కృష్ణా జిల్లా: రాష్ట్రంలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందనడానికి మరో తార్కాణం.. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందనడానికి మరో నిదర్శనం.. రాష్ట్రంలో శాడిస్టు ప్రభుత్వం రాజ్యమేలుతోందనడానికి నిలువుటద్దం.. కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం సాక్షాత్తు జిల్లా ప్రథమ పౌరురాలు, జెడ్పీ చైర్‌పర్సన్, బీసీ మహిళ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాలు విచక్షణా రహితంగా మారుణాయుధాలతో దాడి చేశారు. తాలిబన్లు, ఐసిస్, హమాస్, హిజ్‌బుల్లా ఉగ్రవాదులను మరిపించే రీతిలో పోలీసుల సమక్షంలోనే బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా అడ్డుకుని మరీ దాడి చేయడం విస్తుగొలుపుతోంది. మద్యం, గంజాయి సేవించి.. సైకోల్లా కేకలు వేస్తూ.. చంపండి.. కొట్టండి.. అని అరుస్తూ బండరాళ్లు, కర్రలతో దాడులు చేస్తున్నా పోలీసులు అడ్డుకోవడానికి ఏమాత్రం ముందుకు రాకపోవడం రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలనకు అద్దం పడుతోంది. దాడిని నిలువరించక పోగా, సినిమా షూటింగ్ చూస్తున్నట్లు వ్యవహరించడం.. తీరా దాడి చేసి వెళ్లిపోతుండగా హంగామా చేయడం పోలీసులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు ఎంతగా లొంగి పోయారన్నది తేటతెల్లం చేస్తోంది. ఇదే రీతిలో నెల్లూరులో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఇంటిపై కూడా టీడీపీ గూండాలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడటం తెలిసిందే. దాడి చేసిన టీడీపీ మూకలపై ఇప్పటి దాకా కేసు కూడా నమోదు చేయని పోలీసులు.. బాధితుడైన ప్రసన్న కుమార్‌రెడ్డి పైనే కేసు నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వ దురీ్నతిని బయట పెడుతోంది. అంతకు మందు ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ గూండాల తరఫున వకాల్తా పుచ్చుకున్న సీఐ.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రివాల్వర్ ఎక్కుపెట్టి.. కాల్చేస్తానని బెదిరించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హైకోర్టు అనుమతితో.. అదీ ఏడాది తర్వాత సొంత నియోజకవర్గం తాడిపత్రిలోని తన ఇంట్లో అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని టీడీపీ గూండాల ఒత్తిళ్లకు తలొగ్గి.. పోలీసులే ఆయన్ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అనంతపురం పంపడం రాష్ట్రంలో ప్రభుత్వ దుర్మార్గానికి అద్దం పట్టింది. గుడివాడలో దాడి జరిగిందిలా.. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఊరారా ఎండగట్టేలా ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని గుడివాడ మండలం లింగవరంలోని కె.కన్వెన్షన్‌లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిర్వహించ తలపెట్టాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్, బీసీ నాయకురాలు ఉప్పాల హారిక తన భర్త, ఇతరులతో కలిసి వాహనంలో బయలు దేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. ఈ విషయం తెలియడంతో కూటమి నేతల కన్ను కుట్టింది. గుడివాడ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం విజయవంతం కాకుండా చూడాలని ప్రభుత్వ పెద్దల నుంచి స్థానిక టీడీపీ, జనసేన నేతలకు ఆదేశాలు అందాయి. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చే వైఎస్సార్‌సీపీ శ్రేణులను నాగవరప్పాడు వద్ద అడ్డుతగులుతూ, రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. రాళ్లు, కర్రలు చేత పట్టుకుని యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. కర్రలు, రాడ్లతో సభకు వెళ్లే వారిని అడ్డగించి, అడ్డువచ్చిన వాహనాలపై దాడులకు తెగబడ్డారు. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంయమనం పాటించాయి. ఈ క్రమంలో సభకు హాజరయ్యేందుకు గుడివాడ మీదుగా లింగవరం వెళ్తున్న జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక కారు అక్కడికి రాగానే.. టీడీపీ, జనసేన నేతలు రాళ్లు, కర్రలు, రాడ్లతో పోలీసుల సమక్షంలో దాడులకు తెగబడ్డారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారుపై బండరాళ్లు విసిరారు. బీసీ మహిళ అని కూడా చూడకుండా బూతులు తిట్టారు. కారును ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు. కారుపై పదిసార్లు విచ్చలవిడిగా దాడి చేయడంతో గంటన్నర సేపు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జెడ్పీ చైర్‌పర్సన్, ఆమె భర్త కారులోనే ఉండిపోయారు. ఈ తతంగం అంతా జరిగాక, అక్కడే ఉన్న పోలీసులు తాపీగా అక్కడికి చేరుకుని ఉప్పాల హారికను అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. దాడికి పాల్పడిన వారిని పల్లెత్తు మాట అనకుండా జెడ్పీచైర్‌పర్సన్, అమె భర్త, వైఎస్సార్‌సీపీ నేతలనే తప్పు పట్టేలా వ్యవహరించారు. చంపేస్తారనుకున్నా.. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి ఆమె విలేకరులతో మాట్లాడారు. గుడివాడ మండలం లింగవరం వద్ద వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు తన భర్త రాముతో కలసి కారులో వెళ్తుంటే మార్గమధ్యంలో నాగవరప్పాడు వద్ద టీడీపీ, జనసేన నాయకులు గూండాల్లా కర్రలు, రాడ్లతో కారుపై పోలీసుల సమక్షంలోనే దాడి చేసి కారు అద్దాలను పగలకొట్టారని చెప్పారు. తమను హతమార్చేందుకు ప్రయత్నించారని కన్నీటిపర్యంతమయ్యారు. ఓ దశలో తనను చంపేస్తారనుకున్నానని చెప్పారు. తన మామ, తన భర్త, తాను రాజకీయాల్లో ఉన్నా, ఇప్పటి వరకు ఎవరినీ విమర్శించలేదని, తన దారిలో తాను వెళ్తుంటే బీసీ మహిళ అని కూడా చూడకుండా నోటితో చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో దూషించి తమను చంపేందుకు యత్నించారన్నారు. సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో అక్కడ ఉండగానే, వారి సమక్షంలోనే తమపై దాడి చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో జిల్లా ప్రథమ పౌరురాలినైన తనకే రక్షణ లేకపోతే సామాన్య మహిళలకు ఏం రక్షణ ఉంటుందని ఆమె ప్రశ్నించారు. తనపై జరిగిన దాడికి సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఇప్పటికే గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. జిల్లా ఎస్పీని కలసి దాడి గురించి ఫిర్యాదు చేస్తానని హారిక తెలిపారు. పెడన నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి ఉప్పాల రాము మాట్లాడుతూ టీడీపీ నేతలు మద్యం తాగి వచ్చి వీధి గూండాల్లా కర్రలు, రాడ్లతో తమపై దాడి చేసి తమను హతమార్చేందుకు ప్రయత్నించారన్నారు. దాదాపు 400 మంది పోలీసుల సమక్షంలోనే తమపై దాడి చేశారన్నారు. కారులో తాను ఒక్కడినే ఉంటే భయపడేవాడిని కాదని, మహిళ అయిన తన భార్య ఉండటంతో ఆందోళన చెందానన్నారు. తన భార్యను ఇష్టానుసారంగా దుర్భాషలాడి, తమను చంపేందుకు ప్రయత్నించారని, దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన నందివాడ జెడ్పీటీసీ సభ్యురాలి భర్త కందుల నాగరాజుపై కూడా దాడికి దూసుకు వచ్చారన్నారు. కూటమి నేతలకు బీసీ మహిళలు అంటే అంత చులకనా? ఓట్ల కోసమే బీసీలు కావాలా? అని ప్రశ్నించారు. ఈ దాడిపై గుడివాడ ఎమ్మెల్యే రాము స్పందించాలని, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్య నాయకుల హౌస్ అరెస్ట్ గుడివాడ కార్యక్రమానికి జిల్లా నాయకులు వస్తున్నారన్న సమాచారంతో ముందస్తుగానే అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు హౌస్ అరెస్ట్‌లు చేశారు. మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని కృష్ణమూర్తి(కిట్టు)లను పోలీసులు ముందుగానే మచిలీపట్నంలో హౌస్ అరెస్ట్ చేశారు. కేవలం గుడివాడలో వైఎస్సార్‌సీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు గూండాలుగా మారి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా టీడీపీ నాయకులు, గూండాలు వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కార్యక్రమంలో దాదాపు మూడు వేల మంది పాల్గొనడంతో గుడివాడ దద్దరిల్లిపోయింది. ఈ కార్యక్రమానికి వస్తున్న జెడ్పీ చైర్మన్ కారుపై పచ్చమూకలు దాడికి తెగబడ్డారన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు రోడ్డుపైకి రావడంతో ఒక్కసారిగా టీడీపీ నేతల్లో కంగారు మొదలైంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వైఎస్సార్‌సీపీ నాయకులకు సర్దిచెప్పారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్ ఉప్పాల హారికతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శ ధైర్యంగా ఉండాలని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన మూకల దాడిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. శనివారం బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడి దాడి వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడి జరిగిన విషయాన్ని పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఒక బీసీ మహిళ, జిల్లా ప్రథమ పౌరురాలు భయంతో వణికిపోయే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే ఇంతకంటే దారుణం ఉంటుందా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని, ఆటవిక పాలన సాగుతోందని మండిపడ్డారు. వాహనాలు, అంబులెన్స్‌ను అడ్డుకుని వీరంగం గుడివాడలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశాన్ని అడ్డుకోడానికి కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన కార్యకర్తలు చేయని ప్రయత్నం లేదు. వారు శనివారం స్థానిక నాగవరప్పాడు వంతెన వద్ద వీరంగం సృష్టించారు. గంజాయి, మద్యం మైకంలో ఏమి చేస్తున్నారో తెలియక వచ్చి పోయే వాహనాలను అడ్డుకుని సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. పోలుకొండ రోడ్‌లో రోగిని తీసుకెళ్లేందుకు వెళ్తున్న అంబులెన్స్‌ను సైతం అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో దానిని వదిలివేశారు. ఇలా ప్రతి వాహనాన్ని ఆపడం, అందులో ఉన్న వారిని గుర్తించి.. వైఎస్సార్‌సీపీ నాయకులని భావిస్తే వారిపై దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు సూర నరసారావు ఏలూరు వెళుతుండగా నాగవరప్పాడు వంతెన వద్ద టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తాను సమావేశానికి వెళ్లడం లేదని, వ్యక్తిగత పనిపై ఏలూరు వెళుతున్నానని చెప్పినా వినిపించుకోకుండా కారుపై దాడి చేసి అద్దాలు పగులగొట్టేయత్నం చేశారు. అరాచకానికి పరాకాష్ట రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని, యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తూ.. పౌర హక్కులను కాలరాస్తోంది. తమను ప్రశ్నించే వారే ఉండకూడదన్నట్లు తాలిబన్లను మరిపిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలను సైతం అడ్డుకుంటోంది. ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలతో పాటు మిగతా హామీలన్నీ అమలు చేయాలన్న డిమాండ్ ప్రజల నుంచి రాకుండా ముందే భయభ్రాంతులకు గురి చేసేలా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. ఈ కమ్రంలో ప్రజా సమస్యలు ఎత్తి చూపేందుకు ప్రజల్లో వెళ్తున్న వైఎస్ జగన్‌కు భద్రత కల్పించకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటన, టీడీపీ గూండాల చేతిలో హతమైన బీసీ నాయకుడు కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి మండల పర్యటనకు వెళ్లినప్పుడు అడ్డంకులు సృష్టించింది. ఇదే రీతిలో ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వెళ్లినప్పుడు, పల్నాడు జిల్లా సత్తెనపల్లెలో టీడీపీ గూండాల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు, నిన్నటికి నిన్న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతులకు మద్దతు ధర కోసం గళం విప్పేందుకు వెళ్లినప్పుడు ఇదే తరహాలో అడ్డంకులు సృష్టించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు, నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించింది.