ఎన్టీఆర్ జిల్లా: రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు సంక్షోభ నిలయాలుగా మారాయని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మండిపడ్డారు. సంక్షేమ వసతి గృహల్లో విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ వసతి గృహల సమస్యలపై తిరువూరు లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల హాస్టల్ ని విద్యార్థి విభాగం నేతలు మంగళవారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి, భోజనం, కూర, సాంబారు నాణ్యతని పరిశీలించారు. బాత్ రూమ్, మరుగుదొడ్ల ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చైతన్య, రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ.. డా బీ ఆర్ గురుకుల హాస్టల్ నిర్వహణ అధ్వాన్నంగా ఉందన్నారు. కనీస వసతుల్లేవన్నారు. సంక్షేమ హాస్టళ్ళు సంక్షోభ నిలయాలుగా మారాయన్నారు. గతేడాది నుండి సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి ప్రభుత్వం ఒక్క రూపాయి కుడా మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచలేదని విమర్శించారు. సమీక్షా సమావేశాలకు టీ, బిస్కెట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న మంత్రి లోకేష్ కి దళిత, గిరిజన, బహుజన విద్యార్థుల అవస్థలు కనిపించడం లేదాని ప్రశ్నించారు. లోకేష్ కుమారుడిని హాస్టల్లో చేర్పిస్తే విద్యార్థుల వెతలు లోకేష్ కి అర్ధమవుతుందన్నారు. గత జగన్ ప్రభుత్వం పాఠశాల హాస్టల్ విద్యార్థులకు 850 రూపాయల నుండి 1400 రూపాయలు మెస్ ఛార్జీలు పెంచిందన్నారు. కేవలం 75 రూపాయలున్న కాస్మోటిక్ ఛార్జీలు చంద్రబాబు ప్రభుత్వం ఇస్తే జగన్ అధికారం చేపట్టగానే దాన్ని 170 రూపాయలకి పెంచారని తెలిపారు. ప్రతీ వసతి గృహంలో విద్యార్థులకి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని వైయస్ జగన్ అందించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా కుడా విద్యార్థులకి డైట్ ఛార్జీలు పెంచలేక విద్యార్థుల్ని గాలికొదిలేసిందని దుయ్య బట్టారు. మరుగుదొడ్లు, బాత్ రూమ్ లు అధ్వాన్నంగా తయారయ్యాయన్నారు. వీటి నిర్వహణను విస్మరించిందన్నారు. దోమ తెరలు, చాపలు, పెట్టెలు, దుప్పట్లు, గ్లాసులు ఇంకా విద్యార్థులకు పంపిణీ చేయలేదన్నారు. హాస్టళ్ళ నిర్వహణకు 143 కోట్లు కేటాయించామని సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి డోలా వీరాంజనేయులు ప్రకటించడం హాస్యాస్పదం అన్నారు. కేటాయించిన 143 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారని మంత్రి ని ప్రశ్నించారు. ఏ రోజు ఏమి భోజనం, కూరలు అందిస్తున్నారో జగన్ హయాంలో మెనూ ప్రకారం టంచన్ గా అందించారన్నారు. కూటమి ఏడాది పాలనలో మెనూ అమలు లేదు. మెనూ చార్టులు లేవన్నారు. కేవలం ప్రచారం తప్ప సంక్షేమం లేదని పేర్కొన్నారు. హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం మెడలు వంచి పరిష్కారం అయ్యేంత వరకూ ఉద్యమిస్తామని హెచ్చరించారు. హాస్టల్ ని సందర్శించినవారిలో వైయస్ఆర్‌సీపీ 62వ డివిజన్ నాయకులు అలంపూర్ విజయ్ కుమార్, వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్, సహాయ కార్యదర్శి కొండల్ రావు, జిల్లా అధ్యక్షులు కోమల్ సాయి, నియోజకవర్గ అధ్యక్షులు లక్ష్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.