విజయవాడ: నగరంలో కూటమి ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన షాదిఖానా నిర్మాణం పూర్తి చేసే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం చేస్తుందని ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. 19వ డివిజన్ వైవీ రావు హాస్పిటల్ సమీపంలో నిలిచిపోయిన షాదీఖానా నిర్మాణ పనులను దేవినేని అవినాష్ , మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రాహుల్లా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అద్యక్షుడు గౌతమ్ రెడ్డి ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసిఫ్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ , అవుతూ శైలజ , గుంటూరు పార్లమెంట్ పరిశీలకుడు పోతిన మహేష్, 19వ డివిజన్ కార్పొరేటర్ రెహనా నహీద్ ,కో ఆప్షన్ సభ్యులు అలీమ్ తదితరులు మైనారిటీలతో కలిసి భారీ ప్రదర్శన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముస్లింలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. `మైనార్టీల చిరకాల కోరిక అయిన షాదిఖానా నిర్మాణాన్ని వైయస్ఆర్‌సీపీ హయంలో ప్రారంభించాం. మైనార్టీల కోసం వైయస్ జగన్ హయంలో ఆర్ అండ్ బీ స్థలాన్ని మున్సిపల్ శాఖకు బదిలీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిన నిర్మాణం పూర్తి కాలేదు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మైనార్టీలను మోసం చేశారు. 2014 నుంచి షాదీఖాన విషయంలో అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. ఇక్కడ విషయాన్ని వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తెలియచేశా. వైయస్ జగన్ చిత్తశుద్ధితో కృషి చేసి ఎన్ని ఇబ్బందులు ఉన్న వాటిని దాటి ఇక్కడ షాదిఖాన నిర్మాణం ప్రారంభించాం. వైయస్ జగన్ రెండవ సారి సీఎం అయి ఉంటే ఈపాటికే పూర్తి అయిపోయేది. 2014లో మైనార్టీలను గద్దె రామ్మోహన్ ఏ విధంగా మోసం చేశారో ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ షాదీఖాన పూర్తి అయ్యే వరకు వారికి అండగా నిలుస్తాం. మైనార్టీల కోసం వైయస్ జగన్ హయంలో అనేక మంచి కార్యక్రమాలు చేశాం. వైయస్ జగన్ మైనారిటీలకు ఆత్మ బంధువు లాంటి వారు` అని తెలిపారు.