పల్నాడు: చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నేత విడదల రజిని పిలుపునిచ్చారు. గురువారం చిలుకూరిపేట పట్టణం లో నియోజకవర్గం స్థాయికి సంబంధించిన "బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ" పేరుతో... రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంపై వైయస్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విడదల రజిని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆరోగ్యశ్రీలో అనేక వ్యాధులకు వర్తింపకుండా ఎత్తివేశారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిలా వైయస్ జగన్ పాలనలో వైయస్ఆర్‌సీపీ ప్రవేశ పెట్టిన పథకాలను కొనసాగించడంతోపాటు అనేక కొత్త పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. మోసం చేసే చంద్రబాబు కన్నా మడమ తిప్పని నేత జగనన్న అంటే ఈప్రాంత ప్రజలకు ఎంతో ఇష్టమన్నారు. జిల్లాలో వైయస్ఆర్‌సీపీకి ఎదురులేదన్నారు. ● జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. హామీల బాండ్ పేపర్లను ఇంటింటికి పంచిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ అధికారం చేపట్టిన తరువాత వాటి అమలుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ● పార్లమెంట్ పరిశీలకులు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇంటింటా మేనిఫెస్టో బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు కొత్తేమి కాదన్నారు. గతంలో మూడు సార్లు సీఎంగా పనిచేసిన సమయంలో కూడా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగానికి వైయస్ఆర్‌సీపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని గడగడలాడించిన ధీరుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ● వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడుమాట్లాడుతూ.. రాష్ట్రంలో సూపర్‌సిక్స్‌లో ఏఒక్కటీ అమలు చేయలేదన్నారు. 2029లో జగనన్నను సీఎం చేసేందుకు ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. పార్టీ సైనికులు ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు మోసాలను వివరించాలని పిలుపునిచ్చారు.