అన్యాయానికి గురైన పోలీసుల పక్షాన వైయస్ జగన్ ప్రశ్నించారు

ఆయనను అభినందించాల్సింది పోయి ఆక్షేపించడం విడ్డూరం

పోలీస్ అధికారుల సంఘం వ్యాఖ్యలపై నలమూరు చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ ఉద్యోగులు, పెన్షనర్స్‌ వింగ్ అధ్యక్షుడు నలమూరు చంద్రశేఖర్‌రెడ్డి

కొందరు పోలీసులు రాజకీయనేతలకు తొత్తులుగా మారారు

రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలను పరిశీలిస్తే తెలిసిపోతుంది

ఇటువంటి వారిని పోలీస్ అధికారుల సంఘం వెనుకేసుకు రావడం బాధాకరం

నిజాయితీపరులైన పోలీసులకు అండగా వైయస్ జగన్ నిలిచారు

పోలీస్ వ్యవస్థ ఔనత్యాన్ని కాపాడేందుకే వైయస్ జగన్ మాట్లాడారు

స్పష్టం చేసిన నలమూరు చంద్రశేఖర్‌రెడ్డి

తాడేపల్లి: రాష్ట్రంలో రాజకీయ చట్రంలో ఇరుక్కుని ప్రతిష్టను కోల్పోతున్న పోలీస్ వ్యవస్థ ఔనత్యాన్ని కాపాడేందుకే మాజీ సీఎం వైయస్ జగన్ ధైర్యంగా మాట్లాడారని వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయిస్, పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమూరు చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులకు జరుగుతున్న అన్యాయాలపై వైయస్ జగన్ గళం విప్పితే, ఆయనను అభినందించాల్సింది పోయి పోలీస్ అధికారుల సంఘం ఆక్షేపించడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో కొందరు పోలీస్ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారి, చట్టాలను నిర్లజ్జగా ఉల్లంఘించి వ్యవహరిస్తుంటే, ఈ సంఘం ఎందుకు దానిని ఖండించడం లేదని ప్రశ్నించారు. అనేక మంది నిజాయితీగల పోలీస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వీఆర్‌ లో పెట్టడం, సస్పెన్షన్‌లతో వేధించడం చేస్తున్నా ఈ సంఘం ఎందుకు దానిని వ్యతిరేకించలేక పోయిందని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే...

ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందో వైయస్ జగన్ మీడియా ముఖంగా చెప్పారు. పోలీస్ వ్యవస్థను సీఎంగా చంద్రబాబు సర్వనాశనం చేస్తుంటే, ధైర్యంగా దానిని వైయస్ జగన్ ఎత్తి చూపడాన్ని పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అభినందించాల్సింది పోయి, ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటం సిగ్గుచేటు. వైయస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ ఏనాడూ ఉద్యోగుల పట్ల చులకనగా మాట్లాడలేదు. కానీ పోలీస్ ఆఫీసర్స్‌ అసోసియేషన్ ఆయనపై మాట్లాడిన మాటలు అభ్యంతరకం. పోలీసులను వీఆర్‌లో పెట్టడం అనేది అడ్మినిస్ట్రేషన్‌లో ఒక భాగం, ఆఫీసర్ల సామర్థ్యాలను బట్టి పోస్టింగ్‌లు ఇస్తారు, దానిని హెచ్‌ఓడీలు నిర్ణయిస్తారంటూ అసోసియేషన్ ప్రతినిధులు సమర్థించుకుంటూ మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత డీజీపీ స్థాయి నుంచి పలు స్థాయిల్లో ఉన్న అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా ప్రతిరోజూ డీజీపీ కార్యాలయంకు వచ్చి సంతకాలు పెట్టి, సాయంత్రం వరకు ఖాళీగా కూర్చోబెట్టి పంపుతున్నారు. ఇదేనా వారి స్థాయికి ఇచ్చే గౌరవం, మర్యాదా.? ఇలా పోలీస్ ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి అధికారుల వరకు ప్రభుత్వం అవమానిస్తుంటే పోలీస్ అధికారుల సంఘం ఎందుకు ప్రశ్నించడం లేదు.? దీనిని సమర్థిస్తున్నారా.? వీఆర్‌లో ఉన్న పోలీస్ అధికారులంతా సమర్థత లేనివారేనని పోలీస్ అధికారుల సంఘం భావిస్తోందా.? గత ప్రభుత్వంలో ఈ అధికారులంతా అనుకూలంగా చేశారని నిందలు వేస్తూ, వారిని వీఆర్‌లో పెట్టి, వేధింపులకు గురి చేస్తున్న విషయం పోలీస్ అధికారుల సంఘానికి కనిపించడం లేదా.? గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పాల్పడలేదు. ఉద్యోగ సంఘాల ప్రతినిధిగా పనిచేసిన నా అనుభవంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. 

ఆ అధికారులను ఎందుకు వేధిస్తున్నారో చెప్పాలి

వైయస్ జగన్‌గారు మీడియాతో మాట్లాడిన సందర్బంలో డీజీపీ స్థాయిలో ఉన్న ఆంజనేయులు, అలాగే సునీల్, సంజయ్, కాంతిరాణా, విశాల్ గున్నీ వంటి ఐపీఎస్‌లను సస్సెండ్ చేసిన వైనం, దాని వెనుక ఉన్న కుట్ర గురించి ఆయన మాట్లాడారు. పెద్ద సంఖ్యలో పోలీస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వీఆర్‌లో పెట్టి, వేధిస్తుండటంపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొందరు పోలీస్ అధికారులు చట్టాన్ని కాపాడకుండా, పాలకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న తీరును ఆక్షేపించారు. నిజాయితీగా పనిచేస్తున్న అధికారులను ఆయన అభినందించారు. ఇటీవల కాలంలో కొందరు పోలీస్ అధికారులు వైయస్ఆర్‌సీపీ శ్రేణులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ, చట్టాలను ఉల్లంఘిస్తూ కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే అనుకూలంగా పనిచేస్తామనే దోరణితో వ్యవహరిస్తున్నారు. 

ఈ ఘటనల్లో పోలీసులను తీరును సమర్థిస్తారా.?

నెల్లూరు జిల్లాలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేసి, భీభత్సం సృష్టించాయి. దీనిపై ఆయన ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే కనీసం దానిని తీసుకునేందుకు కూడా పోలీసులు ముందుకు రాలేదు. దాడి చేసిన వారే ఫిర్యాదు చేస్తే, దానిని మాత్రం తీసుకుని కేసులు నమోదు చేయడాన్ని ఎలా చూడాలి.? ఇదేనా పోలీస్ వ్యవస్థ పనిచేసే తీరు.? ఒక వర్గానికి, ఒక పార్టీకి కొమ్ముకాసేలా పనిచేస్తుంటే దానిని ప్రశ్నించడం తప్పా.? అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు తలొగ్గి, వారు చెప్పినట్లు పనిచేస్తున్నారు. కృష్ణాజిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక కారుపై వందల సంఖ్యలో టీడీపీ గూండాలు దాడి చేస్తుంటే, పోలీసులు అక్కడే వుండి ప్రేక్షకపాత్ర పోషించారు. ఈ ఘటనలో అదే కారులో ఉన్న ఉప్పాల హారిక భర్త రాముపైనే ఎదురు కేసు నమోదు చేశారు. దీనిని ప్రశ్నించడాన్ని పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తప్పు పడుతుందా.? రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివీస్ట్‌ లపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారంటూ పోలీసులు ఎన్నో తప్పుడు కేసులు పెట్టారు. వైయస్ఆర్‌సీపీపై సోషల్ మీడియాతో దారుణమైన పోస్ట్‌లు పెడుతున్న వారిపై ఫిర్యాదు చేసినా ఒక్క కేసు కూడా పెట్టలేదు. 

మేం తప్పులు చేస్తాం..  మీరు కోర్ట్‌లకు వెళ్ళాలని చెబుతారా.?

పోలీస్ వ్యవస్థ వైపు నుంచి కొన్నిసార్లు తప్పులు జరుగుతూ ఉంటాయి, అలాంటప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు మాట్లాడటం దారుణం. అంటే మేం తప్పులు చేస్తుంటాం, మీరు కోర్ట్‌కు వెళ్ళండి అని చెబుతున్నారా.? ఇప్పటికే పోలీస్ అధికారులు చేస్తున్న తప్పులపై న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తూనే ఉన్నాయి. అయినా కూడా పోలీసుల తీరులో మార్పు కనిపించడం లేదు. ఉద్యోగుల సంఘం అంటే తోటి వారికి అన్యాయం జరుగుతుంటే, వారికి అండగా నిలబడాలి. కానీ అలా చేయకుండా, వారికి బదులుగా వైయస్ జగన్ అన్యాయంకు గురైన పోలీసుల గురించి మాట్లాడుతుంటే, దానిని తప్పుబట్టడం సరికాదు. వైయస్ జగన్ ఎప్పుడూ ఉద్యోగుల పక్షపాతి. 

కూటమి పాలన ఉద్యోగ వ్యతిరేక పాలన

ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన గ్రామ, వార్డు సచివాలయ బదిలీలు పూర్తిగా రాజకీయ ప్రమేయంతోనే చేశారు. ఎమ్మెల్యేలకు ముడుపులు ఇచ్చిన వారికి వారికి మాత్రమే కోరుకున్న చోట్లకు బదిలీలు జరిగాయి తప్ప పారదర్శకంగా జరగలేదు. ముడుపులు ఇవ్వలేని వారిని కక్షసాధింపులతో దూర ప్రాంతాలకు బదిలీలు చేశారు. అలాగే మిగిలిన శాఖల్లోనూ ఎమ్మెల్యేలకు కప్పాలు కట్టిన వారికే బదిలీలు చేశారు. ఏడాదికి పైగా పాలనలో ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ నేటికీ ఇవ్వలేదు. పీఆర్‌సీని నియమించలేదు. నాలుగు డీఏలను మంజూరు చేయలేదు. బకాయిలను చెల్లిస్తామని చెప్పి, దానిని అమలు చేయడం లేదు. దాదాపు రూ.25వేల కోట్లకు పైగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం వద్దే ఉన్నాయి. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. సీపీఎస్‌ను తొలగించి, పాత పెన్షన్ విధానంను అమలు చేస్తామన్నారు. అలాగే ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు భృతి ఏమయ్యాయి.? రాష్ట్రంలో 7 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండా వేధిస్తున్నారు. ఆప్కాస్ ద్వారా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అన్యాయం చేస్తున్నారు.

Back to Top