శ్రీకాకుళం: విత్తనం నుంచి విక్రయం వరకు నినాదంతో అన్నదాతకు అడుగడుగునా వైయస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలబడితే... ఎరువులు, విత్తనాల కోసం వాళ్లను రోడ్డెక్కించి మరలా పాత రోజుల్లోకి లాక్కుపోయిన ఘనత చంద్రబాబుదేని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా మాట్లాడుతూ... చంద్రబాబు పాలనలో అన్నదాతకు వాతలు, సుఖీభవకు కోతలు తప్ప రైతు సంక్షేమం ఊసే లేదని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. రైతుల పట్ల వైయస్ జగన్ మోహన్ రెడ్డిది గొప్ప మనసు దేశంలోనే తొలిసారిగా రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వాలన్న ఆలోచన వచ్చిన మొట్టమొదటి నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. 2017 వైయస్ఆర్‌సీపీ ప్లీనరీ సమావేశంలో వైయస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. దీన్ని ప్రామాణికంగా తీసుకుని తెలంగాణాలో కేసిఆర్ రైతుబంధు పధకాన్నిప్రవేశపెట్టారు. అనంతరం ప్రధాని నరేంద్రమోదీ కూడా 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు రూ.4 వేలు పీఎం కిసాన్ పథకాన్ని ప్రకటించారు. ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు మార్చి పసుపు, కుంకుమ కింద వాడుకుని పేదలకు చెల్లని చెక్కులు ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకిచ్చిన హామీకంటే మిన్నగా అమలు చేసింది. ప్రతిఏటా రూ.12,500 ఇస్తామని ప్రకటించిన దానికన్నా అధికంగా రూ.13,500 ఇచ్చాం. రైతులపట్ల వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి కున్న గొప్ప మనసుకి ఇదోక ఉదాహరణ. ఇవాళ చంద్రబాబు నులకమంచం ఆలోచనలు ఓసారి చూస్తే... ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13-14 నెలలు కావస్తోంది. గతంలో మా ప్రభుత్వంలో ఇస్తున్న పథకాల పేర్లు మార్చడంతో పాటు అంతకంటే మిన్నగా ఇస్తామని హామీలిచ్చారు. 2024 మే నెలలో ఎన్నికలు కాగా కూటమి ప్రభుత్వం జూన్ లో ప్రమాణస్వీకారం చేసింది. రైతు భరోసా డేటా కోసం వెదుక్కోవాల్సిన అవసరం లేదు. అయినా కూడా గతేడాది రైతు భరోసా ఎగ్గొట్టారు. ఈ ఒక్కపథకమే కాదు అమ్మఒడి పథకం కూడా ఎగ్గొట్టారు. మరలా 2029లో కూడా ఇదే చేస్తారు. ప్రజలిచ్చిన ఐదేళ్ల కాలంలో సాంకేతికంగా రెండు సంవత్సరాలు ఎగరగొట్టే కుట్ర ఇది. ప్రజలందరూ దీన్ని గమనించాలి. మీ పాలన ఎమర్జెన్సీ కంటే భిన్నంగా లేదు: రైతు భరోసా డేటా ప్రకారం సుమారు 53 లక్షల మంది రైతులు ఉంటే... మీరు కొత్తగా సర్వే చేసినట్లు 7 లక్షల మంది రైతులకు ఈ పథకం ఎగరగొట్టి 46 లక్షలకు కుదించారు. అది కూడా పీఎం కిసాన్ కింద మోదీ గారు రూ.2 వేలకు మరో రూ.5వేలు కలుపుకుని రూ.7వేలు ఇస్తామంటున్నారు. చంద్రబాబూ మీ నులకమంచం తెలివితేటలను ప్రజలు గమనిస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకొండి. పీఎం కిసాన్ కు అదనంగా రూ.20 వేలు ఇస్తామని మీరు, మీ కుమారుడు గొంతు చించుకుని అరిచిన మాట మర్చిపోయారా ? మీరు చెప్పినదానికి, చేసేదానికి సంబంధం లేదు. దీని గురించి ప్రశ్నిస్తే తిరిగి మాకు నాలుక మందం అంటారు. ఇంకా ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లో పెడతారు. ప్రశ్నిస్తే దేశద్రోహంలా కేసులు పెడుతున్నారు. మీ పాలన ఎమర్జెన్సీ పాలన కంటే మెరుగ్గా, భిన్నాంగా ఏమీ లేదు. ప్రజలందరికీ ఇదే విషయాన్ని మనవి చేస్తున్నాను. కూటమి పాలనలో దయనీయంగా రైతులు: ఆ రోజు వైయస్ఆర్‌సీపీ పాలనలో సీడ్ టు సేలే విత్తనం నుంచి విక్రయం వరకు అన్న విధానాన్ని తీసుకున్నాం. ఇంటివద్దకే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సబ్సిడీ మీద అందించాం. ప్రతి వారం ఆర్బీకేల వద్ద రైతులకు సాగులో అన్ని రకాల చేయిందించే కార్యక్రమం చేసాం. వర్షాల వల్ల రైతులు నష్టపోతే అదే ఏడాది ఇన్ పుట్ సబ్సిడీవైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రమే ఇచ్చాం. నేడు రైతుల పరిస్ధితి అత్యంత దయనీయంగా తయారైంది. ఇవాళ ఇన్ పుట్ సబ్సిడీ అన్న మాట కూటమి ప్రభుత్వ డిక్షనరీ నుంచి తొలగించారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు కన్నీళ్లు తప్ప ఇంకేం మిగల్లేదు. పేరుకే అన్నదాత సుఖీభవ కానీ.. అన్నదాతకు వాతలు, సుఖీభవలో కోతలు పెట్టారు. నాడు రైతులను అన్నిరకాలుగా ఆదుకున్న రైతుభరోసా కేంద్రాల అడ్రెస్ నేడు కరువైంది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతుల ఆత్మహత్యల వార్తలే చూడలేదు. ఇవాళ అధికారికంగా 250 మంది కేవలం ఏడాది కాలంలో ఆత్మహత్యకుపాల్పడ్డారు. మరలా సాగు దయనీయంగా మారింది. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు పాత రోజుల్లోకి రాష్ట్రం వెళ్లిపోయింది. మామిడి పంట కేజీ రూ.2 కు అమ్ముకునే స్థితికి దిగజార్చారు. గతంలో కేజీ కనీసం రూ.22 నుంచి రూ.29 ధర ఉండేది. రైతులకు కనీస మద్ధతు ధర అందనప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని వారికి తగిన ధర అందించాలి. దానికోసం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ధరల స్థిరీకరణ నిధి పేరుతో రూ.3వేల కోట్ల కేటాయించారు. ఈ ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించింది. మంత్రి అచ్చెన్నాయుడుకి ఆ శాఖ మీద పట్టు, ఆసక్తి ఉన్నట్టు ఏ రోజూ కనిపించడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది.. వ్యవసాయశాఖ నుంచి రైతులకు ఇన్ పుట్స్ రాని పరిస్థితి. విత్తనాలు, ఎరువులు లభ్యత, సబ్సిడీ గురించి కనీస సమచారం కూడా లేదు. పల్లెల్లో యూరియా, డీఏపీ లభ్యత లేక రైతులు అల్లాడిపోతున్నారు. మ హయాంలో ఇంటికి ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తే... ఈ ప్రభుత్వం మరలా వారిని పాత రోజుల్లోకి తీసుకుని పోయి రోడ్డెక్కించింది. ఇది రివర్స్ పాలన ప్రభుత్వం. పొగాకు రైతుల పరిస్థితి చూస్తే గతంలో కేజీ రూ.360 పైగా ఉంటే, ఇవాళ కనీసం రూ.200 ధర రావడం లేదు. మర్చి క్వింటాళు రూ.27వేలు పై బడి ఉండే పరిస్థితి నుంచి నేడు రూ.8-10 వేలకు మించి ధర రావడం లేదు. ఏ పంట మీద ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో దళారులు లేకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తే ఈ ప్రభుత్వంలో దళారులు రాబందుల్లా వాలిపోయారు. ఇప్పుడు ప్రతి రైతుకు ఎంఎస్పీ కంటే రూ.2-3 వందల తక్కువ ధర వస్తోంది. ఆక్వా చరిత్రలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి యూనిట్ రూ.1.50 కే అందించడం ద్వారా చరిత్రలో నిల్చిపోయారు. ఇది గొప్ప మలుపు. లేదంటే కోవిడ్ విధ్వంసంతో ఆక్వారైతులు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి. ఆ రోజు ఎంఎస్పీ స్థిరంగా నిలబెట్టాం. ఈ ప్రభుత్వంలో ఆక్వా రైతులు గోడు ఎవరికీ పట్టడం లేదు. అమెరికా టారిఫ్, సుంకాలు అని చెప్పి ప్రభుత్వం తప్పించుకుంటుంది. సిండికేట్ గా ఏర్పడి ఆక్వాను అధోగతి పాల్జేస్తున్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధి లేమికి ఇదోక ఉదాహరణ. ఉచిత పంటల బీమా రైతులకు జీవనాడి. అలాంటి పథకాన్ని తీసేసింది. ఇ క్రాప్ చేసుకున్న ప్రతి రైతుకు ఉచిత పంటల బీమా వర్తింపజేయడం మంచి విధానం కాదని చెబుతున్నారు. గతంలో చంద్రబాబు చేసిన విధంగా రైతుల నుంచి ప్రీమియం కట్టించే మంచిది అదే విధానంలో వెళ్తామని చెప్పారు. రైతుల తరపున ప్రీమియం చెల్లించే మనసు లేక ఈ మాటలు చెబుతున్నారు. తక్షణమే ఉచిత పంటల బీమాని అమలు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఎంఎస్పీ అనే పదమే కూటమి ప్రభుత్వానికి తెలియదు. సున్నా వడ్డీ పంట రుణాలెక్కడ ? గతేడాది ఇన్సూరెన్స్ ఎంత మందికి ఇచ్చారు? అయినా ఐ టీడీపీ ఉదయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ స్ధాయిలో ఎలివేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదా ప్రజలతో మమేకం అవడం. సినిమా సెట్ ల పాలన: ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్తుంటే.. మీరు బారికేడ్లు పెట్టి, రోడ్డు తవ్వి, ఎన్ని ఆంక్షలు పెట్టినా వాటిని ఛేదించుకుని మా నాయకుడ్ని చూడాలని ప్రజలు వెల్లువలా వస్తున్నారు. దాన్ని ప్రజలతో మమేకమవడం అంటారు. మీరు చేస్తున్నది కేవలం సినిమా సెట్టింగ్ మాత్రమే చంద్రబాబూ. ఓ రాజకీయ పార్టీ నాయకుడు వస్తే ఇంతమంది మాత్రమే రావాలన్న నిబంధన ఏ రాజ్యాంగంలో ఉంది. ఏ పోలీస్ మాన్యువల్ లో ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలన్న మీరు చూసే కొద్దీ.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి సైనికులుగా ప్రతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంగా వస్తారు. మీ ఫై ఫిర్యాదు చేసిన మురళీ టీడీపి నేతే: ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టొద్దంటూ మురళీ అనే వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి మెయిల్ పెట్టాడని మంత్రి లోకేష్ చెబుతూ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాలూకా వ్యక్తే ఈ మెయిల్ పెట్టాడని చెప్పారు. మీరు చెప్పిన మురళీ మీతోనూ, చంద్రబాబు గారితోనూ ఫోటో దిగారు. అమెరికా ఎన్నారై అయిన మురళీ చిలకలూరిపేటకు చెందిన వ్యక్తి. ఈయనకు చిలకలూరిపేటలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది. దాన్ని చిలకరూలిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అనుచరులు సాయి కార్తీక్ సిటీ సెంటర్ షాపింగ్ కాంప్లెక్స్ ని కబ్జా చేసి.. మూసివేయించారు. టీడీపీ కార్యకర్త అయిన మురళీ ఆ పార్టీ అధికారంలోకి రావాలని లక్షలు ఖర్చుపెట్టిన ఆయన ఆస్తిని టీడీపీ నేతలు కబ్జా చేశారు. దీనిపై ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా పోలీసులు సహకరించలేదు. దీంతో ఆయన నాడు - నేడు అని గతంలో కళకళలాడుతూ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ నేడు వెల వెల పోతున్న ఫోటోలు పెట్టుకున్నారు. టీడీపి నేతల దౌర్జన్యాలపై కనీసం స్పందించని చంద్రబాబు, లోకేష్, వాళ్ల పార్టీ నేతలపై మండి ఆయన ఫిర్యాదు చేశాడు. ఇటీవల పల్నాడు జిల్లాలో రవితేజ అనే టీడీపీ కార్యకర్తే రప్పా రప్పా అనే ప్లెక్సీ డిస్ ప్లే చేశాడు. ఆయన లాగే మురళీ కూడా వీళ్లమీద మండి నాలుగు మెయిల్స్ పెట్టి ఫిర్యాదు చేశానని కూడా చెప్పాడు. లోకేష్ మాత్రం దాన్ని వైయస్ఆర్‌సీపీకి ఆపాదిస్తాడు. సింగపూర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామంటున్నాడు. వాస్తవానికి మురలీ ఏఫ్రిల్ 18న తన కాంప్లెక్స్ కబ్జాపై రెడ్ బుక్ రాజ్యాంగం, గుండా గిరిపై మెసేజ్ చేశాడు. అయ్యా లోకేష్ టీడీపీ కార్యకర్తలకు ఈ మాటలు చెప్పుకొండి. రాష్ట్ర ప్రజలకు మాత్రం మీ మోసాలు అర్ధం అయ్యాయి. మీరు సింగపూర్ ఎందుకు వెళ్లారు, నోట్ల కట్టలు ఏ షిప్ లో తీసుకెళ్లారో కూడా మీ పార్టీకి చెందిన మురళీ గారు చెప్పారు. వాటికి సమాధానం చెప్పండని సీదిరి అప్పలరాజు సూటిగా ప్రశ్నించారు.