విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల విశిష్టతకు భంగం కలిగించేలా అధికార తెలుగుదేశం నేతలు వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణులు మాట్లాడుతూ నవరాత్రి అమ్మవారి ఉత్సవాల ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసేలా తెలుగుదేశం ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ పేరుతో కమర్షియల్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనుకునే ఆలోచనలను తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గొడుగుపేట వెంకటేశ్వరస్వామి ఆలయ భూముల్లో భారీగా ఏర్పాటు చేస్తున్న ఈ ఉత్సవ్ ముసుగులో టీడీపీ నేతలు తమ దోపిడీకి రంగం సిద్దం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా పేరు చెబితే గుర్తుకు వచ్చే అమ్మవారి ఉత్సవాలకు పోటీగా అన్ని హంగులతో, వినోదం, అహ్లాదం అంటూ ఏర్పాటు చేస్తున్న ఈ ఉత్సవ్ వెనుక కోట్లాధి రూపాయల అవినీతి దాగి ఉందని ధ్వజమెత్తారు. ఇంకా వారేమన్నారంటే... వేలం ద్వారా కొన్న భూములపై బురదచల్లుతున్నారు : కృష్ణా జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) నాపైన ఆలయ భూములను కాజేశానంటూ తప్పుడు ఆరోపణలు చేశాడు. తన అవినీతి బాగోతాలను బయటపెడుతుంటే తట్టుకోలేక, వాటికి సమాధానం చెప్పుకునే సత్తా లేక ఎంపీ కేశినేని చిన్ని తానేదో బెస్ట్ పార్లమెంటేరియన్ అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అలాగే జిల్లాకు చెందిన వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద కూడా ఇష్టం వచ్చినట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. విజయవాడ ఎంపీ సీటుకి ప్రత్యేక గౌరవం ఉంది. ఆ సీటులో కూర్చున్న కేశినేని చిన్ని అబద్ధాలు, పిచ్చి వాగుడు, అవినీతి కార్యక్రమాలతో కళంకం తీసుకొస్తున్నాడు. ఎంపీ పదవి అనేది దోచుకుని దాచుకోవడం కోసమే అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. వైయస్ఆర్‌సీపీగురించి ఆలోచించే సమయంలో సగం సమయమైనా విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ప్రజా సమస్యల గురించి ఆలోచించడం లేదు. కమీషన్లు పుచ్చుకోవడం, దోచుకున్న డబ్బును హైదరాబాద్ కి తరలించే అలవాటున్న ఈ పెద్ద మనిషి కళ్లకి అందరూ అలాంటి వారిలాగే కనిపిస్తున్నారనుకుంటా. మార్చి 29, 2007లో 5.30 ఎకరాల భూమికి దేవాదాయశాఖ వేలం నిర్వహిస్తే, అందులో 135 మంది రూ.2 లక్షల డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొన్నారు. ఈ వేలంలో సగం టీడీపీ వారే పాల్గొన్నారు. లిస్టులో 30వ పేరు మంత్రి కొల్లు రవీంద్రకి ఆప్తుడు పల్లపాటి సుబ్రహ్మణ్యం ఉన్నాడు. ఈ విధంగా బహిరంగ వేలం నిర్వహించిన ఈ భూమిని నేను ఎలా దోచుకున్నానో ఎంపీ చిన్ని సమాధానం చెప్పాలి. ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి దిగజారిపోయి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లాగా మాట్లాడుతున్నాడు. ఎంపీ కేశినేని చిన్నికి దమ్ముంటే లోకేష్‌కి చెప్పి ఈ భూములపై విచారణ జరిపించి, ఈ దేవాదాయశాఖ భూములను నేను బహిరంగ వేలంలో కాకుండా అక్రమంగా కాజేసినట్టు నిరూపించాలని సవాల్ విసురుతున్నా. నేను రేషన్ బియ్యం అక్రమంగా తరలించానని కేశినేని చిన్ని నాపై చేస్తున్న మరో ఆరోపణ. నా దగ్గర పనిచేసిన వ్యక్తే తప్పు చేశాడని గతంలో దానికి వివరణ ఇచ్చాను. అధికారుల సూచన మేరకు అందుకు పెనాల్టీ కూడా చెల్లించడం జరిగింది. స్టోరేజ్ ఖర్చుతో కూడా కలిపి రూ. 45 ఉంటే, కేజీ రేషన్ బియ్యం రూ.90 లు చెల్లించా. దీనికి సంబంధించి నాపై కేసులు పెట్టి అరెస్టు చేసుకోవచ్చు. కుదిరితే యావజ్జీవ శిక్ష వేసినా స్వీకరించడానికి నేను సిద్ధమే. వ్యర్థ వాదనలు కట్టిపెట్టి నేను తప్పు చేసినట్టు ఆధారాలతో నిరూపించమని సవాల్ చేస్తున్నా. ఆకాశమే హద్దుగా ఎంపీ కేశినేని చిన్ని దోపిడీ విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బియ్యం రవాణా మాఫియా నడిపేది ఎంపీ కేశినేని చిన్నినే అని ఆ పార్టీ ఎమ్మెల్యే చెబుతున్నారు. పెద్దిరెడ్డి అనే వ్యక్తిని మేనేజర్ గా పెట్టుకుని ఎంపీ కార్యాలయం నుంచే వ్యవహారాలన్నీ నడిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ప్రతినెలా రూ. కోటిన్నర తెచ్చి ఎంపీ చేతుల్లో పెడుతుంటే దాన్ని కేశినేని చిన్ని హైదరాబాద్‌కి తరలిస్తున్నాడు. బియ్యం అక్రమ రవాణా మాఫియాను టీడీపీ నాయకులే నడిపిస్తూ వైయస్ఆర్‌సీపీ మీద నిందలు మోపుతున్నారు. ఎంపీ ఫోటోతో రోజూ వందలాది ఇసుక టిప్పర్లు ఖమ్మం తరలిపోతున్నాయి. మా పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేతో బూడిదలో వాటా మాట్లాడుకున్నాడు. కృష్ణమ్మ, మునేరు, కట్టలేరు, బూడిద, ఇసుక.. దేన్నీ వదలకుండా విజయవాడ పార్లమెంట్ ని దోచుకుంటున్నాడు. నందిగామలో ఐదు రీచ్‌లు మూసేసి రెండింటిలోనే విచ్చలవిడిగా ఇసుక తోడేస్తున్నారు. ఒక్క నందిగామ నియోజకవర్గం నుంచే రోజూ వందలాది లారీ హైదరాబాద్‌కి తరలిస్తున్నారు. అక్కడ సాయి అనే వ్యక్తి ద్వారా ఇసుక దోపిడీ చేస్తున్నాడు. ఎంపీకి చెందిన 6 ఇసుక లారీలను చిల్లకల్లు ఎస్‌ఐ అడ్డుకున్నందుకు ట్రాన్స్‌ఫర్ చేయిద్దామని చూశాడు. కంచికచర్లలో కొండంత ఎత్తున ఇసుకను డంప్ చేశారు. దాన్ని అధికారులంతా చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. ఏడు నియోజకవర్గాల పరిధిలో ఇసుక, మట్టి, గ్రావెల్, బూడిద.. దేన్నీ వదలకుండా చెరబట్టేశాడు. తన అవినీతికి ఎదురులేకుండా పోవడంతో ఎంపీకి కళ్లు నెత్తికెక్కాయి. పట్టాభిని అడ్డం పెట్టుకుని విజయవాడ పరిధిలో గొడుగుపేట వేంకటేశ్వరస్వామికి చెందిన 40 ఎకరాల భూములు కాజేసేందుకు కన్నేశాడు. వేలం పాట ద్వారా మాత్రమే దేవుడి భూములు విక్రయించాలి తప్పితే, నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు, ఎండోమెంట్ చట్టంలో స్పష్టంగా చెప్పినా దాన్ని కాలరాశారు. పనులు ఆపాలని హైకోర్టు చెప్పినా వినకుండా విజయవాడ ఉత్సవ్ పేరుతో ఆ భూముల్లో మట్టి ఇసుక గ్రావెల తరలించి చదును చేశారు. ఇప్పటికీ నిర్విఘ్నంగా ఉత్సవ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ ధైర్యంతో కోర్టు తీర్పును సైతం ఉల్లంఘిస్తున్నారో ఎంపీ చెప్పాలి. ఎంపీ కేశినేని చిన్ని చేస్తున్న అరాచకాలకు రాబోయే ఎన్నికల్లో సీటు రాకుండా ఆ పార్టీ ఎంపీలే ఖచ్చితంగా అడ్డుకోవడం తథ్యం. చందాల కోసం వ్యాపారులను బెదిరిస్తున్నారు: ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాశ్ గొడుగుపేట వేంకటేశ్వర స్వామి ఆలయ భూముల కబ్జాకి సంబంధించి తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఎంపీ కేశినేని చిన్ని చెబుతున్నాడు. కానీ ఇదే 40 ఎకరాల భూమిని కోర్టు తీర్పుకి విరుద్దంగా చదును చేసి సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ అనే సొసైటీ విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహిస్తోంది. దీనికి ఎంపీ కేశినేని చిన్ని ప్రెసిడెంట్‌గా ఉంటే, పట్టాభి సెక్రటరీగా ఉన్నాడు. కబ్జా చేయాలని ఆలోచన లేకపోతే ముందుగానే మట్టి తరలించి చదును చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలి. విజయవాడ ఉత్సవ్ కోసం మురళీ ఫార్చ్యూన్‌లో ఇప్పటి వరకు పది మీటింగ్‌లు పెట్టి సినీ తారల్ని పిలిపించి భారీగా కార్యక్రమంతో ప్రారంభోత్సవం చేసిన టీడీపీ నాయకులు, అమ్మవారి ఉత్సవాల నిర్వహణ గురించి పట్టించుకోలేదు. దీనిపై వైయస్ఆర్‌సీపీ ఆరోపణలు చేస్తే ఇన్నాళ్ల తర్వాత నిన్ననే ఒకే ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టారు. ఇదీ, అమ్మవారి ఉత్సవాల నిర్వహణ మీద వారికున్న చిత్తశుద్ధి. విజయవాడకి ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఎంపీగా పనిచేస్తే కేశినేని చిన్ని మాత్రం దానికి కళంకం తెచ్చేలా అవినీతికి అడ్డాగా మార్చేశాడు. చిన్నికి ప్రజల మీద కన్నా డబ్బుల మీదనే ప్రేమ. ఏ పనిచేయాలన్నా డబ్బు ఇవ్వాల్సిందే. పిన్నమనేని ఫార్మసీ కాలేజీలో ఏటా దసరాకి దేవీ శరన్నవరాత్రులు జరుగుతుంటే ఈ ఏడాది పెట్టొద్దని ఎంపీ ఫోన్ చేసి బెదిరించాడు. వారికి స్పాన్సర్ చేసే వాళ్లంతా విజయవాడ ఉత్సవ్‌కి విరాళాలివ్వాలని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఫార్మసీ అసోసియేషన్ ని పిలిపించి ఉత్సవాలకు రూ.2 కోట్లు ఇవ్వాలని ఎంపీతో కలిసి పట్టాభి బెదిరించాడు. ప్రతి అసోసియేషన్ కి ఫోన్లు చేసి బెదిరించి ఉత్సవాలకు డబ్బులివ్వాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. ఉత్సవాల పేరుతో దోచుకోవాలని ఎంపీ కేశినేని చిన్ని భారీ స్కెచ్ వేశాడు. ఎంపీ కేశినేని చిన్ని చేసే పనుల కారణంగా విజయవాడ పరువు పోయింది. వ్యాపారవేత్తలంతా ఎంపీ పేరెత్తితే భయపడిపోతున్నారు. కుటుంబంతో కలిసి నేను దుబాయ్ వెళ్తుంటే, పోలీసులు పర్మిషన్ లేదని చెప్పడంతో తిరిగొచ్చేశాను. దానికే నేను కేసులకు భయపడి పారిపోతున్నానని ఎంపీ ప్రచారం చేసుకోవడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. రెడ్ బుక్ రాజ్యాంగంతో కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు అవినాశ్ భయపడి పారిపోయేరకం కాదని గుర్తుంచుకోవాలి. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఎంపీ కేశినేని చేసిన అక్రమాలన్నీ వెలికితీసి ఎక్కడున్నా తీసుకచ్చి కోర్టుల్లో శిక్షలు పడేదాకా పోరాడతాం. ఒక్కో స్టాల్ కి రూ.3 లక్షలు వసూలు చేస్తున్నారు: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ విజయవాడ ఉత్సవ్ పేరుతో విజయవాడ సిటీకి దేశ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తానని ఎంపీ కేశినేని చిన్ని చెప్పడం చూసి నగర ప్రజలంతా చీదరించుకుంటున్నారు. నువ్వు ఉత్సవాల పేరుతో విజయవాడ పరువు తీయకుండా ఉంటే చాలని ఎంపీకి ప్రజలు చీవాట్లు పెడుతున్నారు. విజయవాడ బ్రాండ్ ఇమేజ్‌ని ఎంపీ దెబ్బతీస్తున్నాడని నగర ప్రజలే చెబుతున్నారు. ఏ చిన్న పండగొచ్చిన ఉత్సవాల పేరుతో నగరంలోని వ్యాపారస్తులను వేధించడం ఎంపీకి పరిపాటిగామారింది. ఆయన పేరు చెప్పుకుని ఆయన అనుచరులు గల్లీగల్లీకి వెళ్లి వ్యాపారుల్ని చందాలు ఇవ్వాలని, డబ్బులివ్వకపోతే వ్యాపారం సాగినవ్వమని బెదిరిస్తున్నారు. 40 ఎకరాల దేవాదాయ శాఖ భూమిలో నిర్వహించే విజయవాడ ఉత్సవ్ లో పది చదరపు అడుగుల సైజులో ఉండే స్టాల్ ఏర్పాటు చేసుకోవడానికి 10 రోజులకు రూ.3 లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన 40 ఎకరాల్లో స్టాళ్లు ఏర్పాటు చేసుకుని విజయవాడ ఉత్సవ్ పేరుతో వందల కోట్లు దోచుకోవాలని ప్లాన్ చేశారు. ప్రభుత్వానికి మాత్రం 40 ఎకరాలకు రూ.40 లక్షలు ఇచ్చామని ఘనంగా చెప్పుకోవడం సిగ్గుచేటు. దేవుడి స్థలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వాడుకుంటున్నారు. విజయవాడకి ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చిన దుర్గమ్మ ఉత్సవాల నిర్వహణను మాత్రం ఈ టీడీపీ నాయకులు అస్సలు పట్టించుకోవడం లేదు. వైయస్ఆర్‌సీపీ అడ్డుకుని ఉండకపోతే 40 ఎకరాల వేంకటేశ్వర స్వామి భూమిని ఈపాటికే కొట్టేసేవారే. టీడీపీ అరాచకాలను వైయస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేని స్థితిలో మాపై వ్యక్తిత్వహననం చేసేలా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతున్నాడు. 15 నెలల్లోనే చిన్ని అరాచకాలకు వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. దుర్గమ్మ ఉత్సవాల పవిత్రతను దెబ్బతీసేలా పోటీగా ఉత్సవాలా? : మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడలో అమ్మవారి నవరాత్రులు జరుగుతున్న తరుణంలో దానికి ఏర్పాట్లు చేయకుండా భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్ల గురించి రివ్యూ చేయకుండా గాలికొదిలేసి, ప్రత్యామ్మాయంగా విజయవాడ ఉత్సవ్ పేరుతో సినీతారలను పిలిపించి 40 ఎకరాల ఆలయ భూముల్లో స్టాల్స్ ఏర్పాటు చేసి దోపిడీకి తెరదీయడాన్ని వైయస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తోంది. దానికి సమాధానం చెప్పుకోలేక వైయస్ఆర్‌సీపీ నాయకుల వ్యక్తిత్వ హననం చేసేలా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతున్నాడు. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి, విజయవాడ కీర్తికిరీటంగా ఉన్న అమ్మవారి ఉత్సవాలపై చిన్నచూపు తగదని హెచ్చరిస్తున్నాం. వైబ్రంట్ విజయవాడ అనే సంస్థను ఏర్పాటు చేసుకుని విజయవాడ ఉత్సవ్ కార్యక్రమ నిర్వహణకు చందాలు ఇవ్వాలని ఎంపీ అనుచరులు వ్యాపారులను బెదిరిస్తున్నారు. నెలకో ఉత్సవం పేరు చెప్పి కేశినేని చిన్ని చేస్తున్న అరాచకాలకు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నామని వ్యాపారస్తులు వాపోతున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడతామని అధికారంలోకి వచ్చి ఆలయ భూములను చదును చేసి సినీ తారలను పిలిపించి కమర్షియల్ కార్యక్రమాలు నిర్వహించడం సిగ్గుచేటు. అమ్మవారి ఉత్సవాలు జరిగే సమయంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందించే కార్యక్రమాలు చేయకపోగా మరింత దిగజార్చేలా ఎంపీ వ్యవహరిస్తున్నారు. ఎంపీ కేశినేని చిన్ని కోరుకున్నట్టు విజయవాడలో వైయస్ఆర్‌సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు వైయస్ఆర్‌సీపీ సిద్ధంగా ఉంది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయం తిరుపతి నుంచి విజయవాడ దుర్గమ్మ ఆలయం వరకు చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాదాయ ధర్మాదాయ శాఖను ఒక వర్గానికి కానుకగా ఇచ్చారేమో అనిపిస్తుంది. ఇప్పటికైనా విజయవాడ ఉత్సవ్ పేరుతో నిర్వహించే ఉత్సవాలను వాయిదా వేసుకోవాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది.