తాడేపల్లి: వెన్నుపోటుదారుడు, అవినీతిపరుడైన చంద్రబాబుతో గొంతు కలిపి వైయస్ జగన్ పాలన గురించి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విమర్శలు చేయడంతోపాటు చంద్రబాబుని ఆదర్శవంతుడిగా కీర్తించడం దారుణమని వైయస్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ వైయస్ జగన్ పాలన గురించి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలను పునఃసమీక్షించుకుని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గురించి ప్రజాస్వామ్య విధ్వంసకారుడు అనే పుస్తకం రాస్తే బాగా డిమాండ్ ఉంటుందని పుస్తక రచయిత జనార్దన్‌కి సూచించారు. వాటిలో చంద్రబాబు వెన్నుపోటు గురించి, వైస్రాయ్ హోటల్ సంఘటనలు, పార్టీని లాక్కున్న విధానాల గురించి రాయాలని, అవసరమైతే తన వద్దనున్న సమాచారం ఇస్తానని అన్నారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. చంద్రబాబు వెన్నుపోటు గురించి కూడా రాయాల్సింది ప్రజాస్వామ్య పరిరక్షకుడు ఎన్టీఆర్ పేరుతో పుస్తకం అచ్చేసినట్టే ప్రజాస్వామ్య విధ్వంసకారుడు చంద్రబాబు అనే పేరుతోనూ పుస్తకం రాస్తే ఇప్పటితరాలకు చంద్రబాబు గురించి మరింత ఎక్కువగా తెలుసుకునే వీలు కలుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఎంతగా పరిహాసం చేశాడో 1995లోనే ఎన్టీఆర్ ప్రపంచానికి చెప్పాడు. పుస్తక రచయిత జనార్దన్‌కు నిజంగా ఎన్టీఆర్ గారి మీద అంత ప్రేమాభిమానాలు ఉంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీఆర్‌ని ఎన్ని కుట్రలు చేసి చంద్రబాబు పదవీచ్యుతుడ్ని చేసి పార్టీని, ముఖ్యమంత్రి కుర్చీని లాక్కున్నారో స్పష్టంగా రాస్తే ఆ పుస్తకానికి ఈరోజుల్లో మంచి డిమాండ్ వస్తుంది. వైస్రాయ్ హోటల్ సంఘటన, ఎన్టీఆర్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన విధానం, ఎన్టీఆర్ ఆస్తులను కాజేసిన విధానం.. వీటన్నింటి గురించి చరిత్రలో స్పష్టమైన ఆధారాలున్నాయి. స్వయంగా ఎన్టీఆర్ అనేక వీడియోల్లో చంద్రబాబు అరాచకాలు, అన్యాయాల గురించి చెప్పిన ఆధారాలున్నాయి. వాటన్నింటినీ సేరించి పుస్తక రూపంలో రాస్తే నేటి తరానికి చంద్రబాబు నిజస్వరూపం తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి పదవిని, పార్టీ లాక్కున్న చంద్రబాబు ఓట్ల కోసం మాత్రం అవసరమొచ్చినప్పుడల్లా ఆయనకు వీరభక్తుడిలా నటిస్తుంటాడు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్నానని చంద్రబాబు చెప్పడం కన్నా దారుణం ఇంకోటి ఉండదు. ఎన్టీఆర్ గురించి నీచంగా వార్తలు రాయించాడు చంద్రబాబు మీద ఎన్టీఆర్ తిరగబడ్డాడన్న అక్కసుతో మీడియాను అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్ గురించి నీచమైన రాతలు రాయించాడు. ఈనాడు ద్వారా ఎన్టీఆర్ స్త్రీ లోలుడని, ఆయనకు నీతి లేదని విష ప్రచారం చేయించడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ తో అవసరం లేదని చంద్రబాబు ప్రకటించుకున్నాడు. ఎన్టీఆర్ తప్పులు చేశాడంటూ పుస్తకాలు అచ్చేయించిన నీచుడు చంద్రబాబు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వెంకయ్య నాయుడు, గడిచిన ఐదేళ్ల వైయస్ జగన్ పాలన గురించి విధ్వంసం జరిగిందంటూ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడటం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన తనమాటలను పునఃపరిశీలన చేసుకుని, వెనక్కి తీసుకోవాలి. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో చేతులు కలిపి వైయస్ జగన్‌ని విమర్శించడం వెంకయ్యనాయుడు నిజాయితీనే ప్రశ్నించేలా ఉంది. ఇదే వెంకయ్యనాయుడు గతంలో వైయస్ జగన్ పరిపాలనను పొగిడిన విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. ఎన్టీఆర్ ప్రజాస్వామ్య పరిరక్షుడని కీర్తిస్తున్న వెంకయ్యనాయుడు, 1995లో వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నప్పుడు చంద్రబాబు పక్కన ఎందుకు నిలబడ్డారు? అద్వానీ కనీసం ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి మాట్లాడినా వెంకయ్యనాయుడు మాత్రం పరామర్శించడానికి కూడా రాలేదు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిని పూర్తి చేసి చూపించాలని చంద్రబాబుకి వెంకయ్య నాయుడు చురకలంటించడం మాత్రం మెచ్చుకోదగ్గ విషయం. ఎన్టీఆర్‌కి భారతరత్న రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే తన ఐదేళ్ల పాలనతో విద్య, వైద్య రంగంలో వైయస్ జగన్ గారు రాష్ట్రంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. కరోనాతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉన్నా ఒక వైపు సంక్షేమం ఇంకోవైపు అభివృద్ధిని చేసిచూపించిన విజనరీ వైయస్ జగన్. పేద ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఆయన 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే వాటిని ప్రైవేటుపరం చేసిన చంద్రబాబుని వెంకయ్యనాయుడు ఆదర్శవంతుడిగా కీర్తించడం బాధాకరం. నాడు-నేడు ద్వారా విద్యాసంస్కరణలు తీసుకొచ్చి బడుల రూపురేఖలు మార్చిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుంది. కూటమి పాలనలో రైతులకు కనీసం యూరియా బస్తా కూడా దొరకని పరిస్థితులున్నాయి. చంద్రబాబు లాంటి అవినీతి పరుడు, వెన్నుపోటుదారుడిని దేశానికి ఆదర్శవంతుడని వెంకయ్య నాయుడు కీర్తించడాన్ని ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్టీఆర్ కి భారతరత్న ఇప్పించే పేరుతో చంద్రబాబు ఇప్పటికీ రాజకీయం చేస్తూనే ఉంటాడు. గతంలో వాజ్‌పేయి, దేవేగౌడ ప్రధానులుగా ఉన్నప్పుడు ఎన్టీఆర్‌కి భారతరత్నఇస్తామని చెప్పినప్పుడు చంద్రబాబే అడ్డుపడ్డాడు. మోడీ ఇస్తామని చెబుతున్నా చంద్రబాబు, ఆయన కుటుంబం ఒప్పుకోవడం లేదు. నేను బతికున్నంత వరకు ఎన్టీఆర్ మీద నిందలేసినా, ఆయన విషయంలో చంద్రబాబుని కీర్తించినా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. చేతనైతే వాస్తవాలతో ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాయాలి. దానికి కావాలంటే నా సహాయం ఎప్పుడూ ఉంటుంది. 2019 కి ముందు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు తెలుగుకి ప్రాచీన భాషా కేంద్రాన్ని తెచ్చుకోలేకపోతే, వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకనే బెంగళూరు నుంచి నెల్లూరుకి ప్రాచీన భాషా కేంద్రాన్ని తరలించి ఐదెకరాల్లో పెద్ద భవనాన్ని కూడా నిర్మించారు.