ఓజీ సినిమా టికెట్ ధ‌ర‌ల‌పెంపుపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు

మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేట్‌ప‌రం చేస్తే ఊరుకోం

కూట‌మి ప్ర‌భుత్వ తీరుపై ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి ఆగ్ర‌హం

వైయ‌స్ఆర్ జిల్లా:  డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఓజీ సినిమా టికెట్ ధ‌ర‌ల పెంపుపై ఉన్న శ్రద్ధ కూట‌మి ప్ర‌భుత్వానికి రైతుల‌పై లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, క‌డ‌ప ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి త‌ప్పుప‌ట్టారు. శ‌నివారం వైయ‌స్ఆర్‌ కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వ‌హించారు. జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారులతో ఎంపీ చ‌ర్చించారు. ఈ స‌మావేశానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధ, మేయర్ సురేష్ బాబు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. అనంత‌రం వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..`ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణకు వ్య‌తిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం వైయ‌స్‌ జ‌గ‌న్‌ పిలుపు మేరకు నిర్వ‌హించిన ఛలో మెడిక‌ల్ కాలేజ్ కార్య‌క్ర‌మం అన్ని చోట్ల విజ‌య‌వంతం అయింది. పోలీసుల‌ను ప్ర‌యోగించి నిర‌స‌న కార్యక్రమాన్ని అడ్డుకోవాల‌ని చూసినా వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ శ్రేణులు, విద్యార్థులు, యువ‌త‌, ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా పెద్ద సంఖ్య‌లో మెడిక‌ల్ కాలేజీల వ‌ద్ద‌కు త‌ర‌లివ‌చ్చారు. మెడిక‌ల్ కాలేజీలు పూర్తి కాలేద‌ని కూట‌మి నాయ‌కులు  అస‌త్య ప్ర‌చారం చేస్తున్నారు. 

17 మెడిక‌ల్ కాలేజీల నిర్మాణానికి వైయ‌స్ జ‌గ‌న్ శ్రీ‌కారం
పేద‌ల‌కు ఉచితంగా నాణ్య‌మైన వైద్యం అందించాలన్న ల‌క్ష్యంతో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జిల్లాకో మెడిక‌ల్ కాలేజీ ఉండాల‌ని కొత్త‌గా 17 మెడిక‌ల్ కాలేజీల నిర్మాణానికి  శ్రీకారం చుట్టారు. కాలేజీల నిర్మాణం నిధుల కొర‌త కార‌ణంగా ఆగిపోకూడ‌ద‌న్న ఉద్దేశంతో సెంట్ర‌ల్ స్పాన్స‌ర్డ్ స్కీమ్స్‌, నాబార్డు నిధులు వ‌చ్చేలా టైఅప్ చేసుకున్నారు. పేద‌ల వైద్యం ప్ర‌భుత్వ బాధ్య‌త‌గా భావించి వైయ‌స్ జ‌గ‌న్ అంత గొప్ప‌గా ఆలోచించి ముందుచూపుతో వ్య‌వ‌హ‌రిస్తే కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక సీఎం చంద్ర‌బాబు వాటిని పీపీపీ పేరుతో ప‌ప్పు బెల్లాల‌కు త‌న వారికి క‌ట్ట‌బెట్టేందుకు సిద్దమయ్యారు.

ఎంబీబీఎస్ సీట్లు వ‌ద్ద‌ని లేఖ రాసిన నీచుడు చంద్ర‌బాబు
వైయ‌స్ జ‌గ‌న్ మీద కక్ష‌తో పులివెందుల మెడిక‌ల్ కాలేజీని మాత్రం ప్రారంభించ‌కుండా ఎన్ఎంసీ సీట్లు కేటాయించినా వ‌ద్ద‌ని లేఖ‌రాసిన నీచుడు చంద్ర‌బాబు. వీటితో పాటు రెండో ద‌శ‌లో ప్రారంభంకావాల్సిన మ‌రో 3 మెడిక‌ల్ కాలేజీలు 90 శాతం ప‌నులు పూర్తయినా, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక 15 నెల‌లుగా పెండింగ్ ప‌నులను పూర్తి చేయ‌కుండా ప‌క్క‌నపెట్టేశారు. మూడో ద‌శలో పూర్తి చేయాల్సిన కాలేజీలు సైతం పిల్ల‌ర్ల ద‌శ‌లో ఉన్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం దిగిపోయే నాటికి కూడా ప‌నుల‌న్నీ ప్ర‌ణాళిక ప్ర‌కారం శ‌ర‌వేగంగా జ‌రుగుతుండేవి. మెడిక‌ల్ కాలేజీలు పూర్త‌యితే వైయ‌స్‌ జ‌గ‌న్‌కి మంచి పేరు వ‌స్తోంద‌న్న కుట్ర‌తో ప్రారంభించ‌కుండా సేఫ్ క్లోజ‌ర్ పేరుతో మూసేసిన నీచ చ‌రిత్ర చంద్ర‌బాబుది. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ కూర్చొం. 
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంతటి పోరాటానికైనా సిద్ధం. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎరువులు, యూరియా అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం దుర్వినియోగానికి పాల్పడితే స‌హించేది లేదు` అని అవినాష్‌రెడ్డి హెచ్చ‌రించారు.

Back to Top