న చేశారు. 

దాదాపు ప్రతీ రోజూ అప్పు- ఏం చేస్తున్నారో తెలీదు

ఎఫ్ఆర్ఎంబీ నిబంధనల్ని చంద్రబాబు చాలా సహజంగా ఉల్లంఘిస్తున్నారు. పరిమితికి మించి చేసిన అప్పులతో రాష్ట్రం అధోగతి పాలు కాబోతోందని కాగ్ స్వయంగా చెప్పింది. గతంలో 2014-19 మధ్య కూడా  ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి 17 వేల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కూడా 2024-25లో రెవెన్యూ లోటు ఎఫ్ఆర్బీఎంలో 2.7 శాతం ఉండాల్సింది 3.75 శాతానికి తీసుకెళ్లారు. గత 20 నెలల్లో 3.18 లక్షల కోట్లు అప్పులు చేసి అదో ఘనతలా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు గతంలో జగన్మోహన్ రెడ్డికి 100 కోట్లతో రాష్ట్ర ఖజానా అప్పగిస్తే.. తిరిగి ఆయన దిగిపోయే నాటికి అదే చంద్రబాబుకు 7500 కోట్ల నిధులతో దాన్ని అప్పగించారు. ప్రభుత్వ ఆర్దిక నిర్వహణకు కొలమానంగా దీన్ని భావించవచ్చు. అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చెప్తున్న చంద్రబాబు.. తన రెండేళ్ల పాలన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అని కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తెస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఇంటి అవసరాలకు తెచ్చినట్లు ప్రభుత్వం అప్పులు చేస్తోంది. మీరు అప్పు తీసుకొచ్చిన డబ్బు ఏం చేశారు, ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేశారో చెప్పాలి. 365 రోజుల్లో 357 రోజులు అప్పులు చేస్తున్నారని మేం కాదు కాగే చెప్పింది. అంటే రోజువారీ అప్పు చేయకపోతే రాష్ట్రానికి రోజు గడవని పరిస్ధితి ఉంది. సకాలంలో అప్పులు తిరిగి చెల్లించక ఆర్బీఐకి 303 కోట్లు వడ్డీ చెల్లించారు. చేబదుళ్లకు సైతం వడ్డీ చెల్లించాల్సి రావడం దారుణం. 

దివాళా దిశగా రాష్ట్రం 

బడ్జెట్ లో 2.69 కోట్ల రెవెన్యూ వస్తుందని చెప్తే వాస్తవంగా వచ్చింది 2.49 వేల కోట్లు మాత్రమే. ఇంత పెద్ద మొత్తంలో అంచనాలు అందుకోలేక లోటు కనిపిస్తుంటే మీకు దిక్కుతోచక అప్పులు చేయాల్సి వస్తోందని అర్థమవుతోంది. మరి ఈ డబ్బులు ఎక్కడ ఖర్చుపెడుతున్నారో చెప్పాలి. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్లు ఒక్క ఏడాదిలో 10,620 కోట్లు తగ్గిపోయాయి. స్థానిక సంస్థల్ని బలోపేతం చేస్తామని చెప్పిన మీరు ఇప్పుడేం సమాధానం చెప్తారు. 2024-25లో మూలధన వ్యయం 45,382 కోట్లు చేస్తామని బడ్జెట్ లో చెప్పి 16,141 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. అంటే 50 శాతం కూడా ఖర్చుపెట్టలేకపోయారు. ఇది రాష్ట్ర జీఎస్డీపీలో ఒక్క శాతం మాత్రమే. ఇది దేనికి సూచికో ప్రభుత్వం చెప్పాలి. అభివృద్ధికి పెట్టే మూలధన వ్యయం తగ్గిపోవడం రాష్ట్రానికి ప్రమాదకరమా కాదా చెప్పాలి. రాష్ట్రం దివాళా దిశగా వెళ్తోందని కాగ్ లెక్కలే చెప్తున్నాయి. అప్పుల లెక్కలు కూడా బడ్జెట్ లో పెట్టలేని పరిస్దితిలో ఉన్నారు. భారీగా అప్పులు చేసినా మూలధన వ్యయం చేయలేకపోతున్నారు. ద్రవ్యలోటు సైతం 4 శాతం ఉండాల్సి ఉండగా... 5.05 శాతానికి  చేరుకుంది. దీర్ఘకాలికంగా రాష్ట్రంలో ఆస్తులు సృష్టించే ఆలోచన మీకు లేదు. రెవెన్యూ లోటు 2.7 నుంచి 3.75కి పెరిగింది. పరిస్ధితులు ఇంత ఆందోళనకరంగా ఉంటే ఇంకా గొప్పలు చెప్పుకుంటున్నారు. 
కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ సైతం 40 శాతం తగ్గిపోయింది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల్ని పట్టించుకోవడం లేదని, వాళ్లను ఒప్పించి నిధులు కూడా తెచ్చుకోలేని పరిస్ధితుల్లో ఉన్నారని స్పష్టమవుతోంది. 

పోలవరంలో తప్పిదాలపై కాగ్ అక్షింతలు

చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్టుకు భవిష్యత్తులో ప్రమాదమని నిపుణుల బృందం ఇప్పటికే చెప్పింది. 2017-18లో అంటే చంద్రబాబు హయాంలో ఆనాటి నిర్మాణ తప్పిదాల వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిని సుమారు 400 కోట్లు వృథా అయ్యాయని కాగ్ చెప్పింది. పోలవరం పనుల్లో షెడ్యూల్స్ పాటించకపోవడం వల్ల, నామినేషన్ మీద పనులు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి విపరీతమైన నష్టం వాటిల్లిందని కాగ్ చెప్పింది. దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ విధానం తెచ్చి డబ్బులు ఆదా చేస్తే.. మీరు నామినేషన్ మీద పనులు ఇచ్చి ఖజానాకు నష్టం చేశారు. 
వైఎస్సార్ పుణ్యం వల్ల మొదలైన ప్రాజెక్టు మాదే అని ప్రచారం చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్దంగా చేస్తున్న పోలవరం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల్లో సాంకేతిక లోపాల మీద సీడబ్ల్యూసీ అభ్యంతరాలు చెప్పింది వాస్తవమా కాదా చెప్పాలి. గతంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ లు పూర్తి చేసి గోదావరి ప్రవాహం మళ్లించకుండా డయాఫ్రమ్ వాల్ మొదలుపెట్టడం వల్ల అది కోతకు గురైందో లేదో చెప్పాలి. మీ తప్పిదాల వల్ల  భవిష్యత్తులో ప్రాజెక్టుకు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? సీడబ్ల్యూసీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ?

ప్రజల కష్టాలు వదిలేసి ఎమ్మెల్యేలు డాన్స్ లు, స్కిట్ లు

రాష్ట్రంలో ప్రజలు కష్టాలు, ఇబ్బందుల్లో ఉంటే ఎమ్మెల్యేలు మాత్రం డ్యాన్సులు, పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. రాజమండ్రిలో కల్తీ పాలతో ఏడుగురు చనిపోయారు, 15 మంది ఆస్పత్రిలో చికిత్స  పొందుతున్నారు. వేట్లపాలెంలో బాణాసంచా పేలి 26 మంది చనిపోయారు.  మరో నలుగురు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. శ్రీకాకుళంలో నీరు కల్తీ జరిగి ఆరుగురు చనిపోయారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి తర్వాత ప్రజల కనీస అవసరాలపై కూడా ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదు. ఇవన్నీ వదిలేసి ఎమ్మెల్యేలు ఏకపాత్రాభినయాలు, స్కిట్లు వేసుకుంటున్నారు. ఎమ్మెల్యేల్లో ఇంత పెద్ద నటులు ఉన్నారా అని జనం ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఎంతకాలం నటిస్తూ ప్రజల్ని మభ్యపెట్టి గడిపేస్తారు. రాష్టంలో ప్రజలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చంద్రబాబు కొత్త పథకం తెచ్చారు. గతంలో చెప్పిన మాటలకు విరుద్దంగా ఇప్పుడు మాట మార్చి ఎక్కువ మందిని కనమంటున్నారు. మూడో కాన్పుకు 25 వేలు ఇస్తాం, పురుషులకూ సెలవులు ఇస్తాం, ఉచితంగా ఐవీఎఫ్ కేంద్రాలు పెడతామంటున్నారు. ఆయన మాటలకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చప్పట్లు కొడుతూ వేరే అర్ధాలతో నవ్వుకుంటున్నారు. ఉన్న జనాభాకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేవు. కనీసం గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు లేవు. సుఖ ప్రసవాలు జరిగే వ్యవస్థ లేదు. కానీ విజనరీ చంద్రబాబు ఇంకా  పిల్లల్ని కనమని చెప్పడం దుర్మార్గంగా ఉందని కన్నబాబు ఆక్షేపించారు.

Back to Top