ఏలేరు, ఐఎంజీ భూములు కేసుల్లో చంద్రబాబే బిగ్ బాస్

వైయ‌స్ఆర్‌సీపీ నేతల అరెస్టుల మీద ఉన్న శ్రద్ద.. రాష్ట్ర అభివృద్ధి మీద లేదు 

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్.

స్కిల్ స్కామ్, ఐఆర్ ఆర్ ఎలైన్ మెంట్ లోనూ బాబే బిగ్ బాస్

చివరికి బ్రీఫ్డ్ మీ కేసులోనూ బాబే బిగ్ బాస్

వెన్నుపోట్లు, రాజకీయ కుట్రలు, కుతంత్రాల్లో చంద్రబాబే బిగ్ బాస్

తేల్చి చెప్పిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. 

హామీలు అమల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం 

హామీలు అమలు చేయలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ 

ప్రజా సమస్యలు పరిష్కరించమంటే అక్రమ కేసులు

వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై అడుగడుగునా కక్ష సాధింపులు

అందులో భాగంగానే మిధున్ రెడ్డి అరెస్టు

వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తల పైనా దాదాపు 2700 కేసులు

కూటమి పాలనపై ధ్వజమెత్తిన గుడివాడ అమర్ 

లేని స్కామ్ లో మీడియా ట్రయిల్స్

వైయ‌స్ఆర్‌సీపీ కీలక నేతలపై ఎల్లో మీడియాలో వరుస కథనాలు

వాటి ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు

ఇదే ఇప్పుడు కొత్త మోడస్ ఆపరెండా

ప్రభుత్వం, ఎల్లో మీడియా తీరుపై తీవ్రంగా మండిపడ్డ అమర్నాథ్ 

విశాఖపట్నం: కూటమి పార్టీలకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్షసాధింపు, కేసులు, అరెస్టులు మీద ఉన్న శ్రద్ధ... ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంపై లేదని అనకాపల్లి వైయ‌స్ఆర్‌సీపీజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖపట్నం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... 

గడిచిన 14 నెలల్లోవైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, గ్రామాల్లో ఉన్న నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల సహా రాష్ట్ర స్ధాయిలో ఉన్న నాయకుల మీద కూటమి ప్రభుత్వం దాదాపు 2700 కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇందులో భాగంగానే వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ పార్లమెంటేరియన్ మూడోసారి ఎంపీగా ఎన్నికైన మిధున్ రెడ్డిని లిక్కర్ స్కామ్ పేరుతో విచారణకు పిలిచి అరెస్టు చేయడంపై అమర్నాధ్ మండపడ్డారు. కేసులు, అరెస్టులతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలన్న చంద్రబాబు కోరిక ఈ జన్మకు నెరవేరదని తేల్చిచెప్పారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే...
 
మీడియా ట్రయిల్స్ - సిట్ దర్యాప్తు:

లిక్కర్ స్కామ్ పేరుతో జరుగుతున్న విచారణ తీరు ఆశ్చర్యకరంగా ఉంది. తెలుగుదేశం పార్టీ గెజిట్ పత్రికల్లాంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి చేస్తున్న మీడియా ట్రయిల్స్ చూస్తుంటే... వీరు చేస్తున్న విచారణను సిట్ అధికారులు తీసుకున్నట్టు కనిపిస్తోంది. సిట్ అధికారులు ఎవరినైనా అరెస్టు చేసే మందు కానీ, లేదా విచారణకు తీసుకునేమందు ఈనాడు లోనూ, ఆంధ్రజ్యోతి లోనూ ప్రధానమైన కథనం వస్తుంది. తద్వారా వారం రోజుల్లో దర్యాప్తు అధికారులు ఏం చేయబోతున్నారో తెలిసిపోతుంది. 

ఎంపీ మిధున్ రెడ్డి అరెస్టు కేవలం కక్షపూరిత చర్య మాత్రమే. వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో సహా పార్టీ నేతలందరం ఈ అరెస్టును పూర్తిగా ఖండిస్తున్నాం. ఇవాళ ఈనాడులో బిగ్ బాస్ జగనే అంటూ ఓ కథనం, ఆంధ్రజ్యోతిలో ముడుపులు మూలవిరాట్టుకే అని ఆర్టికల్ వస్తుంది. ఛార్జ్ షీట్ లో ఏం రాయాలో, ఎంక్వైరీలో ఎవరేం చెబుతారో, ఎవరు సాక్షులో, ఏవరెవరి మీద కేసులు పెట్టాలో, తర్వాత ఎవరిని అరెస్టు చేయాలో ఈనాడు, ఆంధ్రజ్యోతి చెబుతాయి. వాటి కథనాల ప్రకారం సిట్ దర్యాప్తు నడుస్తుంది. ఆ మేరకు అరెస్టులు ఉంటాయి. ఆ మేరకు కక్ష సాధింపు చర్యలు చేపడతారు. ఇదే ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తోంది. 

ప్రజల దృష్టిని మర్చలడానికే అక్రమ కేసులు:

చంద్రబాబు నాయుడు గతంలో మొదటసారి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై కుట్ర చేసినప్పుడు 151 సీట్లు వచ్చాయి. మరలా ఇప్పుడు రెండోసారి కుట్ర చేస్తున్నారు. రేపు మీ భవిష్యత్తు ఏంటో ఒక్కసారి ఆలోచన చేసుకొండి. మీ వ్యక్తిగత కక్షలతోనో,వైయ‌స్ఆర్‌సీపీని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మానుకుని... ప్రభుత్వ పనితీరు మీద ప్రజలకిచ్చిన హామీల మీద, మీరు చెప్పిన సూపర్ సిక్స్ మీద శ్రద్ద పెట్టండి.  14 మాసాల పాలనలో ఏ ఒక్క హామీని అమలు చేయకుండానే.. అడిగితే అన్నీ అమలు చేశామనో.. లేకపోతే నాలుక మందం అనో.. మక్కలు ఇరగ్గొడతామనో అంటున్నారు. ఎందుకు ఈ మాటలన్నీ వస్తున్నాయంటే.. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ప్రజల్లోకి వెళ్తుంది. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారు ప్రజాసమస్యల మీద ప్రజల్లోకి వెళ్తుంటే విపరీతంగా జనం వస్తున్నారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారు.

ఇదీ మోడస్ ఆపరెండీ:

దాదాపు 6-7 నెలలుగా ఈ కేసు నడుస్తోంది. అప్పట్లో ఈ కేసులో కీలకవ్యక్తి .. కింగ్ పిన్ రాజ్ కసిరెడ్డి అన్నారు. ఇవాళ మరలా మిధున్ రెడ్డి ప్రధాన సూత్రధారి అంటున్నారు. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం జరుగుతుంది. వైయ‌స్ఆర్‌సీపీ కీలకమైన, సీనియర్ నాయకులను ముందుగా టార్గెట్ చేస్తారు.  ఆ తర్వాత వారిపై వారం రోజులపాటు వరుసగా వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఈ పత్రికల్లో వార్తలు రాస్తారు. దీనంతటికీ ఫలానా వ్యక్తి బ్యాక్ బోన్ అని ఫోకస్ చేస్తారు. మరుసటి రోజే సిట్ నుంచి నోటీసు వస్తుంది. నోటీస్ కు స్పందనగా విచారణకు వెళ్తే అరెస్టు చేయడం ఇదీ రాష్ట్రంలో జరుగుతున్న మోడస్ ఆపరెండీ. ఆధారాలు, సాక్ష్యాలు ఏవీ ఉండవు. వాళ్లు ఫోన్ లో మాట్లాడుకున్నారు... అది దీని గురించే అని  చెప్తారు.

ఇవాళ మరలా కొత్తగా బిగ్ బాస్ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారే అంటూ... కొత్త రాతలు. ప్రభుత్వ ఆలోచనా విధానం ఈ పత్రికలు ద్వారా చెప్పిస్తున్నారా.? లేకపోతే పత్రికలు చెప్పినట్టే వారు చేస్తున్నారా.? ఈ రెండిండిలో ఏదో ఒకటి జరుగుతుంది.
లేని లిక్కర్ స్కాంలో ముందుగా రూ.1 లక్ష కోట్లు, ఆ తర్వాత రూ.35 వేల కోట్లు, మూడు రోజుల క్రితం రూ.18వేల కోట్లు, ఇవాళ కొత్తగా రూ.3,500 కోట్లు అని వీళ్ల పత్రికల్లో రాశారు. ఏది కరెక్ట్.
అక్రమ కేసు పెట్టారు కాబట్టి ఏదో ఒక సంఖ్య చెప్పాలి కాబట్టి చెప్పినట్టు అనిపిస్తోంది. చెప్పిన అబద్దాన్నే పదే పదే చెబితే ప్రజలు నమ్ముతారు అనే ఉద్దేశ్యంతో గతంలో  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారిపై 15 ఏళ్లుగా రూ.లక్ష కోట్లు అని ప్రచారం చేశారో.. ఇప్పుడు కూడా అదే తరహాలో ప్రయత్నం చేస్తున్నారు. అలా వచ్చిన డబ్బుతో ఆఫ్రికాలో కంపెనీ పెట్టారని ఒకసారి, ఎన్నికల్లో ఖర్చు పెట్టారని మరోసారి రాస్తారు. ఒక్కసారైనా డబ్బులు పట్టుకోలేదు. ఇందులో ఏది నిజం. డబ్బు మళ్లింపు మీరు రుజువు చేయగలిగారా.?

చంద్రబాబు 2014-19లో స్కిల్ స్కాం కేసులో రూ.3350 కోట్లు సీమెన్స్ కంపెనీతో టై అప్ అయి... 10 శాతం ప్రభుత్వం కడితే రూ.3వేల కోట్లు కంపెనీ పెడుతుందని చెప్పి దాదాపు రూ.300 కోట్లు డబ్బు ట్రాన్స్ ఫర్ చేశారు. ఆ డబ్బు మీకు వచ్చిందని మేం ఆరోజు అసెంబ్లీ సాక్షిగా సాక్ష్యాలతో సహా చెప్పాం.
మీరు చేసిన అక్రమాలు, అన్యాయాలను ప్రజలముందుంచాం.

అక్రమ కేసులు పెట్టి ఇంత మందిని అరెస్టు చేసి, ఇబ్బంది పెడుతున్నారు. మీ దగ్గర ఆధారాలుంటే బయట పెట్టండి. ఇది రాజకీయ కక్ష కాకపోతే మరేంటని ప్రజలు అడుగుతున్నారు..  లిక్కర్ వ్యవహారంలో డబ్బును తీసుకెళ్లి స్టార్టప్ కంపెనీలో  పెట్టారని చెబుతున్నారు. ఇటీవల విశాఖలో ఉర్సా కంపెనీకి ఎకరా రూ.5.50 కోట్లు విలువైన భూమిని రూ.50 లక్షలకి కట్టబెట్టారు. ఫిబ్రవరిలో నమోదైన కంపెనీకి ఏప్రిల్ లో సుమారు 59 ఎకరాలు ఊరూ పేరు లేని ఉర్సా కంపెనీకి కేటాయించారు. వేల మందికి ఉద్యోగ అవకాశాలు, రూ.10 వేల కోట్లు పెట్టుబడి అని గొప్పులు చెప్పుకున్నారు. ఇవన్నీ స్కాములు కావా.?

ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సొంత జిల్లాలో పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని ఎదుర్కోలేక కేవలం అధికారం ఉంది కాబట్టి వారిని ఇబ్బంది పెట్టాలన్న తాపత్రయమే కనిపిస్తోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా మిధున్ రెడ్డిని అరెస్టు చేశారు. దీనికి కొనసాగింపుగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి మీద తప్పుడు కథనాలు రాశారు. అంటే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారిని ఏదో ఒక రకంగా అరెస్టు చేయాలనే ప్రయత్నం కనిపిస్తోంది. 

కుతంత్రాలు, వెన్నుపోట్లకు చంద్రబాబే బిగ్ బాస్:

రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడంలోనూ.. విద్య, వైద్య రంగాల్లోనూ పోర్టుల నిర్మాణంలోనూ రాష్ట్రంలో మార్పులు తీసుకురావడం లోనూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి కృషి చేస్తే... రాజకీయంగా కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాల్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు. 
ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ఏలేరు స్కామ్ కు ఆద్యుడు చంద్రబాబు నాయుడు. ఆయన హయాంలో ఎకరానికి 1000 చెట్లు అని రైతుల దగ్గర నుంచి డబ్బులు కొట్టేశారు. ఏడు కేసుల్లో బాబు బెయిల్ మీద ఉండి ఇవాళ అందరికీ నీతులు చెబుతుంటాడు. స్టే లు తెచ్చుకోవడంలో బిగ్ బాస్ చంద్రబాబు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఐఎంజీ భారత్ సంస్థకు 400 ఎకరాలు ఇచ్చి దాంట్లో ముడుపులు తీసుకోవడంలో చంద్రబాబు బిగ్ బాస్. ఎమ్మెల్సీలను కొనుగోలు చేసిన వ్యవహారంలో బ్రీఫ్ డ్ మీ అంటూ దొరికిపోయిన బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు. సినిమా డైరెక్షన్ ల కోసం, పబ్లిసిటీ స్టంట్ల కోసం 29 మంది ప్రాణాలు పణంగా పెట్టడం చంద్రబాబు బిగ్ బాస్. ఇవన్నీ ఈనాడు పేపరు రాయాలి. అప్పుడు అమ్మకాలు గణనీయంగా పెరిగి ఉండేవి.

అమరావతి రింగ్ రోడ్డు అలైన్ మెంట్, వీటన్నింటిలోనూ చంద్రబాబు బిగ్ బాస్.  మా హయాంలో ప్రారంభించిన 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, మూడు పోర్టులను నిర్మిస్తుంటే వాటిని అమ్మకానికి పెట్టారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గాలికొదిలేసి... కేవలం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కక్ష సాధిస్తూ... వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలన్న మీ కోరిక ఈ జన్మకు నెరవేరదు. మీరు, మీ కుమారుడు బ్రతికున్నంత వరకూ అది జరగదు అన్న విషయం గుర్తుంచుకొండి చంద్రబాబు అని అమర్నాధ్ స్పష్టం చేశారు.

Back to Top