తాడేపల్లి: పథకాల కోసం ఎదురు చూసిన రాష్ట్ర ప్రజల్ని బడ్డెట్ తీవ్రంగా నిరాశపర్చిందని, గతంలో జగన్‌గారి హయాంలో పథకాల వరద పారిస్తే, ఇప్పుడు పరిస్ధితి పూర్తి భిన్నంగా మారిపోయిందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. బడ్జెట్ ప్రవేశపెట్టాక, లోటుపాట్లు సమగ్రంగా చర్చించకుండానే సెషన్ ముగించారని, ఆ తర్వాత మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు ఆటలు ఆడుకుంటా, స్కిట్లు వేసుకుంటూ కాలక్షేపం చేశారని ఆయన ఆక్షేపించారు. బడ్జెట్లో కాకి లెక్కలపై కాగ్ ఇప్పటికే ప్రభుత్వాన్ని కడిగేసిందని గుర్తు చేశారు. అయినా కూటమి ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గుర్తు చేశారు. ప్రెస్ మీట్‌లో తాటిపర్తి చంద్రశేఖర్ ఇంకేమన్నారంటే..: పూర్తిగా నిరాశపర్చిన బడ్జెట్. అంతా అంకెల గారడీ: సాధారణంగా బడ్జెట్లో పథకాల కోసం ప్రజలు ఎదురు చూస్తుంటారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో బడ్జెట్ పెడితే చాలు పథకాల వరద పారుతుందని అంతా ఆశించారు, అదే విధంగా అందుకున్నారు. ఇప్పుడు చూస్తే పెన్షన్లలో కోతలు, బడ్జెట్లో వాతలు. ‘అప్పుల్లో టాప్.. అభివృద్ధిలో అట్టర్‌ఫ్లాప్’ అన్నట్లుగా ఇప్పుడు పరిస్ధితి తయారైంది. రాష్ట్ర పన్నుల పెరుగుదల చూస్తే 23 రాష్ట్రాల కన్నా ఎక్కువగా 22వ స్ధానంలో ఉంది. మరోవైపు రాష్ట్రం 11 శాతం పైన జీఎస్డీపీ వృద్ధి సాధిస్తుందని టీడీపీ లెక్కలు చెబుతుంటే.. కాగ్ లెక్కలు మాత్రం దాన్ని కేవలం 1.97 శాతంగా చూపుతున్నాయి. కేంద్రంతో పోల్చుకుంటే పన్నుల ఆదాయంలో 6.94 శాతం వృద్ధి సాధించినా 8 శాతం జీడీపీ వృద్ది కనిపిస్తోంది. మరి ఇదెలా సాధ్యం?. మూలధన లోటు ఏకంగా 3.75 శాతంగా ఉంది. ఎఫ్‌ఆర్బీఎం పరిమితి 2.7 శాతాన్ని ఇది మించిపోయిది. ద్రవ్యలోటు ఎఫ్‌ఆర్బీఎం పరిమితి ప్రకారం 4 శాతం ఉండాల్సి ఉండగా.. 5.05 శాతానికి చేరింది. అంటే విపరీతంగా పెరిగిపోయింది. మూలధన వ్యయం గతేడాదితో పోలిస్తే 16 శాతం తగ్గింది. దీనిపై ఎక్కడా చర్చ జరగదు. బడ్జెట్ పై చర్చపెట్టకుండా డ్యాన్స్ లు, నాటకాలా?: బడ్జెట్ అయిపోయాక దీనిపై చర్చ పెట్టకుండా.. రెట్రో డ్యాన్స్ లు, కోరస్ పాటలు, క్రికెట్ మ్యాచ్ లు, బ్యాడ్మింటన్ కోర్టులు, పౌరాణిక కథలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి జరిగిన మంచి ఏంటంటే ఏమీ లేదు. సమస్యల గురించి ప్రశ్నిస్తే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు లేరు కాబట్టి చిడతలు వాయించుకుంటున్నారు. మండలికి మాత్రం మొహం చాటేశారు. కల్తీపాలకు జనం చనిపోతున్నారని అంటే లోకేష్ వెళ్లి క్రికెట్ ఆడుకుంటున్నారు. బాణాసంచా పేలి పదుల సంఖ్యలో జనం చనిపోతే సచిన్ ఇంట్లో పెళ్లికి లోకేష్ వెళ్లిపోయారు. ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తుంటే ఇది సభా లేక తిరునాళ్లలో ప్రభా అన్నట్లు ఉంది. మండలి ఛైర్మన్ పై మతం పేరుతో దాడి: 11 మందే ఉన్నా 1100 మందిలా మాట్లాడుతున్నామంటున్నారు.. అవును నిజమే.. జన బలంతో గెలిచిన ప్రభుత్వం మాది, ధన బలంతో గెలిచిన ప్రభుత్వం మీది. జనంతో నడిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మేము, జనాన్ని పొడిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మేము. కాబట్టే ప్రజల మధ్యకు వెళ్తే ఉవ్వెత్తున ఎగసిన ఉప్పెనలా తరలివస్తున్న ప్రజాభిమానం మా సొంతం. మీరు అసెంబ్లీ సాక్షిగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశపూర్వకంగా కించపరిచే స్కిట్లు వేసుకోవడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, దేశ భక్తీ లేదు, దైవ భక్తీ అంతకన్నా లేదు. మండలి ఛైర్మన్ ను మతం పేరుతో వ్యాఖ్యలు చేసిన ఘటనలు దేశంలో గతంలో ఎక్కడా జరగలేదు. క్రిస్టియానిటీ శాపమా, పాపమా, అదేమైనా నేరమా, ఘోరమా చెప్పాలి. మండలిలో చర్చ పెడితే మీ ప్రతిష్ఠ దిగజారుతుందని ఏకంగా చైర్మన్ పైనే దాడికి దిగారు. రాష్ట్రంలో దారుణంగా నిరుద్యోగం: 2024లో జగన్‌గారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో నిరుద్యోగిత శాతం 4.1 అయితే ఇప్పుడు తాజాగా అది 8.2 శాతానికి చేరింది. మీరు నిజంగానే ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగిత శాతం తగ్గుతుందా? లేక పెరుగుతుందా? ఏ పథకాలకూ కేటాయింపుల్లేవు. ప్రజాహితం గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు చంద్రబాబు దేశ రాజకీయాల్లోకి వెళ్తానంటున్నారు. 50 ఏళ్లలో ఇక్కడ ఆయన చేసిందేంటో తెలియదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన పాలనలో గతేడాదితో పోలిస్తే 16 శాతం ఎక్కువ అప్పులు తీసుకున్నారు. ఒక్క ఏడాదిలో రూ.85 వేల కోట్లకుపైగా అప్పులు చేశారు. వీళ్ల ఆర్దిక క్రమశిక్షణ లోటును, వైఫల్యాల్ని కాగ్ పూర్తిగా కడిగేసింది. కాబట్టి ఇప్పటిౖకైనా చంద్రబాబు కామెడీ షోలు ఆపి ప్రజల కోసం పని చేయాలని ఎమ్మెల్యే చంద్రశేఖర్ హితవు చెప్పారు.