తాడేపల్లి: మాజీ మంత్రి ఆర్కె రోజాపై నగరి ఎమ్మెల్యే భానుప్రకాశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వైయస్ఆర్‌సీపీ మహిళా నేతలు తీవ్రంగా ఖండించారు. ఒక మహిళపై ఈ తరహాలో మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణం ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ ఆర్కె రోజాకు క్షమాపణలు చెప్పాలి, చట్ట ప్రకారం అతడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా వారేమన్నారంటే... ఇంగిత జ్ఞానం లేకుండా అనుచిత వ్యాఖ్యలు : ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి గాలి భానుప్రకాశ్ కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఇలా బాధ్యతారహితంగా మాట్లాడిన భానుప్రకాశ్‌ను చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఒక మహిళానేతగా, ప్రజా ప్రతినిధిగా ఎన్నో సమస్యలపై ఆర్కె రోజా పోరాడారు. నేడు కూటమి ప్రభుత్వంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తున్నారు. ఆమె వ్యక్తిత్వ హననంకు పాల్పడటం ద్వారా ఆమెను నిలువరించాలని భావిస్తే అది వారి అవివేకం. రాష్ట్రంలో మహిళా హోంమంత్రి ఉండి కూడా మహిళలకు ఎటువంటి భద్రత, గౌరవం లేని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉండటం దురదృష్టకరం. ఎమ్మెల్యేగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న భానుప్రకాశ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఆయనను అరెస్ట్ చేయాలి. నిన్న కృష్ణాజిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ హారికపై దాడి, నేడు మాజీ మంత్రి ఆర్కె రోజాపై అనుచిత వ్యాఖ్యలు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే సందేహం కలుగుతోందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. సినిమా వారిపట్ల చులకన భావమా.? : వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఆరె శ్యామల సభ్యసమాజం తలదించుకునేలా ఒక మాజీ మహిళా మంత్రిపై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ చేసిన వ్యాఖ్యలపై తక్షణం ఆయన ఆర్కె రోజాతో పాటు, మొత్తం మహిళా లోకానికే క్షమాపణలు చెప్పాలి. సమాజంలో మహిళల పట్ల ఎమ్మెల్యే భానుప్రకాశ్‌కు ఉన్న గౌరవం ఇదేనా అనే సందేహం కలుగుతోంది. సినిమా రంగం నుంచి వచ్చిన మహిళల పట్ల ఇంత చులకనభావం ఉందా.? తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఎన్టీఆర్ వల్ల. ఆయన సినిమా నటుడు కాదా.? కూటమిలో కీలక నాయకుడు అంటూ నెత్తిన పెట్టుకుంటున్న పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తి కాదా.? అంటే వీరిపట్ల కూడా టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాశ్‌కు ఇదే రకమైన చిన్నచూపు, హేళనభావం ఉందని అర్థమవుతోంది. సినీరంగం నుంచి వచ్చిన ఆర్కే రోజా పట్ల కనీసం ఒక మహిళకు ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వకుండా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం భానుప్రకాశ్‌పై మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి, నోటీసులు జారీ చేయాలని ఆరె శ్యామల అన్నారు. తక్షణం గాలి భానుప్రకాశ్‌ను అరెస్ట్ చేయాలి: పాముల పుష్పశ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కె రోజాపై తెలుగుదేశం ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ నోరు పారేసుకోవడంను తీవ్రంగా పరిగణిస్తున్నాం. సభ్యసమాజం తలదించుకునేలా ఆయన చేసిన వ్యాఖ్యలను మొత్తం మహిళా లోకం ఖండిస్తోంది. కూటమి ప్రభుత్వంలో నిత్యం మహిళలపై అఘాయిత్యాలు, దాడులు పరిపాటిగా మారిపోయాయి. చివరికి మహిళా ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తోంది. నిన్న ఉప్పాల హారికపై టీడీపీ సైకోలు భౌతిక దాడులకు తెగబడితే, నేడు టీడీపీ ఎమ్మెల్యేనే ఒక మహిళా మాజీ మంత్రి వ్యక్తిత్వ హననంకు పాల్పడటం చూస్తుంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నదని అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం ఇటువంటి వారికి మద్దతు ఇస్తుండటం, మహిళల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్న వారు టీడీపీకి చెందిన వారైతే వారికి కొమ్ముకాయడం వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. టీడీపీలోని బండారు సత్యనారాయణ, అయ్యన్నపాత్రుడు, చేబ్రోలు కిరణ్, కిరాక్ ఆర్పీ, సీమరాజాతో పాటు హొంమంత్రిగా ఉన్న అనిత కూడా పలు సందర్భాల్లో మహిళలపై అనుచితంగా మాట్లాడారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబుకు చెప్పే తీరిక కూడా లేదా.? గాలి భానుప్రకాశ్ చేసిన వ్యాఖ్యలపై తక్షణం అతడిపై కేసు నమోదు చేయాలి. ఆర్కె రోజాకు ఆయన తక్షణం క్షమాపణలు చెప్పాలని పాముల పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే దాసరి సుధా ట్వీట్ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్మాదులుగా తయారయ్యారు. సభ్య సమాజం తలదించుకునేలా మహిళలపై ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకుంటున్నారు. మాజీ మంత్రి రోజాగారిని ఉద్దేశించి `రూ.2వేలకు ఏ పనైనా చేసేది` అంటూ నగరి ఎమ్మెల్యే అవమానకరంగా మాట్లాడడం బాధాకరం. కంగాటి శ్రీదేవి, మాజీ ఎమ్మెల్యే చంద్రబాబు గారూ, మీ పార్టీలో అందరూ ఇంతేనా? మీ బావమరిది బాలకృష్ణ ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అంటారు. ఇప్పుడు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాజీ మంత్రి ఆర్కే రోజాగారిని ఉద్దేశించి రూ.2వేలకు ఏ పనైనా చేసేది అంటారు. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం. భూమన అభినయ్ రెడ్డి ట్వీట్ మాజీ మంత్రి రోజా గారు రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ రాణిస్తూ ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. అలాంటి మహిళను ఉద్దేశించి రూ.2 వేలకు ఏ పనైనా చేసిది అంటావా? భానుప్రకాష్ ఒక్కటి గుర్తు పెట్టుకోండి..ఇది ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావు. ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మహిళలపై ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకోవడం టీడీపీ వాళ్లకే చెల్లింది. నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మాజీ మంత్రి, ప్రముఖ సినీనటి రోజాను ఉద్దేశించి `రూ.2వేలకు ఏపనైనా చేసేది` అంటూ సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఇలాంటి వాళ్లపై పోలీసులు చర్యలు ఉండవా? మత్స్యరాస విశ్వేశ్వర రాజు మత్స్యరాస 2వేలకు ఏ పనైనా చేసేది అంటూ మాజీ మంత్రి రోజాగారిపై మీరుచేసిన వ్యాఖ్యలను మీతల్లి మీభార్య కూడా సమర్థించరు భాను ప్రకాష్ మహిళల పరువు తీస్తే అది మీ గెలుపు అనుకుంటున్నారేమో కానీఅది మీఓటమికి తొలి మెట్టుఅన్నది గుర్తు పెట్టుకోండి భాను ప్రకాష్ లాంటి వారిని టీడీపీ వెంటనే సస్పెండ్ చేయాలి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాజీ మంత్రి ఆర్కే రోజాగారిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలకు ఒక్కటే చెబుతున్నా. మహిళలపై ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకోవడం మగతనం కాదు.. అది నీచత్వం. వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల మహిళా లోకం అసహ్యహించుకునేలా , సభ్య సమాజం తలదించుకునేలా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ వ్యాఖ్యలు దారుణం. రెండు వేలకు రోజా ఏ పనైనా చేస్తుందని చులకనగా మాట్లాడుతావా? టీడీపీ స్థాపించిన ఎన్టీఆర్ ఏ రంగం నుంచి వచ్చిందో గుర్తు లేదా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తి కాదా?. సినిమా వాళ్లను వ్యక్తిత్వ హననం చేయడమేనా మీ వైఖరి. నగరి ఎమ్మెల్యే వ్యాఖ్యలు తప్పు. కచ్చితంగా గాలి భానుప్రకాశ్ క్షమాపణ చెప్పాలి. డిప్యూటీ సీఎం కూడా ఈ ఘటనపై స్పందించాలి. మేకాప్రతాప్ అప్పరావు ఈ రోజు నగరి టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్`రూ.2వేలకు ఏ పనైనా చేసేది` అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మహిళా లోకం తలదించుకునేలా ఉన్నాయి. మొత్తం మహిళా సమాజాన్ని అవమానించేలా ఉన్నాయి. ఇలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.