వైయస్ జగన్‌ భద్రతపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు

కూటమి సర్కార్‌పై మండిపడ్డ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్

మాజీ సీఎంకు ఎలాంటి బందోబస్త్ కల్పించాలో తెలియదా?

చంద్రబాబు, లోకేష్‌ల ఆదేశాలతో కొందరు పోలీస్ అధికారులు గీత దాటుతున్నారు

తాజాగా నెల్లూరు పర్యటన విషయంలోనూ అర్థంలేని ఆంక్షలు

రాష్ట్రంలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం కింద కొందరు పోలీసులు పనిచేస్తున్నారు

ఇప్పుడు చేసిన ప్రతి తప్పుకూ మూల్యం చెల్లించుకోక తప్పదు

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హెచ్చరిక

తాడేపల్లి: మాజీ సీఎం వైయస్ జగన్‌కు కల్పించాల్సిన భద్రత విషయంలో కూటమి సర్కార్ కుట్రపూరితంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తాజాగా నెల్లూరు పర్యటనకు వైయస్ జగన్ సిద్దమవ్వడంతో, పోలీసులతో అర్థంలేని  అనేక ఆంక్షలను విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుడుగా ఉన్న వైయస్ జగన్‌ను చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు, ప్రజలు తరలివస్తారని తెలిసి దానికి అనుగుణంగా బందోబస్త్‌ను ఏర్పాటు చేసుకోలేని స్థితిలో పోలీస్ వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. మంత్రి నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగానికి లోబడి కొందరు పోలీస్ అధికారులు రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..

లోకేష్‌ ప్రమాణస్వీకారం చేసింది రాజ్యాంగం మీద, కానీ అమలు చేస్తున్నది మాత్రం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని. ప్రజలకు పంగనామాలు పెట్టి, రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేస్తున్నారు. వారి అరాచకాను ప్రశ్నించే గొంతుపై కత్తి పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో లోకేష్‌ ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా ప్రజలు బుద్ది చెబుతారు. ముందుంది ముసళ్ళ పండుగ. మళ్లీ వైయస్ఆర్‌సీపీకి ప్రజలు అధికారాన్ని అప్పగిస్తారు. అప్పుడు నారా లోకేష్‌ చేసిన తప్పులకు ఆయన, ఆయన ఆదేశాలతో చట్టాలను ఉల్లంఘించిన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదు. 

వైయస్ జగన్ పర్యటనలను చూసి భయపడుతున్నారు

 మాజీ సీఎం వైయస్ జగన్ హెలికాఫ్టర్‌లో వస్తానన్నా దానికీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు. రోడ్డు మార్గంలో వస్తానంటే ఆంక్షలు పెడుతున్నారు. మాజీ సీఎంకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదే. కానీ ఆయన గుంటూరు మిర్చి యార్డ్‌కు వెళ్లినప్పుడు, పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లినప్పుడు, రాప్తాడు నియోజకవర్గంకు వెళ్లినప్పుడు కూడా కనీస భద్రత కల్పించలేదు. రాప్తాడులో హెలిప్యాడ్‌లోకి జనం చొచ్చుకువెళుతున్నా కూడా పోలీసులు పట్టించుకోలేదు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైయస్ఆర్‌సీపీ నాయకులపైన తప్పుడు కేసులు పెట్టారు. చివరికి హెలికాఫ్టర్ పైలెట్, కోపైలెట్‌లపైన కూడా విచారణ పేరుతో వేధింపులకు పాల్పడ్డారు. ఏ కంపెనీ కూడా వైయస్ జగన్‌కు హెలికాఫ్టర్ ఇవ్వకూడదనే కుట్రతో ప్రభుత్వం పనిచేసింది. పల్నాడు పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మరణానికి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. వైయస్ జగన్‌ను చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలివస్తారని తెలిసి కూడా ప్రభుత్వం సరైన భద్రతను కల్పించలేదు. రోప్‌పార్టీ సక్రమంగా విధులు నిర్వహిస్తే సింగయ్య అనే వ్యక్త మరణించేవారా? అలాగే తెనాలి, చిత్తూరుజిల్లా బంగారుపాళెంకు వెళ్ళిన సందర్భాల్లో కూడా ఇదే విధంగా భద్రతావైఫల్యం కనిపించింది. వైయస్ జగన్ పర్యటలను చూసి ప్రభుత్వం భయపడుతోంది.

నెల్లూరు పర్యటనపైనా ఆంక్షలు 

తాజాగా నెల్లూరు జిల్లాలో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిని, ఇటీవల తెలుగుదేశం గుండాలు దాడి చేసిన మా పార్టీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని పరామర్శించేందుకు వైయస్ జగన్ నెల్లూరు పర్యటనకు సిద్దమయ్యారు. నెల్లూరు పర్యటనలో ఆయన వెంట కేవలం మూడు వాహనాలు, పదిమంది మాత్రమే ఉండాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. వైయస్ జగన్ అంటేనే ఈ దేశంలోనే అత్యంత ప్రజాధరణ పొందిన నాయకుడు. ఆయన ఎక్కడకు వెళ్ళినా స్వచ్ఛందంగా వేలసంఖ్యలో అభిమానులు తరలివస్తుంటారు. గత పర్యటనల్లోనే ఈ విషయం చాలా స్పష్టంగా కనిపించింది. దానికి అనుగుణంగా భద్రతను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా?

వైయస్ జగన్ పర్యటనలను అడ్డుకోవడమే మీ లక్ష్యమా?

 వైయస్ జగన్ పర్యటనల సందర్భంగా ఆయనను చూసేందుకు వస్తున్న వారిని నిలువరించేందుకే కొందరు పోలీస్ అధికారులు పనిచేస్తున్నారు. ఆయనకు భద్రత కల్పించడానికి బదులు ఆయనను చూసేందుకు ఎవరూ రాకుండా చూడటం, వచ్చే వారిపై రౌడీషీట్లు పెడతానంటూ బెదిరించడం, జనం రాకను అడ్డుకునేందుకు బారికేట్లు ఏర్పాటు చేయడం, వచ్చే వారికి కనీసం మంచినీరు కూడా దొరకకూడదని హోటళ్ళను మూయించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఏపీ పోలీస్ మ్యానువల్‌లో ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఎక్కడైనా ఉందా? సామాన్య ప్రజలపై, అభిమానులపై రౌడీషీట్లు ఓపెన్ చేయాలని ఎక్కడైనా ఉందా? ఇలా చట్ట వ్యతిరేకంగా, తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే హక్కు పోలీస్ అధికారులకు ఎవరు ఇచ్చారు? ఇది రాక్షస పాలన కాదా? ప్రభుత్వం ఒత్తిడి చేస్తే, చట్ట వ్యతిరేకంగా పనిచేయము అని చెప్పాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపై లేదా? వైయస్ జగన్ పర్యటనలకు ఎలా ప్రజాధరణ ఉంటుందో ఇంటెలిజెన్స్ వ్యవస్థల ద్వారా సమాచారం తెచ్చుకుని, దానికి తగిన విధంగా బందోబస్త్‌ను ఏర్పాటు చేసుకోవాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.

Back to Top