తాడేపల్లి: సామాజిక వికాసానికి గొప్ప ఆవిష్కరణలను అందించిన భగవాన్ విశ్వకర్మ మానవ నాగరికతను కొత్త పుంతలు తొక్కించిన చేతివృత్తుల అధిదేవుడుగా పూజలందుకుంటున్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు కొనియాడారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో భగవాన్ విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటం వద్ద సంప్రదాయసిద్దంగా భక్తిశ్రద్దలతో పూజాధికాలు నిర్వహించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ లోకానికే వృత్తుల రూపంలో జ్ఞానాన్ని అందించిన మహనీయుడు విశ్వకర్మను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏం మాట్లాడారంటే... విద్యతోనే చేతివృత్తుల కులాల్లో పేదరిక నిర్మూలన : మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విశ్వకర్మ అంశతో చేతివృత్తుల ద్వారా సామాజిక నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఈ సమాజానికి ఆధునిక నాగరికతను చేతివృత్తి కళాకారులు అందించారు. నేడు ప్రతిదానిలోనూ యాంత్రీకరణ రావడం వల్ల చేతివృత్తులు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. చేతివృత్తులపైనే ఆధారపడిన వారి ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. పేదరికంలోకి వెళ్ళిపోతున్న చేతివృత్తులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన నాయకుడుగా వైయస్ జగన్ తన పాలనలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. చదువు ద్వారానే చేతివృత్తుల కులాల్లోని యువత భవిష్యత్తు మారుతుందని ఫీజురీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు తీసుకువచ్చారు. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఇవ్వకుండా, చదువుకునే విద్యార్ధులను తిరిగి అంథకారంలోకి నెట్టేస్తోంది. పేదరికం నుంచి మంచి భవిష్యత్తువైపు వెళ్ళే యువతకు కూటమి ప్రభుత్వ విధానాలు మళ్ళీ చీకటి రోజుల్లోకి వెళ్ళేలా చేస్తున్నాయి. ఫీజులు చెల్లించాలంటూ పేద విద్యార్ధులను కాలేజీ యాజమాన్యాలు వేధించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పేద విద్యార్ధుల కోసం వైయస్ జగన్ ప్రభుత్వం పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువస్తే, వాటిని కూడా ప్రైవేటువారికి తెగనమ్ముకునేందుకు చంద్రబాబు సిద్దమవ్వడం దుర్మార్గం. విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్ ద్వారా చేయూత: ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సమస్త హస్తకళలకు అధిదేవత, విశ్వరూపశిల్పి, విశ్వకర్మ. భగవంతుడి స్వరూపంగా విశ్వకర్మ జయంతిని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరం. బీసీలు అంటే బ్యాక్‌వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్‌బోన్ కాస్ట్ అని నమ్మిన నాయకుడు వైయస్ జగన్. అందుకే 130 కులాలకు గానూ 56 కార్పోరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత వైయస్ జగన్ గారికే దక్కుతుంది. విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసి, తోడ్పాటును అందించారు. మొట్టమొదటి సారిగా విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించిన ఘనత కూడా వైయస్ జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది. సామాజిక వ్యవస్థలో నిర్మాణ రంగానికి ఆధ్యుడు విశ్వకర్మ. చంద్రబాబు హయాంలో బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాడు. బీసీలకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు. వైయస్ జగన్ హయాంలో మాత్రమే బీసీలకు సరైన గౌరవం లభించింది. రాబోయే రోజుల్లో ఆయన వెంట బీసీ కులాలు నిలబడతాయి. వైయస్ జగన్ ప్రభుత్వంలో విశ్వబ్రాహ్మణ కులాలకు రూ.142 కోట్లు లబ్ధి: విశ్వబ్రాహ్మణ సాధికారిత కమిటీ చైర్మన్ పవిత్ర మాజీ సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నాం. విశ్వకర్మ జయంతి అనేది మొత్తం సమాజం ఒక పండుగలా నిర్వహించుకోవాలి. సృష్టికి ప్రతిసృష్టిని తీసుకువచ్చి, ప్రజల జీవనశైలిలో అద్భుతమైన మార్పులకు భగవాన్ విశ్వకర్మ శ్రీకారం చుట్టారు. ఆనాడు దేవతలకే అపురూపమైన నిర్మాణాలను అందించారు. విశ్వకర్మ నుంచి అయిదుగురు బ్రహ్మలను సృష్టించారు. ఆయా వృత్తులకు వారు అధిదేవతలుగా సమాజానికి ఎనలేని సేవలను అందించారు, గొప్ప జ్ఞానాన్ని పంచారు. ఏపీలోని విశ్వబ్రాహ్మణ కులాలకు వైయస్ జగన్ గారి ప్రభుత్వం వల్ల దాదాపు రూ.142 కోట్లు లబ్ధి చేకూరింది. పంచవృత్తులను అనుసరిస్తున్న బీసీ కులాలకు ప్రభుత్వ పథకాలను అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. విశ్వబ్రాహ్మణులకు అండగా నిలిచిన వైయస్ జగన్ : విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్ మాజీ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ విశ్వబ్రాహ్మణులున గుర్తించిన నాయకుడు వైయస్ జగన్. మొట్టమొదటిసారి విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్‌ను ఆనాడు స్వర్గీయ వైయస్ఆర్ ఏర్పాటు చేశారు. తండ్రిని మించి తనయుడు వైయస్ జగన్ విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా పంచవృత్తుల వారి అభ్యున్నతికి తోడ్పాటును అందించారు. విశ్వకర్మ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేలా ఆనాడు సీఎంగా వైయస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలకు కూడా దూపదీప నైవేద్యాల కింద ఇచ్చే సాయాన్ని వర్తింప చేశారు. వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి విజయవాడ నుంచి బస్సు సదుపాయం కూడా కల్పించారు. పుష్కరాల సదర్బంగా 2016లో చంద్రబాబు ప్రభుత్వం విశ్వబ్రాహ్మణ సామాజిక భవనంను దుర్మార్గంగా కూల్చివేసింది. వైయస్ జగన్ గారు సీఎం అయిన తరువాత విజయవాడ నడిబొడ్డున కర్మలు, సామాజికభవనాల నిర్మాణానికి స్థలం ఇచ్చిన ఘనత కూడా వైయస్ జగన్ గారికే దక్కుతుంది. ఈ కార్యక్రమంలో గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, వైయస్ఆర్‌సీపీ విద్యార్ధి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, విశ్వ బ్రాహ్మణ సాధికారిత కమిటీ నేతలు సుబ్రహ్మణ్యం, రజినీ, ఉదయ్ కుమార్, రామారావు, శ్రీమంతుల రామయ్యాచారి, ఇతర విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు.