తాడేపల్లి: పోలవరం-బనకచర్లపై ఢిల్లీ సాక్షిగా చంద్రబాబు డ్రామాలు బట్టబయలయ్యాయని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై ఢిల్లీలో కేంద్రమంత్రి సమక్షంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్న భేటీ గురించి చంద్రబాబు ఒకలా, రాష్ట్ర మంత్రి రామానాయుడు మరోలా మాట్లాడటం చూస్తేనే చంద్రబాబు మోసం తెలిసిపోతోందని మండిపడ్డారు. అసలు బనకచర్ల గురించి చర్చే రాలేదని ఈనాడు పత్రికలో వచ్చిన కథనానికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే.. పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్‌పై చంద్రబాబు నిజాలు చెప్పడం లేదు. ఢిల్లీలో జరిగిన భేటీలో ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ చంద్రబాబుకు భజన చేసే ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఈ సమావేశంలో ఏకైక ఎజెండాగా పోలవరం-బనకచర్లపై చర్చ అంటూ పతాక శీర్షికలతో కథనాలు రాశాయి. ఉభయ రాష్ట్రాల సీఎంలు కూర్చుని చర్చించి బనకచర్లపై ఒక అభిప్రాయానికి వస్తారంటూ రాశారు. కానీ సమావేశం అనంతరం ఈ భేటీలో పోలవరం-బనకచర్ల గురించి అసలు చర్చే జరగలేదంటూ వార్తలు బయటకు వచ్చాయి. దీనిపై ఎటువంటి చర్చ జరగలేదని, సీఎంల సమావేశంలో బనకచర్ల ప్రతిపాదనే రాలేదంటూ తెలంగాణ ఈనాడు ఎడిషన్‌లో రాశారు. తెలంగాణా ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడుతూ పోలవరం-బనకచర్ల అనుసంధానంపై కేంద్ర జల సంఘం, పోలవరం అథారిటీ, గోదావరి బోర్డ్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సమావేశంలో చర్చించాల్సిన అవసరం లేదని కూడా అభిప్రాయపడినట్లు తెలిపారు. ఉభయ రాష్ట్రాలూ నాకు సమానమే, పోలవరం-బనకచర్ల పై చర్చించకపోయినా నాకు అభ్యంతరం లేదని చంద్రబాబు తేల్చేశారు. అయితే ఏపీ జలవనరులశాఖ మంత్రి రామానాయుడు మాత్రం సమావేశం తరువాత బయటకు వచ్చి బనకచర్లపై అధ్యయనంపై తదుపరి రోడ్ మ్యాప్ ఖరారు చేస్తాం, ఇందుకోసం ఒక కమిటీ వేశామంటూ ప్రకటించారు. ఢిల్లీ స్థాయిలో జరిగిన సమావేశంపై ఇలా అబద్దాలను ఎలా చెప్పగలుగుతున్నారు.? జరగని అంశాలపై మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల సీఎంల భేటీల వల్ల సాధించింది ఏమిటీ? చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కలుసుకున్నప్పుడల్లా జరిగే సమావేశాల్లో ఎటువంటి ప్రగతి ఉండదు. గత ఏడాది జూన్ 7వ తేదీన ఇలాగే ప్రగతి భవన్‌లో విభజన సమస్యల పరిష్కారంపై చర్చ అంటూ చంద్రబాబు, రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం విభజన సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేస్తున్నామని తెలిపారు. ఇలా ప్రకటించి ఏడాది గడిచింది. ఇప్పటి వరకు ఏ సమస్యలు పరిష్కారం చేశారో చెప్పగలరా.? ఆర్భాటం తప్ప ఈ భేటీలతో జరిగింది శూన్యం. బనకచర్లకు వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకం కాదు పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్‌కు మేం వ్యతిరేకం కాదు. ఈ ఆలోచన చేసింది కూడా వైయస్ జగన్. గోదావరి నీటిని తీసుకువెళ్ళి, కృష్ణాజలాలకు అనుసంధానం చేసి రాయలసీమను సస్యశ్యామలం చేయాలని వైయస్ జగన్ భావించారు. ఇప్పుడు దీనిపై చంద్రబాబు కార్యాచరణ చూస్తే ఆయనకు ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలనే ఆలోచన ఏ కోశానా కనిపించడం లేదు. హంద్రీనీవా నీటిని విడుదల చేస్తూ చంద్రబాబు మాట్లాడుతూ రాయలసీమను సస్యశ్యామలం చేసే బాధ్యత తనదేనని, నన్ను నమ్మాలని కోరారు. పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్ అయినా తెచ్చారా.? వైయస్ రాజశేఖర్‌రెడ్డి గారి హయాంలో వచ్చిన ప్రాజెక్ట్ లు తప్ప కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్‌కు చంద్రబాబు శ్రీకారం చుట్టారా? 42 మీటర్ల ఎత్తు లేకుండా బనకచర్లకు నీరు ఎలా మళ్ళిస్తారు.? పోలవరం నుంచి బనకచర్లకు నీటిని తీసుకు వెళ్ళాలంటే 42 మీటర్ల లెవల్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. కానీ నేడు పోలవరం ప్రాజెక్ట్‌ను 41.15 మీటర్లకే పరిమితం చేశారు. మొత్తం 42 మీటర్ల వరకు నీటిని నింపాలంటే దాదాపు రూ.30వేల కోట్లు కేంద్రం నుంచి పునరావాసం కోసం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రం 41.15 మీటర్లకే కేంద్రం ముందు అంగీకరించడం వల్ల ఈ స్థాయికి మించి ప్రాజెక్ట్‌లో నీటిని నింపేందుకు అవకాశమే లేదు. అలాంటప్పుడు బనకచర్లకు నీటిని ఎలా తీసుకు వెళ్ళగలరో చంద్రబాబు చెప్పాలి. కూటమి ప్రభుత్వ రాగానే పోలవరంను 2027 నాటికి పూర్తి చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. నేడు పోలవరం ప్రాజెక్ట్ ను ఆ గడువులోగా పూర్తి స్థాయిలో పనులు జరగడం లేదని ఎల్లో మీడియాలోనే కథనాలు రాస్తున్నారు. ప్రాజెక్ట్‌కు కీలకమైన డయాఫ్రంవాల్ గత తెలుగుదేశం ప్రభుత్వ అసమర్థత, నాణ్యతా లోపం, ప్రణాళికా లోపం వల్ల కొట్టుకుపోయాయి. డయాఫ్రం వాల్ 1.6 మీటర్ల వెడల్పుతో వేయాలని నిపుణుల కమిటీ చెబితే చంద్రబాబు, కాంట్రాక్ట్రర్లు లాలూచీపడి 0.9 వెడల్పుతో వేస్తున్నారు. దీనిని నిపుణుల కమిటీ అభ్యంతర పెట్టింది. పోలవరం విషయంలో చంద్రబాబు అనేక తప్పులు చేయడం వల్లే ప్రాజెక్ట్ సరైన సమయంలో పూర్తి కాలేదు. 2027 నాటికి కూడా పూర్తి చేయలేకపోతున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌లపైనే చంద్రబాబుకు ఆసక్తి ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పైనే చంద్రబాబుకు ఆసక్తి. అందుకే బనకచర్ల అంటూ హడావుడి చేస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ కోసం అనుమతులు కావాలని దాదాపు రూ.70 వేల కోట్ల అంచనా వ్యయంతో కేంద్రానికి చంద్రబాబు పంపిన ప్రతిపాదనలు ఎందుకు తిరిగి వచ్చాయి.? దాదాపు పది చోట్ల లిఫ్ట్‌లు పెట్టి నీటిని మళ్ళించే ఒక మేజర్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలను కేంద్రం ఎందుకు వెనక్కి తిప్పి కొట్టింది.? సీడబ్ల్యుసీ అనుమతులు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది.? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా కేంద్రానికి రాసిన లేఖలో 41.15 లెవల్‌లో బనకచర్లకు నీటిని మళ్ళించడం కష్టం కాబట్టి, దీనికి అనుమతులు ఇవ్వడం అనవసరం అని స్పష్టం చేశారు. అయినా కూడా ఈ ప్రతిపాదనలను సిగ్గులేకుండా కేంద్రానికి ఎలా పంపారు.? బనకచర్ల మొబిలైజేషన్ అడ్వాన్స్‌లపై కక్కుర్తి తోనే దీనిపై హడావుడి చేస్తున్నారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండి ఎందుకు అనుమతులు తెచ్చుకోలేక పోతున్నారు.? రాష్ట్ర ప్రయోజనాలపై చంద్రబాబు గళం ఎందుకు మూగబోతోంది.?గోదావరి నుంచి మిగులు జలాలు తీసుకోవడంలో ఎవరికైనా అభ్యంతరం ఎందుకు ఉంటుంది.? దీనికి ఇద్దరు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి కూర్చుని చర్చించుకోవాల్సిన అవసరం ఉందా.? ఇదంతా చంద్రబాబు, ఆయన శిష్యుడు చేస్తున్న డ్రామా కాదా.? ఇందుకోసం ఏర్పాటు చేసిన సమావేశంలో అసలు బనకచర్ల గురించే మాట్లాడుకోలేదంటే ఈ డ్రామ ఎలా ఆడుతున్నారో అర్థం చేసుకోవాలి. కొందరు పోలీసులు చంద్రబాబుకు తొత్తులుగా పనిచేస్తున్నారు పోలీస్ యంత్రాంగం లోని ముఖ్యమైన వ్యక్తులు తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారు. చంద్రబాబు ఏం చెబితే అది చేస్తున్నారు. చట్టాలను పట్టించుకోకుండా, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. వారందరినీ మేం గుర్తుంచుకుంటాం. సత్తెనపల్లిలో సింగయ్య మృతిపై వైయస్ జగన్ పైనా, మాజీ మంత్రులపై కేసు ఎలా పెడతారు.? సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టడాన్ని పోలీస్ అధికారుల సంఘం ఎందుకు ఖండించలేదు? దీనిపై పోలీస్ అధికారుల సంఘాలు సమర్థిస్తాయా? సంబంధం లేని ఘటనల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసులు ఎలా పెట్టారు? ఇవ్వన్నీ తప్పులని పోలీస్ అధికారుల సంఘాలకు అనిపించడ లేదా? ముందు వీటికి సమాధానం చెప్పి, ఆ తరువాత వారి అభ్యంతరాలను వెలిబుచ్చాలి. ఐపీఎస్ అధికారిగా ఉండి వైయస్ జగన్ మీటింగ్‌కు వెడితే రౌడీషీట్ పెడతాను అని అనవచ్చా? ఖాకీ దుస్తులు వేసుకుని, ఉద్యోగాలు చేస్తూ, చట్టాలంటేనే లెక్కలేనట్లుగా వ్యవహరిస్తారా? అలాంటి వారి గురించి మాట్లాడితే పోలీస్ అధికారుల సంఘానికి బాధ అనిపిస్తోందా.? పోలీసులు కొందరు విచ్చలవిడిగా తెలుగుదేశంకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఏడేళ్ళ లోపు శిక్షపడే కేసుల్లో 41 నోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్ట్ చేసి, కోర్ట్‌కు హాజరుపరుస్తున్నారు. చివరికి డీజీపీ సైతం దీనిపై మా వాదన వినేందుకు కనీసం సమయం కూడా ఇవ్వరు.