తాడేపల్లి: ఏపీలో ప్రస్తుతం బాబు- బీరు- సర్కారు.. పాలసీ అమలవుతోందని, చంద్రబాబు కనుసన్నల్లో మద్యం మాఫియా చెలరేగిపోతుందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమలా తయారవుతున్న నకిలీ మద్యం.. రాష్ట్రంలో ఏరులైపారుతోందని వెల్లడించారు. నకిలీ మద్యం తయారీలో పాత్రధారులు, సూత్రధారులంతా అధికారపార్టీ నేతలేనని.. ములకల చెరువులో టీడీపీ తంబళ్లపల్లె ఇన్ ఛార్జి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలోనే సాగిన నకిలీ మద్యం తయారీ ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. అయినా ఈ కేసులో ఇంతవరకు జయచంద్రా రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. నకిలీ మద్యం తయారీ గుట్టురట్టు చేశాడన్న కక్షతోనే మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్టు చేశారని.. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యలేనని తేల్చి చెప్పారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా జరుగుతున్న వైయస్ఆర్‌సీపీ నేతల అక్రమ కేసులకు భయపడేదిలేదని, అక్రమ అరెస్టులకు సహకరిస్తున్న అధికారులకు వైయస్.జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టపరంగా శిక్షఖాయమని స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారంటే.. ● బాబు- బీరు- సర్కారు పాలసీ... కూటమి ప్రభుత్వం ఏర్పడితే అందరికీ నాణ్యమైన మద్యం అందజేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, గెలిచాక బాబు, బీరు, సర్కారు అనే పాలసీ తీసుకొచ్చాడు. అమాయకులైన మద్యపాన ప్రియుల్ని బలతీసుకోవడానికి తీసుకొచ్చిన ఈ పాలసీ ప్రకారం మద్యం తయారు చేసేదీ, సరఫరా చేసేది, విక్రయించేది అంతా టీడీపీ నాయకులే. ఈ క్రమంలోనే తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి ములకలచెరువులో ఏర్పాటు చేసిన నకిలీ మద్యం తయారీ యూనిట్ గుట్టురట్టయింది. బాబు అండ్ కో తయారు చేస్తున్న బాటిలింగ్ యూనిట్ వ్యవహరం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. ఎన్‌సీబీయన్ అనేది ఒక బ్రాండ్ అని చంద్రబాబు చెప్పుకుంటాడు. వాస్తవానికి ఈ ఎన్‌సీబీయన్ అంటే.. నారా చీప్ బాటిల్ నెట్వర్క్.. ఈ నెట్వర్క్ ద్వారా నకిలీ లిక్కర్ కుటీర పరిశ్రమల ద్వారా మద్యం తయారు చేసి పల్లెల్లో బెల్ట్ షాపుల ద్వారా, పట్టణాల్లో పర్మిట్ రూమ్‌ల ద్వారా విచ్చలవిడిగా తాగిస్తున్నారు. బ్రాండ్ ఏదైనా సరే నకిలీ లేబులింగ్ వేసి విక్రయిస్తున్నారు. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అని పిలవడం మానేసి టోటల్ డూప్లికేట్ ప్రొడక్షన్ పార్టీ అని పిలవాలేమో.. ● పాలవ్యాన్ లో మద్యం- అధికార పార్టీ నేతల హస్తం... తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రా రెడ్డి ములకల చెరువులో ఏర్పాటు చేసిన నకిలీ మద్యం తయారీ యూనిట్ వ్యవహారం భలే గమ్మత్తుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో పాల వ్యాన్ ప్రతి మద్యం దుకాణానికి వెళ్తోంది. పాల వ్యాన్ మద్యం దుకాణం వద్దకి రోజూ ఎందుకు వెళ్తుందా అని దాన్ని రోజూ గమనిస్తున్న వారు వ్యాన్ ఓపెన్ చేసి చూస్తే అందులో అన్ని బ్రాండ్లకు చెందిన నకిలీ మద్యం బాటిళ్లు కుప్పలుకుప్పలుగా కనిపించడంతో అందరూ విస్తుపోయారు. వెంటనే ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగప్రవేశం చేశారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కి 200 మీటర్ల దూరంలోనే ఈ ములకలచెరువు తయారీ యానిట్‌ను పోలీసులు గుర్తించారు. సాధారణంగా మద్యం తయారీలో ఇథనాల్ వాడతారు. షుగర్, లిక్కర్ ఫ్యాక్టరీలున్న ప్రాంతంలో చాలా దూరం వరకు దుర్వాసన వస్తుంది. కానీ ములకలచెరువులో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కి అతి చేరువలోనే నకిలీ మద్యం తయారీ యూనిట్ నడుస్తున్నా పోలీసులకు తెలియదంటే ఆశ్చర్యం కలుగుతోంది. కూతవేటు దూరంలో ఉన్న నకిలీ మద్యం తయారీ యూనిట్ వ్యవహారం 15 నెలలపాటు పోలీసులకు అనుమానం రాకుండా ఎలా నడిచింది? ఎక్సైజ్ పోలీసుల కళ్లకు చంద్రబాబు గంతలు కట్టారా? పైగా పట్టుబడిన పాల వ్యాన్ సైతం టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి పీఏ పేరు మీదనే ఉంది. జయచంద్రారెడ్డితోపాటు ఆయన సన్నిహితుడు అద్దేపల్లి జనార్దన్‌రావుకి ఈ నకిలీ లిక్కర్ తయారీతో సంబంధం ఉన్నట్టు తేలింది. ఈ నకిలీ లిక్కర్ వ్యవహారం బయటపడినప్పుడు జయచంద్రా రెడ్డి తో పాటు ఆయన సన్నిహితుడు అద్దేపల్లి జనార్దన్‌రావు ఆఫ్రికా ఖండంలో అంగోలా అనే ప్రాంతంలో లువాండా పట్టణంలో హోటల్ అటూర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లిక్కర్ వ్యవహారంలో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అద్దేపల్లి జనార్దన్‌రావును కూడా పోలీసులు వెళ్లి అరెస్ట్ చేసి తీసుకురాలేదు. ఆయనే స్వయంగా ఆఫ్రికా నుంచి ముంబై కి వచ్చి ముంబై నుంచి విజయవాడకి వస్తే.. తాపీగా నడుచుకుని వస్తున్న ఆ మనిషిని పోలీసులు వెళ్లి గన్నవరం ఎయిర్‌పోర్టులో అక్టోబర్ 6న అరెస్ట్ చేశారు. లిక్కర్ మాఫియా నడిపిస్తున్న నిందితుడే స్వయంగా వచ్చి లొంగిపోవడం ఆశ్చర్యంగా లేదా? ● అక్రమాలు బయటపెట్టినందుకే జోగి రమేష్ అక్రమ అరెస్టు... తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి అనుచరుడు సురేంద్ర నాయుడు, జయచంద్రారెడ్డి పీఏ రాజేశ్‌కి లిక్కర్ షాపులుంటే వారు నడపలేక నష్టపోతున్నారని, అందుకే ఆ బాధ్యతలు తనకి అప్పగించారని అక్టోబర్ 6న అద్దేపల్లి జనార్దన్‌రావు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. ములకలచెరువులో ఉన్న రాక్‌స్టార్ వైన్, చంద్రాయణపల్లెలో ఉన్న ఆంధ్రా వైన్స్‌ని కేంద్రంగా చేసుకుని తాను నకిలీ మద్యం తయారు చేస్తున్నానని చెప్పాడు. ఆఫ్రికాలో కూడా మద్యం తయారీ యానిట్ నెలకొల్పడానికి ప్రాంతాన్ని అన్వేషించడానికి జయచంద్రారెడ్డితో కలిసి ఆఫ్రికాలో తిరుగుతున్నప్పుడే ఈ నకిలీ మద్యం కుంభకోణం వెలుగుచూసిందని ఆయన స్టేట్ మెంట్ ఇచ్చారు. అక్టోబరు 6, 2025నాడు ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌లో ఎక్కడైనా జోగి రమేశ్ పాత్ర ఉందని చెప్పారా? ఇదే అద్దేపల్లి జనార్దన్‌రావుకి ఇబ్రహీంపట్నంలోనూ ఏఎన్ఆర్ అనే బార్ కూడా ఉంది. ఈ బార్ విజయవాడ కమిషనరేట్ పరిధిలోకే వస్తుంది. లేని మద్యం స్కామ్ ని ఉందని మరిపించి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్న పోలీసధికారే... ప్రస్తుత విజయవాడ సీపీ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్ధానిక నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ పోలీసులు అక్కడ కూడా సోదాలు నిర్వహిస్తున్నారని తెలిసి... పోలీసులు సహాయంతో అక్కడ జరుగుతున్న అవినీతి, అక్రమ దందాను గుట్టు రట్టు చేసే క్రమంలో అక్కడ సుమారు 27,800 నకిలీ మద్యం బాటిళ్లు దొరికాయి. దీంతో జోగిరమేష్ గారిని ఈ కేసులో ఇరికిస్తే... చంద్రబాబు, లోకేష్ ల పేర్లు బయటకు రావని అక్టోబరు 30న అద్దేపల్లి జనార్ధనరావుతో మరో స్టేట్ మెంట్ ఇప్పించారు. అంటే మొదటి స్టేట్ మెంట్ ఇచ్చిన 24 రోజుల తర్వాత మరలా ఈ స్టేట్ మెంట్ ఇప్పించారు. చంద్రబాబు, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికే జోగి రమేషే నా నకిలీ మద్యం స్కామ్ ను భయటపెట్టారని చెప్పాడంటూ... జోగి రమేష్ ను అరెస్టు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇదో మైలురాయి. అద్దేపల్లి జనరార్ధరావు చెబుతున్న పచ్చి అబద్దాలను కాసేపు నిజమనుకుంటే... ఎక్కడో హత్య జరిగిందని సమాచారమిస్తూ విజిల్ బ్లోయర్ గా వ్యవహరించిన వ్యక్తిపై కేసు పెడతారా?మర్డర్ చేసినవాడి మీద కేసు పెడతారా? ● జయచంద్రారెడ్డి అరెస్టు ఎప్పుడు? ఇవాల్టికి తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి జయచంద్రారెడ్డి గారిని అరెస్టు చేయలేదు. ఆయన ఎక్కడున్నాడో తెలియదు. కానీ కృష్ణా జిల్లాలో వైయస్ఆర్‌సీపీ తరపున ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జోగి రమేష్ పై .. 24 రోజుల తర్వాత చంద్రబాబు చేతిలో మనిషైన అద్దేపల్లి జనార్ధనరావుతో స్టేట్ మెంట్ ఇప్పించి.. దాని ఆధారంగా అరెస్టు చేశారు. నిన్న సిట్ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. జోగి రమేష్ అద్దెపల్లి జనార్ధనరావుతో ఎప్పుడైనా మాట్లాడారా? వారిద్దరి మధ్య ఏవైనా లావాదేవీలున్నాయా? ఆర్దిక సంబంధాలున్నాయా? అవేవీ లేకుండానే ఒక వాంగ్మూలం రికార్డు చేసి.. అది న్యాయస్దానాల ముందు నిలబడదని తెలిసి కూడా.. ఒక తప్పుడు నేరఅంగీకార పత్రాన్ని ఉపయోగించుకుని జోగి రమేష్ ని అత్యంత హేయంగా, అవమానకరమైన రీతిలో అరెస్టు చేయడం ద్వారా జోగి రమేష్ మీద ఉన్న అక్కసు, శత్రుత్వాన్ని చంద్రాబాబు తీర్చుకున్నారు. ● నకిలీ మద్యం ప్రతి అడుగులోనూ అధికారపార్టీ నేతలే... మద్యం తయారీ చేసింది తెలుగుదేశం పార్టీ వ్యక్తులు, దాన్ని ప్రజలకు అమ్ముతుందీ, తద్వారా అక్రమార్జనకు తెరతీసింది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. దానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంది? అధికారం మీ చేతుల్లోనే ఉంది, కేంద్రంలోనూ మీరు భాగస్వామ్యులగా ఉండగా... విజయవాడ కమిషనరేట్ పరిధిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు ఎవరైనా నకిలీ మద్యం తయారు చేసే పరిస్ధితులు ఉంటాయా? నకిలీ మద్యం తయారీలో ప్రధాన ముద్దాయి అయిన అద్దేపల్లి జనార్ధనరావు... తంబళ్లపల్లె టీడీపీ నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి జయచంద్రారెడ్డితో కలిసి నెల్లూరు వాకాడు ఇంజనీరింగ్ కాలేజీలో కలిసి చదువుకున్నామని.. అతనితోనే మద్యం వ్యాపారం చేయడానికే ఆఫ్రికా వెళ్లామని కూడా చెప్పాడు. అయినా ఇవాల్టికి వాళ్లను అరెస్టు చేయరు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కి 250 మీటర్ల దూరంలో ప్రజలందరూ 20208 నకిలీ మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. వీటిలో 8వేలకు పైగా బ్యాటిళ్లుపై సీలు లేకుండా కూడా దొరికారు. సుమారు 10,050 లీటర్ల స్పిరిట్ కూడా అక్కడే దొరికింది. తేలుకుట్టిన దొంగల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలందరూ ఇదే వ్యాపారం చేస్తూ ఏపీలో ఎక్కడికెళ్లినా నకిలీ మద్యం దొరకడానికి కారణం అయ్యారు. అయినా అక్రమంగా వైయస్ఆర్‌సీపీ నేత జోగి రమేష్ ను అరెస్టు చేశారు. ఏపీలో నకిలీ మద్యం కుంభకోణం ఎలా జరుగుతుందన్నది మా పార్టీ అధ్యక్షులు వైయస్.జగన్ ఆధారాలతో సహా భయటపెట్టారు. రాష్ట్రంలో ఏ నాలుగు మద్యం బాటిళ్లు తీసుకున్నా అందులో 3 బాటిళ్లు టీడీపీ నేతల మాన్యుఫ్యాక్చరింగ్ బాటిల్లే కనిపిస్తున్నాయి. చంద్రబాబు కనుసన్నల్లో కాకుండా, ఆయన డైరెక్షన్ లేకుండా నకిలీ మద్యం తయారీ జరుగుతుందా? ఆయన సమాధానం చెప్పితీరాలి. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో టీడీపీ నేతలు ఎలా నకిలీ మద్యం కుటీరపరిశ్రమను ఏర్పాటు చేశారో నారా లోకేషే చెప్పాలి? 26 జిల్లాల్లో నకిలీ మద్యం సరఫరా జరుగుతున్నా కూడా ఎక్సైజ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తూ.. టీడీపీకి వంత పాడుతూ , ఏమాత్రం సంబంధం లేని వైయస్ఆర్‌సీపీ నేతలపట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. అది ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం. మా మీద పెద్ద ఎత్తున కేసులు పెడుతున్నారు. ఇబ్బంది పెడుతున్నారు. చట్టాన్ని, ధర్మాన్ని పక్కన పెట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి పాలేరు తనం చేస్తూ, చంద్రబాబు అడుగులకి మడుగులు వత్తుతూ, నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో.. వారందరిపై రేపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయబద్దంగా, చట్టబద్ధంగా చర్యలు తప్పవు. వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయని.. వైయస్ఆర్‌సీపీ నేతలపై మీరు చేస్తున్న దమనకాండ ఏదో ఒక రోజు అంతం కాక తప్పదని, వైయస్.జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దుష్టశిక్షణ, శిష్ట రక్షణ తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు చేస్తున్న ఈ అక్రమ నిర్భందాలు, అరెస్టులపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు.