నరసరావుపేట: మద్దతు ధర కల్పించలేని ప్రభుత్వ అసమర్థతపై ఆగ్రహంతో రోడెక్కిన రైతులను దండుపాళ్యం బ్యాచ్ అంటూ అసాంఘీక శక్తులు, దొంగలతో పోలుస్తూ కూటమి నేతలు వ్యాఖ్యలు చేయడం, ఎల్లో మీడియా ప్రముఖంగా దానిని ప్రచారం చేయడం పట్ల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. నరసరావుపేట క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇకపై తమకు అన్యాయం జరగిందంటూ ఎవరు రోడ్డెక్కినా వారిని ఇలాగే చూస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారా అని ప్రశ్నించారు. రైతుల పట్ల చంద్రబాబు రాక్షసంగా వ్యవహరిస్తే, వారి కన్నీళ్ళను తుడిచేందుకు వైయస్ జగన్ మానవత్వంతో వారి వద్దకు వెళ్ళారని అన్నారు. అన్నం పెట్టే రైతును దుర్మార్గమైన దొంగలతో పోల్చిన నీచమైన రాజకీయానికి చంద్రబాబు తెగబడ్డాడని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... ఒకపక్క వైయస్ జగన్ పర్యటనలో జనమే లేరని ఆంధ్రజ్యోతిలో వార్తలు రాస్తారు. ఇంకోపక్క వేలల్లో రైతులు వచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రెస్‌మీట్ పెట్టి చెబుతున్నాడు. ఒక అబద్ధానికి కట్టుబడి ఉండాలి కదా? పోలీసులతో మాట్లాడుతుంటే రెచ్చిపోతున్న జగన్.., పోలీసులను నరికేయండ్రా.. అని జగన్ ఫొటోలతో హెడ్డింగులు పెట్టి ఇష్టమొచ్చినట్టు వార్తలు అచ్చేశారు. ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు పెట్టినా, కేసులు పెడతామని బెదిరించినా, హౌస్ అరెస్టులు చేసి వేధించినా, బంగారుపాళ్యెం దారులన్నీ బారికేడ్లతో మూసేసినా, జగన్ కోసం వచ్చే రైతులను ఆపలేకపోయారు. పోలీసులే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని బెదిరిస్తున్నారు. అయినా ఇవన్నీ లెక్క చేయకుండా ప్రతిపక్ష నాయకుడి పర్యటన విజయవంతం కావడంతో తట్టుకోలేక ఇలాంటి పనికిమాలిన హెడ్డింగులు పెట్టుకుని ఆత్మసంతృప్తి చెందుతున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఇలాంటి పర్యటనలు చేసినప్పుడు ఇంతదారుణమైన హెడ్డింగులు పెట్టి కథనాలు రాశారా? 100 మంది మాత్రమే రావాలి, 3 కార్లే వాడాలి లాంటి నిబంధనలు చంద్రబాబుకి మా ప్రభుత్వం పెట్టిందా? వస్తున్న వాడు మామూలు వ్యక్తి కాదని అచ్చెన్నాయుడు చెబుతున్నాడు. మేం కూడా అదే చెబుతున్నాం, జగన్‌కి అధికారంతో పదవులతో పనిలేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, 151 సీట్లతో గెలిచానా, 11 సీట్లకే పరిమితం అయినా, ఆయన ప్రజాసమస్యల మీద ప్రశ్నించకుండా ఎవరూ ఆపలేరు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆయన ప్రశ్నిస్తూనే ఉంటారు. అసమర్థ పాలనకు చంద్రబాబు వ్యాఖ్యలే నిదర్శనం నిత్యం చంద్రబాబుకు భజన చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు 'మీ పనితీరు ఆశించినట్టు లేదు, మీకేం పట్టదా' అంటూ మంత్రులపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని పతాక శీర్షికల్లో కథనాలు రాశారు. కానీ వాస్తవానికి మంత్రులు, ఎమ్మెల్యేల కన్నా ముందు చంద్రబాబు పనితీరే బాలేదని ప్రజలు అనుకుంటున్నారు. సూపర్ సిక్స్ హామీలు ఏవీ అమలు చేయలేదని జనం చంద్రబాబుని తిట్టుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో ఎవరూ సుఖంగా లేరు. జగన్ ఇచ్చేవన్నీ అమలు చేస్తూనే కొత్తగా సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేస్తామని, సంపద సృష్టించి ప్రజల చేతుల్లో పెడతానని నమ్మబలికిన చంద్రబాబు, తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. తానా, ఆటా సభలంటూ ఎమ్మెల్యేలు అమెరికా పర్యటనల్లో తిరుగుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు 'సుపరిపాలన' పేరుతో ప్రజల వద్దకు వెళ్తుంటే ప్రజలు చీదరించుకుంటున్నారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ఆ నెపాన్ని మంత్రులు, ఎమ్మెల్యేల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా, రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా ఆయనే ప్రజలను గాలికొదిలేసి, కేబినెట్ మీటింగ్‌లో మంత్రుల మీద మాటల దాడి చేయడం హాస్యాస్పదం. పసిపిల్లల ముందు చంద్రబాబు పచ్చి అబద్దాలు ఒక పక్క మంత్రులను తిడుతూనే పేరెంట్ టీచర్ మీటింగ్‌లో వైయస్ జగన్ తీసుకొచ్చిన అమ్మ ఒడి కార్యక్రమానికి తల్లికి వందనంగా పేరు మార్చి లోకేష్ కనిపెట్టాడని పసి పిల్లల ముందు చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నాడు. అదే నోటితో రూ.99 లకు మద్యం పథకం, ప్రతి మంగళవారం అప్పుల పథకం, ఇసుక దోపిడీ పథకాలను ఎవరు కనిపెట్టారో కూడా చెబితే బాగుంటుంది. పథకాల గురించి ప్రశ్నిస్తే నాలుక మందం, దొంగలు, బందిపోట్లు, దండుపాళ్యం అని మా మీద ప్రచారం చేస్తారు. గొప్పలు చెప్పుకోవడం మానేసి ఎన్నికల్లో ఇచ్చిన పథకాలను అమలు చేయడం ఎలాగూ ఆలోచిస్తే బాగుంటుంది.