తిరుపతి: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు ఇష్టారాజ్యంగా ఆంక్షలు విధిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ టీడీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... వైయస్ఆర్‌సీపీ నాయకులకు, కార్యకర్తల వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనపై నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన పర్యటకు జన సమీకరణ చేయాల్సిన అవసరం లేదని, జగన్ అంటేనే జనం అని అన్నారు. ఆయన పర్యటన కోసం స్వచ్చందంగా తరలి వస్తారని భూమన తేల్చి చెప్పారు. మరోవైపు ప్రజలకిచ్చిన హామీల అమల్లో విఫలమైన చంద్రబాబు వారి దృష్టి మరల్చేందుకు కొత్తగా పీ-4 కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా దత్తత తీసుకోవాలని కలెక్టర్ల ద్వారా ఒత్తిడి చేయించడాన్ని ఆక్షేపించారు. పీ-4 పేరుతో కూటమి ఎమ్మెల్యేలు దోపిడీకి తెరతీశారని భూమన మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. గతంలోనూ ఆంక్షలు- అయినా ఆగని జన ప్రవాహం: వైయస్ జగన్ పర్యటన నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి స్ధానిక డీఎస్పీ ఆంక్షలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వైయస్ జగన్ పరారమర్శకు వెళ్తున్న నేపధ్యంలో 15 వాహనాలను అనుమతించడంతో పాటు ఇంటిలోపలికి కేవలం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మాత్రమే పంపిస్తాని చెప్పారు. రహదారులు సరిగ్గా లేనందున, ఈ పర్యటనకు జనసమీకరణ చేస్తే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుందని లేఖలో స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జరిగిన వైయస్ జగన్ పర్యటనలో కూడా హెలీప్యాడ్ వద్దకు 30 మంది కంటే ఎక్కువ మంది రాకూడదని.. మార్కెట్ యార్డులోకి కేవలం 300 మందికి మాత్రమే ప్రవేశం.. అంతకంటే ఎక్కువ మంది వస్తే వాళ్ల మీద రౌడీషీట్ ఓపెన్ చేస్తామని చెప్పారు. అంతే కాకుండా దాదాపు 2 వేల మంది పోలీసులు, ఒక డీఐజీ, ముగ్గురు ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 27 మంది డిఎస్పీలుతో కలిసి మోహరించి, వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారి పర్యటనను అడ్డుకోవాడనికి చంద్రబాబు ప్రభుత్వం వినియోగించింది. మేము జనసమీకరణ చేయము అని చెప్పినా.. జనాలు ఉప్పెనలా హాజరయ్యారు. కేవలం బంగారుపాళ్యంలో మాత్రమే వైయస్ జగన్ మోహన్ రెడ్డిఆదరణ పరిమితం అయి లేదు. జనం అంటేనే జనం. ఆయన బయటకు వస్తే చాలు అడుగడుగునా జననీరాజం పలుకుతుంది. జనసమీకరణ చేయబోం... అయినా జగన్ వెంటే జనం: ఈ నెల 31న వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శకు వస్తున్న నేపథ్యంలో... దాని కోసం మా పార్టీ జనసమీకరణ చేయదు. మేం చేయాలనుకుంటే దాని స్థాయి మరో రకంగా ఉంటుంది. ప్రభుత్వం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెనక 10 మందే ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండకూడదు అని బెదిరించే ధోరణిలో తాఖీదులు ఇస్తే.. జనం రారనుకోవడం మీ పొరపాటు. సూర్యకాంతిని అరచేత్తో అడ్డుకోవాలని చూసినా అది జరిగేది కాదు. ఆదే తరహాలో ప్రభుత్వమూ, పోలీసులు ఆంక్షలు విధించినా.. వైయస్ఆర్‌సీపీ జన సమీకరణ చేయకపోయినా, ఆయన వెనుక వేలాదిగా ఉరకలెత్తి జనాలు వస్తారు. అది మా పార్టీకి సంబంధించిన విషయము కూడా కాదు. ఇది పోలీసులు, ప్రభుత్వమూ తెలుసుకోవాల్సిన ప్రాధమిక విషయం. ఇలాంటి ఆంక్షలను విధించడం ద్వారా ప్రభుత్వం పోలీసు అధికారుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు వారి పరువుకు కూడా నష్టం కలిగిస్తోంది. పీ-4 పేరుతో చంద్రబాబు కొత్త ప్రవచనాలు: చంద్రబాబు నాయుడు గారు గత రెండు మూడు నెలలుగా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తానని భీకర, భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నాడు. దానికోసం తానొక తత్వవేత్తలాగా... అభినవ సోక్రటీస్ లా మారిపోయి ప్రపంచాన్ని మార్చడానికి పీ-4 అనే కొత్త సిద్ధాంతాన్నిఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వదలదానికి సంసిద్ధులయ్యారు. పబ్లిక్, ప్రయివేటు, పీపుల్ పార్టనర్ షిప్ (పీ-4) కార్యక్రమాన్ని ప్రచారంతో ఊదరగొడుతున్నారు. ఇందులో భాగంగా ధనికులంతా పేదవారికి సహాయం చేయాలని ఆయన ప్రవచిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కేవలం 20 లక్షలు పేద కుటుంబాలు మాత్రమే ఉన్నట్టు... వారిలో 5.80 లక్షల మందిని గుర్తించగా.. ఇంకో 15 లక్షల మందిని గుర్తించాల్సినగా జిల్లా కలెక్టర్ల మీద ఒత్తిడి తెస్తున్నారు. జిల్లా కలెక్టర్లు దిగువనున్న ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలమీద విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. ఈ కార్యక్రమంలో సహాయం చేసే వారికి మార్గదర్శులు అనే పేరు పెట్టి... చంద్రబాబు వారిని వెదితే పనిలో పడ్డాడు. సంపన్నులు పేదవారిని బయటకు లాగుతారు అన్నది నిజమైతే ఈ పాటికే ఈ దేశంలో 80 శాతానికిపైగా ఆర్ధికవ్యవస్థ (సంపద) కేవలం 20 శాతం మంది చేతుల్లోనే ఉంది. అలా ఉండేది కాదు. చంద్రబాబు చెబుతున్నట్టు పేదరికంలో 20 లక్షల కుటుంబాలే కాదు.. రెండు మూడు రెట్లుకు పైగా ఉన్నారు. అలా రాష్ట్రంలో ఉన్న దాదాపు కోటి కుటుంబాలకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో రూ.2.85లక్షల కోట్ల రూపాయులు వారిని ఆర్ధికంగా ఉన్నతస్థితిలోకి తీసుకురావడానికి ఖర్చుపెట్టారు. దాదాపు రూ.55 వేల కోట్లతో 25 లక్షల ఇళ్లు నిర్మించే బాధ్యత కూడా వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నారు. అది నిజమైన రాజకీయ తత్వవేత్త ఆలోచన చేయాల్సిన విషయం. హామీల అమలు నుంచి తప్పుకునే ఎత్తుగడ: ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యతను తలకెత్తుకోవాల్సిన ప్రభుత్వం.. అది విస్మరించి దాన్నుంచి పక్కకు తప్పుకునే ప్రయత్నంలో ఉంది. మరోవైపు ఎక్సైజ్ ఉద్యోగులై ఒత్తిడి పెట్టి బార్ షాపులు, వైన్ షాపుల యజమానులను మార్గదర్శకులుగా మార్చే కార్యక్రమం చేయడం అత్యంత ఆశ్చర్యకరం. ఎక్సైజ్ ఉద్యోగుల ద్వారా షాపు యజమానులపై ఒత్తిడి పెడితే వాళ్లు మద్యం ధరలను మరింత పెంచుకుంటూ పోతారు. వీళ్ల ద్వారా పేదవాళ్ల ఆర్ధిక స్వావలంబన ఎలా తీసుకుని వస్తారు. ప్రభుత్వం మీడియాలో పీ-4 కార్యక్రమం స్వచ్ఛందంగా చేస్తున్నామని ప్రకటలు ఇస్తూనే... కిందస్ధాయిలో ఉద్యోగులను, ఉపాధ్యాయులను బలవంతం చేస్తున్నారు. తాను కొత్త సిద్ధాంతం కనిపెట్టాను అనే భ్రమలో ప్రజలపైకి వదిలాడు. అది కాస్తా సాకారం కాకపోవడంతో వారిపై ఒత్తిడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. అసలే సకాలంలో జీతాలు రాక ప్రభుత్వ ఉద్యోగులు అతలాకుతలం అవుతుంటే.. దత్తత తీసుకోవడానికి సంపన్నులు దొరకకపోతే మీరే తీసుకొండని చెప్పడం దారుణం. సంపన్నులు పేదవారికి సాయం చేస్తే.. వాళ్ల ఇళ్ళల్లో పనిచేసే సేవకులు జీవితాలు బాగుపడ్డాయా ఎంతమంది వారి ఇళ్ల్లో పనిచేసే పేదల జీవితాల కోసం పనిచేశారా? పీ-4తో ఉద్యోగుల్లో అలజడి: కేవలం భ్రమల్లో మునిగి, బాధ్యతలను విస్మరించి, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన వాళ్లు మాత్రమే ఇలా చేస్తారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, మంచిని తన అనుకూల మీడియాద్వారా చెరిపేవేసే కార్యక్రమం చేసి పబ్బం గడుపుకునే కార్యక్రమం తప్ప మరోకటి కాదు. పీ-4 కార్యక్రమం రాష్ట్రంలో అలజడిని సృష్టిస్తోంది. ఆందోళన కలిగిస్తోంది. సమస్యను పరిష్కరించకపోగా... మరిన్ని సమస్యలను సృష్టిస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఒక్కరు కూడా దత్తత తీసుకున్నది లేదు. వాళ్ల అనుకూల పత్రికల్లోనే ఎమ్మెల్యేలు పీ-4 కార్యక్రమంలో భాగంగా వసూళ్లు కార్యక్రమం ప్రారంభించారని వార్తలు రాశారు. మానవ చరిత్రలో జరగలేని విషయాన్ని జరుపుతానని చంద్రబాబు చెబుతున్నాడు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాడు-నేడు ప్రభుత్వస్కూళ్లు, ఆసుపత్రుల నిర్మాణం, ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పిల్లలకు నాణ్యమైన విద్య అందించారు. అర్హులైన పేదలందరికి ఇళ్లు వంటి గొప్ప కార్యక్రమాలు చేశారు. అవేవీ చేయలేక చంద్రబాబు ఈ తరహా ప్రచార కార్యక్రమానికి తెరతీశారు. ప్రపంచంలో ఈ తరహా స్లోగన్ ఇవ్వడానికి సాహసం చేయలేదు. ఈ కార్యక్రమం కచ్చింతగా విఫలమవుతుంది. సూపర్ సిక్స్ హామీలతో పాటు ప్రజలకిచ్చిన 143 హామీలను నెరవేర్చండి. గత ప్రభుత్వం కంటే ఎక్కువ మేలు చేస్తావన్న నమ్మకంతో నమ్మి ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే... వారిని ఇబ్బంది పెట్టే ఇలాంటి కార్యక్రమాలు చేయవద్దని భూమన కరుణాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి సూచించారు. పీ-4 ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.