క‌ళ్యాణ‌దుర్గం కేంద్రంగా లిక్కర్ మాఫియా

అనంత‌పురం మాజీ ఎంపీ త‌లారి రంగ‌య్య

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ తలారి రంగయ్య

స్థానిక ఎమ్మెల్యే లిక్క‌ర్ దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోయింది

నియోజ‌క‌వ‌ర్గంలో లిక్క‌ర్ షాపుల‌న్నీ క‌ళ్యాణి వైన్స్ పేరుతోనే 

ఇదెలా సాధ్య‌మో ఎక్సైజ్ శాఖ‌మంత్రి స‌మాధానం చెప్పాలి

ఒక్క క‌ళ్యాణ‌దుర్గంలోనే 300 ల‌కు పైగా బెల్ట్ షాపులు న‌డుపుతున్నారు

మాజీ ఎంపీ త‌లారి రంగ‌య్య‌ ధ్వజం

తాడేపల్లి: రాష్ట్రంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం మద్యం మాఫియాకు అడ్డగా మారిందని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఈ మద్యం ముఠా పెద్ద ఎత్తున దందా నిర్వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అన్ని మద్యం దుకాణాలను ఎమ్మెల్యే హస్తగతం చేసుకుని అధిక రేట్లతో విక్రయించడంతో పాటు అనుబంధంగా బెల్ట్‌షాప్‌లను ఏర్పాటు చేసి విచ్చల విడిగా మద్యం అమ్మకాలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. 

ఇంకా ఆయనేమన్నారంటే...

క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 10 వైన్ షాపులంటే ఒక‌టి రీటెండ‌రింగ్ కి వ‌చ్చింది. 9 షాపులుంటే వాటిలో 8 వైన్ షాపులు క‌ళ్యాణి వైన్స్ పేరుతో న‌డుస్తున్నాయి. పార‌ద‌ర్శ‌కంగా టెండ‌ర్ ద్వారా కేటాయించిన‌ప్పుడు అన్నీ ఒక్క‌రికే ఎలా వ‌స్తాయి? వైన్ షాపుల‌ను క‌బ్జా చేసి అన్నింటికి క‌ళ్యాణి వైన్స్ అని పేరు పెడుతుంటే ఎక్సైజ్ శాఖ మంత్రి, ఆ శాఖ అధికారులు ఏం చేస్తున్న‌ట్టు.? దినేశ్ అనే వ్య‌క్తి హోటల్ న‌డుపుకునేవాడు. ఆయ‌న‌కు ప్ర‌భుత్వం నిర్వ‌హించిన లాట‌రీలో క‌ళ్యాణ‌దుర్గంలో వైన్ షాపు త‌గిలింది. దాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర‌బాబు మ‌నుషులు బెదిరించి లాగేసుకున్నారు. దీంతో దినేశ్ స‌హా ఆయ‌న బంధువులు ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌కి దిగిన వీడియోలు అప్ప‌ట్లో రాష్ట్ర వ్యాప్తంగా వైర‌ల్ అయ్యాయి. దీంతో దినేశ్ కి హోట‌ల్ కూడా లేకుండా చేసి ఎమ్మెల్యే ఆయ‌న్ను రోడ్డున ప‌డేశాడు. దినేశ్ త‌ర‌పున వైన్ షాపు కోసం గ‌ట్టిగా పోరాడిన ప్ర‌జా సంఘాల్లో ప‌నిచేసే ఆయ‌న స్నేహితుడు కూడా త‌ర్వాత కాలంలో ఎమ్మెల్యే లాంటి వ్య‌క్తి దేశం లోనే లేడంటూ ఆయ‌న్ను పొగుడుతూ వీడియో రిలీజ్ చేశాడు. ఇదంతా ఎమ్మెల్యే ఆదేశాల‌తో ఆయ‌న అనుచరులు చేస్తున్న‌ బెదిరింపుల‌కు ఉదాహ‌ర‌ణ‌లు. ఒక ప‌క్క సీఎం చంద్ర‌బాబు బెల్ట్ షాపు పెడితే బెల్టు తీస్తాన‌ని హెచ్చ‌రిస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు పుట్ట‌గొడుగుల్లా కొత్త‌వి వెలుస్తున్నా ప‌ట్టించుకున్న పాపాన పోవ‌డం లేదు. ఒక్క క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌కవర్గం లోనే దాదాపు 300 ల‌కు పైనే బెల్ట్ షాపులు న‌డుస్తున్నాయి.  

వేలంలో ఒక్కో బెల్ట్ షాపు రూ. 12 ల‌క్ష‌లు

ఒక్కో బెల్ట్ షాప్‌కి వేలం వేసి రూ. 4 లక్ష‌ల నుంచి రూ. 12 ల‌క్ష‌ల‌కు కేటాయిస్తున్నారు. ఇంకా డిమాండ్ ఎక్కువైతే ఆ గ్రామంలో రెండో బెల్ట్ షాపు ఇచ్చేస్తున్నారు. ఒక్కో బాటిల్ మీద అద‌నంగా రూ.10 ల నుంచి 20లు వ‌సూలు చేస్తున్నారు. నెల‌కి కోట్ల‌లో సంపాదిస్తున్నారు. ఈ డ‌బ్బంతా ఎవ‌రి జేబుల్లోకి వెళ్తున్న‌ట్టు.? వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో బెల్ట్ షాపులు లేకుండా చూసుకుంటే కూట‌మి పాల‌న‌లో మ‌ద్యం ఏరులై పారుతోంది. గోవా నుంచి మ‌ద్యం త‌యారు చేసి తీసుకొచ్చి ఇక్క‌డ లేబుల్ వేసుకుని అమ్ముకుంటున్నారు. అక్ర‌మ మ‌ద్యం తాగి అనారోగ్యం బారిన ప‌డుతున్నారు. యువ‌త రోడ్డు ప్ర‌మాదాల్లో చ‌నిపోతున్నారు.  ఎమ్మెల్యే అరాచ‌కాల మీద ప్ర‌శ్నిస్తే మా ఇంటి మీద‌కు దాడుల‌కు ఉసిగొల్పుతున్నాడు. బెదిరించి భయాందోళ‌న‌ల‌కు గురిచేసి ప్ర‌శ్నించే గొంతు నొక్కాల‌ని చూస్తున్నాడు. అయినా వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తే ఉండ‌దు. రీకాలింగ్ చంద్ర‌బాబూస్ మేనిఫెస్టో అని మేం ప్ర‌జ‌ల్లోకి వెళ్తుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొద్ద‌ని మా ఎమ్మెల్యే ప్ర‌జ‌ల్ని వేడుకుంటున్నాడు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ డ‌బ్బులు దోచుకుంటార‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాడు.

Back to Top