నిందితులు టీడీపీ వాళ్ల‌యితే కేసులు మాఫీ

రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఏపీలో చట్టాలు అపహాస్యం

వైయస్ఆర్‌సీపీ లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు ఎం. మ‌నోహ‌ర్‌రెడ్డి ఆగ్ర‌హం 

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు ఎం. మ‌నోహ‌ర్‌రెడ్డి  

హ‌త్యాయ‌త్నం కేసులైనా సులువుగా త‌ప్పించేస్తున్నారు

ఉప్పాల హారిక‌, నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు కేసుల్లో జ‌రిగింది ఇదే

సుప్రీంకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాలకు విరుద్ధంగా నాన్ బెయిల‌బుల్ సెక్ష‌న్ల విధింపు  

ఎస్సీల మీద‌నే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు న‌మోదు 

వైయస్ఆర్‌సీపీలీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు ఎం. మ‌నోహ‌ర్‌రెడ్డి

తాడేపల్లి: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చట్టాలను కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని వైయస్ఆర్‌సీపీ లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు ఎం. మ‌నోహ‌ర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అరాచకం సృష్టిస్తున్న వారు తెలుగుదేశం పార్టీకి చెందిన వారైతే చాలు ఏ చట్టాలు వారికి వర్తించవు అన్నట్లుగా అన్ని కేసులను మాఫీ చేస్తున్న దుర్మార్గమైన పాలనను దేశంలోనే తొలిసారి చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై దౌర్జన్యం జరిగిందని కేసు పెట్టడానికి వెళ్ళిన బాధితులపైనే ఎదురు కేసులు నమోదు చేస్తున్న అరాచకం ఏపీలో అమలు జరుగుతోందని అన్నారు. సుప్రీంకోర్ట్ మార్గదర్శకాలకు విరుద్దంగా నాన్ బెయిలబుల్ సెక్షన్లు విధించడం, ఎస్సీల పైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం వంటి తప్పుడు చర్యలకు పోలీస్ అధికారులు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. 

ఇంకా ఆయనేమన్నారంటే...

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటై ఏడాది పూర్త‌యినా ప్ర‌తిప‌క్ష నాయ‌కుల మీద క‌క్ష తీర్చుకునేందుకు, అక్ర‌మ కేసులు బ‌నాయించి వేధించేందుకు ఇప్ప‌టికీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో అమ‌లువుతున్న ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కార‌ణంగా పోలీసులు కూడా తీవ్ర ఒత్తిడికి గుర‌వుతున్నారు. దేశమంతా ఒక‌టే చ‌ట్టం అమ‌లవుతుంటే, ఏపీలో మాత్రం అధికార పార్టీకి ఒక‌రకంగా, ప్ర‌తిప‌క్షానికి మ‌రోర‌కంగా చ‌ట్టాల‌ను అమ‌లు చేస్తున్నారు. ప్ర‌భుత్వ పెద్దల ఆశీస్సులుంటే మేం ఏమైనా చేయ‌గ‌ల‌మ‌నే ధీమాతో కొందరు పోలీస్ అధికారులు రెచ్చిపోతున్నారు. 

కీలుబొమ్మలుగా మారిన పోలీసులు
 
రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. పోలీస్ వ్య‌వ‌స్థ భ్ర‌ష్టుప‌ట్టిపోయింది. కేసుల న‌మోదు, విచార‌ణ‌, ద‌ర్యాప్తుల ప్ర‌క్రియ అప‌హాస్యం అయింది. బాధితుల‌కు అండ‌గా ఉండాల్సిన పోలీసులు రాజ‌కీయ ఆట‌లో కీలుబొమ్మ‌లుగా మారిపోయారు. బాధితుల‌నే నిందితులుగా చేరుస్తున్న ఉదంతాలు రాష్ట్రంలో కోకొల్ల‌లుగా జ‌రుగుతున్నాయి. ప్ర‌భుత్వం, పోలీసులు క‌లిసి చ‌ట్టాన్ని త‌మ చుట్టంగా ఉప‌యోగించుకుంటున్న దారుణ ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఇదే కొన‌సాగితే సామాన్యుల‌కు న్యాయం జ‌రిగే ప‌రిస్థితి ఉంటుందా అనే అనుమానం క‌లుగుతుంది. మీడియా చేతుల్లో ఉంది క‌దా అనే ధీమాతో దాడుల‌ను దాచిపెడుతున్నారు. సోష‌ల్ మీడియా ఉంది కాబ‌ట్టే ఈ మాత్ర‌మైనా అరాచ‌కాలు వెలుగుచూస్తున్నాయి. రైతులపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామ‌ని ఎస్పీలు బెదిరిస్తున్నారు. రైతుల్ని దండుపాళ్యం బ్యాచ్ అంటున్నారు. కూటమి ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా ఇలాంటి విధానాల‌ను ఆప‌క‌పోతే భ‌విష్య‌త్తులో త‌ప్ప‌కుండా మూల్యం చెల్లించుకోక‌త‌ప్ప‌దు. ఈ ప్ర‌భుత్వం చేసే అరాచకాల‌ను న్యాయస్ధానాల్లో ఎదుర్కొంటాం. అక్ర‌మ అరెస్టులు చేస్తున్న పోలీసుల మీద ప్రైవేట్ కంప్లైంట్స్ వేయ‌డం కొన‌సాగుతుంది. పోలీసులు ఇప్ప‌టికైనా చ‌ట్టానికి అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తే బాగుంటుంది. 

దాడులకు తెగబడిన కేసుల్లో కీల‌క నిందితులకు వత్తాసు 

గుడివాడ‌లో జ‌రుగుతున్న "బాబు ష్యూరిటీ -మోసం గ్యారెంటీ" స‌భ‌కు హాజ‌ర‌వుతున్న కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మ‌న్ ఉప్పాల హారిక‌, ఆమె భ‌ర్త ఉప్పాల రాము మీద ప‌థ‌కం ప్ర‌కార‌మే టీడీపీ, జ‌న‌సేన‌కు చెందిన గూండాలు దాడులు చేశారు. ఏమాత్రం భ‌యం లేకుండా వారు పార్టీ జెండాల‌తో వారి కారును అడ్డ‌గించి దాడులు చేశారు. గుడివాడ‌లో కేసు న‌మోదు చేయ‌మ‌ని అడిగితే పోలీసులు పెడ‌న వెళ్ల‌మ‌న్నారు. పెడ‌న వెళితే ఎస్పీకి కంప్లైంట్‌ ఇవ్వ‌మ‌ని చెప్పారు. హారిక దంప‌తులు లేదు ఇక్క‌డే ఇస్తామని, కేసు తీసుకోలేదంటే న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యిస్తామన‌డంతో త‌ప్ప‌నిస‌రి పరిస్థితుల్లో తూతూమంత్రంగా పోలీసులు కేసు న‌మోదు చేశారు. అందులోనూ దాడుల్లో పాల్గొన్న కీల‌క‌మైన నిందితుల‌ను వ‌దిలేశారు. తెలుగుదేశం నాయ‌కుడు రాము ఈ దాడుల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తే అతడి మీద కేసు పెట్ట‌లేదు. తెలుగుదేశం నాయ‌కుల‌కు భ‌యప‌డి పోలీసులు ఆయ‌న్ను వ‌దిలేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను కూడా మీడియా ద్వారా ప్రజలు చూడాలని ప్రదర్శిస్తున్నాము. అలాగే మ‌న్న‌వ గ్రామ సర్పంచ్ నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు కేసులోనూ 5 మందిని ముద్దాయిలుగా చేర్చి ముగ్గుర్ని పోలీసులు రిమాండ్‌కి త‌ర‌లించారు. టీడీపీ నాయ‌కుల ఆదేశాల‌తో 4, 5 వ నిందితుల‌ను త‌ప్పించేందుకు కోర్టులో ఆల్ట‌రేష‌న్ మెమో వేశారు. దాడిలో కీల‌క సూత్ర‌ధారి, పాత్ర‌ధారి బండ్ల‌మూడి చింపిర‌య్య, ఆయ‌న అనుచ‌రుడు అయితే వారిని నిస్సిగ్గుగా కేసు నుంచి త‌ప్పించారు. లిక్క‌ర్ స్కాం కేసులో ఆధారాల‌తో స‌హా చంద్ర‌బాబు ముద్దాయిగా చేర్చితే ఆ కేసును నీరుగార్చి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. 

బంగారుపాళెం పర్యటనలో పలువురిపై అక్రమ కేసులు

మామిడి రైతులను ప‌రామ‌ర్శించేందుకు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్ బంగారుపాళ్యెం ప‌ర్య‌ట‌నకు వెళితే ఈ సంద‌ర్భంగా ఆంధ్ర‌జ్యోతి ఫొటోగ్రాఫ‌ర్ మీద దాడి చేశారంటూ వైయస్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు. ముగ్గురు వైయస్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌ను 10వ తేదీనే అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని 24 గంట‌ల్లోనే కోర్టులో హాజ‌రు ప‌ర‌చాల‌న్న నిబంధ‌నలు ఉన్నా ప‌ట్టించుకోలేదు. వారి బంధువులు హైకోర్టులో హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్ వేయ‌డంతో 12వ తేదీన‌ అరెస్ట్ చేశామ‌ని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మ‌రోవైపు 10వ తేదీనే వీళ్ల‌ను తీసుకొచ్చి విచారించి వ‌దిలేశామ‌ని, కానీ వారిని ఇంటికి వెళ్ల‌మంటే వెళ్ల‌క‌పోవ‌డంతో ఆ రాత్రి మా వ‌ద్దనే ఉంచుకుని త‌ర్వాత రోజు ఉద‌యం పంపేశామ‌ని చెప్పిన పోలీసులు, బ‌స్టాండ్‌లో పారిపోతుండ‌గా 12వ తేదీన ప‌ట్టుకున్నామ‌ని క‌ట్టుక‌థ‌లు చెబుతున్నారు. అరెస్టు చేసిన‌ప్పుడు వీరి మీద న‌మోదైన బెయిల‌బుల్ సెక్ష‌న్ల‌ను, ఆ త‌ర్వాత రాజ‌కీయ ఒత్తిళ్ల‌తో హ‌త్యాయ‌త్నం, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద‌కి మార్చి నాన్‌బెయిల‌బుల్ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. ఇక్క‌డ అరెస్ట‌యిన ముగ్గురు నిందితుల్లో ఇద్ద‌రు ఎస్సీలే అయినా వారి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేయ‌డం విడ్డూరంగా ఉంది. ఇవ‌న్నీ మూడేళ్ల లోపు శిక్ష ప‌డే కేసులే. సుప్రీంకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఏడేళ్ల‌లోపు శిక్ష‌ప‌డే కేసుల్లో బెయిల్ వెంట‌నే మంజూరు చేయాల‌ని ఉంది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కొట్టార‌ని, తాను ప్ర‌స్తుతం బాగానే ఉన్నాన‌ని చెప్పినా విన‌కుండా ఈ సంఘ‌ట‌న‌ను తెలుగుదేశం పార్టీ డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ కోసం వాడుకుంది. ఫొటోగ్రాఫ‌ర్‌కి సీఎం చంద్ర‌బాబు ఫోన్ చేసి మూడు నిమిషాల పాటు పరామర్శించి నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని ఆదేశించాడు. ఆపై మంత్రులు వ‌రుస‌పెట్టి అత‌డ్ని ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్ల‌డం, ఆర్థిక సాయం చేయ‌డం, తాను బాగున్నాన‌ని చెప్పినా విన‌కుండా మెరుగైన చికిత్స పేరుతో ఆస్ప‌త్రిలో చేర్పించ‌డం లాంటి కార్య‌క్ర‌మాల‌తో ఎల్లో మీడియాలో హ‌డావుడి చేయాల‌ని చూశారు.

Back to Top