ఎన్టీఆర్ జిల్లా: ప్రశ్నిస్తే అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వం మరో చర్యకు దిగింది. బూడిద మాఫియాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ని అరెస్ట్ చేయించింది. దీంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టీడీపీ నేతల అక్రమ బూడిద రవాణాను అడ్డుకునేందుకు జోగి రమేష్ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో.. బుధవారం మూలపాడులో బూడిద డంప్‌ను పరిశీలించేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగింది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో భారీగా పోలీసులు మోహరింపజేసింది. 144 సెక్షన్ అమలు వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మూలపాడుకు వెళ్లకుండా జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్ అమల్లోకి తెచ్చిన పోలీసులు.. అటువైపుగా గుంపులుగా వెళ్లేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు.. తమను అనుమతించాలంటూ పోలీసుల కాళ్లు మొక్కుతూ నిరసనలు తెలియజేశారు. ఈ పరిణామాలతో జోగి రమేష్ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. ఆందోళనకు సిద్ధమైన జోగి రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జోగి రమేష్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు బూడిద రవాణా ద్వారా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అక్రమార్జన చేశారన్నది జోగి రమేష్ చెబుతోంది. అంతేకాదు అక్రమ బూడిద నిల్వలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే.. జోగి రమేష్ వ్యాఖ్యలపై వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. జోగి రమేష్ ఇల్లు నేలమట్టం చేస్తా అంటూ అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఉధృక్తత నెలకొంది.