రాష్ట్రంలో రాజ్యాంగబ‌ద్ధ పాల‌న జ‌ర‌గ‌డం లేదు

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి ధర్మాన ప్ర‌సాద‌రావు

శ్రీ‌కాకుళం జిల్లా ఎస్సీ సెల్ విస్తృత స్థాయి స‌మావేశం

శ్రీ‌కాకుళం:  రాష్ట్రంలో ఇవాళ రాజ్యాంగ‌బ‌ద్ధంగా పాల‌న జ‌ర‌గ‌డం లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి ధర్మాన ప్ర‌సాద‌రావు ఆక్షేపించారు. పాలన అందరికీ అందాలి, సంపద అందరికీ అందాల‌నే ఉద్దేశంతో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌త ఐదేళ్లు ప‌రిపాలించార‌ని చెప్పారు. లక్ష కోట్లు ఒక రాజధానికి పెడితే మిగిలిన ప్రజలు ఏం కావాలి, మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు ఆ లక్ష కోట్లు అప్పు తీర్చే పనిలో ఉండాలా ? అంటూ ప్ర‌శ్నించారు. రాజ్యాంగంలో ఇది చెప్పలేద‌ని త‌ప్పుప‌ట్టారు. బుధ‌వారం శ్రీ‌కాకుళం జిల్లా ఎస్సీ సెల్ విస్తృత స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మాట్లాడుతూ..నాయకుడికి ప్రత్యేక బాధ్యత ఉంటుంద‌ని, మీ అందరూ నాయకులుగా ఎదగాల‌ని పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీలో క‌ష్ట‌ప‌డే ప్ర‌తి ఒక్క‌రికీ ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని చెప్పారు. క‌ష్ట‌ప‌డేతత్వం, చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తే అవ‌కాశాలు త‌ప్ప‌క వ‌స్తాయ‌న్నారు.  మీ అందరి బలంతో  వైయ‌స్ఆర్‌సీపీ తిరుగులేని  శ‌క్తిగా మారుతుంద‌ని, పార్టీలో ఆయా బాధ్యత తీసుకున్న వారు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెల‌గాల‌న్నారు.  ప్రతి పక్షంలో ఉన్నాడే సంపూర్ణ నాయకుడుగా ఎదిగే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు.

ఇది టీడీపీ ప్ర‌భుత్వం మాత్ర‌మే
రాష్ట్రంలో తెలుగు దేశం, బీజేపీ, జ‌న‌సేన పార్టీలు కూట‌మిగా ఏర్ప‌డి  అధికారంలోకి వ‌చ్చాయ‌ని, అయితే ప్ర‌స్తుతం టీడీపీ ప్ర‌భుత్వం మాత్ర‌మే అధికారాన్ని చ‌లాయిస్తుంద‌ని ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు విమ‌ర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లేద‌ని, తెలుగు దేశం ప్రభుత్వం న‌డుస్తుంద‌న్నారు. దిన దిన జరుగుతున్న పాలన లో బీజేపీ, జన సేన, పాత్ర ఏమి లేద‌న్నారు. కేవలం టీడీపీ వారు మాత్రమే కూటమి ప్రభుత్వం అంటారు, చేసిన పాపాలు ఇతర పార్టీల పై వేయాల‌నే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పారు. రెడ్‌బుక్ పేరుతో వేరోక రాజ్యాంగాన్ని రూపొందించుకొని ప్ర‌శ్నిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌ను వేధించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని ఫైర్ అయ్యారు. ఇలాంటి స‌మ‌యంలో ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, మ‌న‌కు మంచి నాయ‌కుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి రూపంలో అండ‌గా ఉన్నార‌ని భ‌రోసా క‌ల్పించారు.  వైయ‌స్ఆర్‌సీపీ సమాజంలో ఉండే అట్ట‌డగు వ‌ర్గాలు, రైతులు, కార్మికుల ప్ర‌యోజనాల కోసం ప‌ని చేస్తుంద‌ని ధ‌ర్మాన స్ప‌ష్టం చేశారు.  

చెరువుల‌ను త‌ల‌పిస్తున్న రాజ‌ధాని
అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతం చిన్న వ‌ర్షానికే చెరువుల‌ను త‌ల‌పిస్తోంద‌ని మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు విమ‌ర్శించారు. చిన్న పాటి రాజధాని చెరువు అయితే, అది కనిపించకూడద‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మీడియా ను మేనేజ్ చేస్తుంద‌ని మండిప‌డ్డారు. ఇలాంటివి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియాలంటే సోష‌ల్ మీడియా ద్వారానే సాధ్య‌మ‌న్నారు. ఈ ప్ర‌భుత్వం పెట్టే అక్ర‌మ కేసుల‌కు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, నిజాన్ని నిర్భ‌యంగా వెలికి తీయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.   స‌మావేశంలో శ్రీ‌కాకుళం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, మాజీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారం, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు, మాజీ ఎమ్మెల్యే రెడ్డిశాంతి, వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ టీజేఆర్ సుధాక‌ర్‌బాబు, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top