తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొదటి నుంచి కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలనే తలంపే లేదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ జీవితంలో రైతుల ప్రాణాలను బలితీసుకోవడం, వారి ఉసురు పోసుకోవడం తప్ప వారికి అండగా నిలబడిన దాఖలాలే లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఆత్మబంధువుగా నిలిచింది ఆనాడు స్వర్గీయ వైయస్ రాజశేఖర్‌రెడ్డి అయితే, నేడు ఆయన తనయుడు వైయస్ జగన్ మాత్రమేనని అన్నారు. అబద్దాలు, వంచనతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన అసమర్థతను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించడమే పాలన అని అనుకుంటున్నాడని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... వైయస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా రైతులకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్, రైతురుణమాఫీ, ఎనబైకి పైగా ప్రాజెక్ట్‌లను ప్రారంభించి, వాటిల్లో పది ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి దాదాపు 25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించారు. మాట ఇస్తే దానిని ఖచ్చితంగా అమలు చేసిన నాయకుడు వైయస్ రాజశేఖర్‌రెడ్డి. అందుకే ఆయన రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వైయస్ఆర్ తనయుడిగా వైయస్ జగన్ తన పాలనలో మరో నాలుగు అడుగులు ముందుకు వేసి రైతులకు అండగా నిలిచారు. ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.13,500 రైతుభరోసా పేరుతో క్రమం తప్పకుండా అందించిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుంది. ధరలు పతనమైన సమయాల్లో గిట్టుబాటు ధరలు కల్పించడం, ప్రకృతి వైఫరీత్యాల్లో పరిహారం చెల్లించడం వంటి కార్యక్రమాలను పకడ్బంధీగా అమలు చేశారు. మామిడి రైతులకు అండగా నిలిస్తే ఓర్వలేకపోయారు చిత్తూరు జిల్లా బంగారుపాళెంకు మామిడి రైతులను ఆదుకునేందుకు వైయస్ జగన్ వచ్చారు. మామిడి పంటకు కిలో రూ.2 కి కొనుగోలు చేస్తూ, వారిని నిలువునా దోపిడీ చేస్తున్న వైనంను వ్యతిరేకిస్తూ, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఆయన చిత్తూరు జిల్లాలో పర్యటించారు. అంతుకు ముందు ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులకు, గుంటూరు జిల్లాలో మిర్చి రైతులకు కూడా ఇదే తరహాలో ఆయన అండగా నిలిచారు. కానీ బంగారుపాళెం పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ ద్వారా కూటమి ప్రభుత్వం ఆయన పర్యటనకు అనేక ఆటంకాలను కల్పించింది. వైయస్ జగన్‌ను కలిసేందుకు వస్తే రైతులపై రౌడీషీట్లు తెరుస్తామంటూ హెచ్చరించారు. జి.నెల్లూరు నియోజకవర్గంలో మూడు వేల మంది రైతులకు పోలీసులు నోటీసులు జారీ ఇచ్చారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు వచ్చిన ప్రతిపక్ష నాయకుడిపై ఇన్ని ఆంక్షలు విధిస్తారా? ప్రజలు ఆయనను కలుసుకునేందుకు వీలు లేదంటూ నిరంకుశంగా పోలీసులను ప్రయోగిస్తారా? చిత్తూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం చంద్రబాబు అసమర్థత వల్లే మామిడి రైతులు నష్టపోయారు. వారిని ఆదుకోకపోగా, అండగా నిలివడానికి వచ్చిన వైయస్ జగన్‌ను ఓర్వలేకపోయారు. అక్రమ కేసులు... పోలీస్ నిర్బంధం... బంగారుపాళెం మామిడి మండీలో ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ శివశంకర్ పై దౌర్జన్యం చేశారంటూ ఒక ప్రచారం చేశారు. ఈ ఘటనను అడ్డం పెట్టుకుని రైతులు వినోద్‌కుమార్, మోహన్, చక్రవర్తి నాయుడు, శంకరాచార్యలపై కేసులు నమోదు చేసి, వారిని మూడు రోజుల పాటు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి తల్లిదండ్రులకు కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా నరకం చూపించారు. తమ బిడ్డలను పోలీసులు అక్రమంగా తీసుకువెళ్ళి, వారు ఎక్కడ ఉన్నారో కూడా సమాచారం చెప్పడం లేదని వారి తల్లిదండ్రులు న్యాయస్థానలో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ విషయం తెలియగానే జిల్లా ఎస్సీ, డీఎస్సీలు వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టి, రాత్రికి రాత్రే జైలుకు తరలించారు. వారిపై 118/1, 115/2, 324/4, R/W 35, BNS 31RS, 32/అమెండ్‌మెంట్ యాక్ట్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌లను నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన వారు కూడా ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన వారే. వారిపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు ఎలా నమోదు చేస్తారు? ఇదేనా ప్రజాస్వామ్యబద్దంగా పాలన చేయడం? తప్పుడు కేసులు పెట్టుకుంటూ ఇదే పాలన అని చెప్పుకోవడం సిగ్గుచేటు. మరోవైపు ప్రతిపక్ష నేత, జెడ్‌ప్లస్ కేటగిరి ఉన్న నాయకుడికి కనీసం భద్రత కూడా కల్పించకుండా ఇబ్బంది పెట్టారు. వైయస్ఆర్‌సీపీ నాయకుడు విజయానంద్‌రెడ్డిపైనా కూడా తప్పుడు కేసు పెట్టారు. పలమనేరు నియోజకవర్గ ఇన్‌చార్జీ డాక్టర్ సునీల్‌పైన కూడా ఇదే తరహాలో అక్రమ కేసులు బనాయించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, వైయస్ఆర్‌సీపీ శ్రేణులను భయపెట్టలేమనే విషయాన్ని చంద్రబాబు గుర్తించాలి.