తాడిపత్రి : వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన పని లేదని అనంతపురం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రజల తరఫున నిలిచిన వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ పరిశీలకులు నరేష్‌రెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ, కేతిరెడ్డి పెద్దారెడ్డి కోడలు హర్షిత రెడ్డి, నేతలు రమేష్ రెడ్డి, ఫయాజ్ భాష, పేరం స్వర్ణలత, వెంకట్రామిరెడ్డి, బొంబాయి రమేష్, బాబు, సూర్యనారాయణ రెడ్డి, పుల్లారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరినాథ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి, జిల్ ప్రధాన కార్యదర్శి లాయర్ నాగన్న తదితరులు హాజరై ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లు, క్యూ ఆర్ కోడ్ ఆవిష్కరించారు. 13 నెలలుగా చంద్రబాబు చేస్తున్న మోసాలను నాయకులు ఎండగట్టారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..` రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు దాటింది. చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం తలపెట్టాం. గత ఎన్నికల్లో మనం ఓడిపోయినా 40 శాతం మంది ప్రజలు మనకు ఓటు వేశారు. వారి తరఫున మనం పోరాటం చేయాలి. రాజకీయ పార్టీ అంటే ప్రజలకు సేవ చేయడం. ఓడినా గెలిచినా నాయకుడు అనేవాడు ప్రజల పక్షాన ఉండాలి. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయి. రూ 2.82 లక్షల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో నేరుగా అందించారు. వైయస్ జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అందిస్తాం.. సంపద సృష్టిస్తాం అని ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ అన్నారు. కూటమి ఏర్పడి ఏడాది పూర్తయినా సంక్షేమ పథకాలు అందించలేదు. ఈ ప్రభుత్వం ఏడాది కాలంలోనే రూ.82 వేల కోట్లు ప్రజలకు బాకీ పడింది. రైతులు, కరెంటు సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలపై మనం పోరాటం చేసాం. మనం పోరాడితేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రభుత్వంలో కదలిక వస్తుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రతి కుటుంబానికి అన్యాయం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి ఆ వివరాలను తెలియజేద్దాం. జమిలి వచ్చినా, సాధారణ ఎన్నికలు వచ్చినా మరోసారి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి మనమంతా సమష్టిగా పని చేద్దాం. చంద్రబాబు సూపర్ సిక్స్ అంటే అవినీతి, అరాచకాలు, హత్యలు, అత్యాచారాలు, అక్రమ కేసులు, ఫేక్ ప్రచారాలు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ లు వాళ్ల పని చేయడం లేదు. అధికారులకు, పోలీసులకు నియోజకవర్గాల ఎమ్మెల్యేలే బాస్ లు గా మారిపోయారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులన్నీ తాత్కాలికమే. తాడిపత్రి నియోజకవర్గం లో ఎక్కడా లేని విధంగా భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. తాడిపత్రి నియోజకవర్గంలో నాయకుల కారణంగా రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోకి పెద్దారెడ్డిని ఎందుకు రానివ్వడం లేదు.? కోర్టు ఆదేశాలు కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. తాడిపత్రిలో అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న వారిపై కలిసికట్టుగా పోరాడుదాం. తాడిపత్రి లో సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి భయపడాల్సిన పనిలేదు. ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు మోసాలను వివరించండి . కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మట్టి, ఇసుక, బూడిద అమ్మకాల్లోనే నాయకులు సరిపోయారు. తాడిపత్రి సింగనమల నియోజకవర్గాల్లో నీళ్లు లేక రైతాంగం ఇబ్బంది పడుతుంటే పట్టించుకునే వాళ్ళు కరువయ్యారు. పోలీస్ అధికారులు ఎక్కడైనా చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాడిపత్రిలో పోలీసులు అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే. తాడిపత్రి నియోజకవర్గ కార్యకర్తల రుణం తీర్చుకోలేము` అని అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.