ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలా?

సమయం సందర్భం లేకుండా యథేచ్ఛగా మద్యం అమ్మకాలు 

ఎక్కడబడితే అక్కడ తప్పతాగుతుంటే చర్యలు ఎక్కడ?

చివరకు మద్యం మత్తులో పోలీసులపై కూడా దాడులు 

తెలుగుదేశం ప్రభుత్వ తీరును ఎండగట్టిన మాజీ ఎంపీ భరత్ 

రాజమహేంద్రవరం : మద్యం పాలసీ గురించి గొప్పలు చెప్పుకునే కూటమి ప్రభుత్వంలో ఎమ్మార్పీ ధరలకంటే పెంచి మద్యం విక్రయాలు చేయడం దారుణమని మాజీ ఎంపీ, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ విమర్శించారు. ఈవిషయంలో జనం నుంచి వస్తున్న ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎం ఆర్పీ ధరల కంటే రూ.10 పెంచి అమ్మడం మొదలు పెట్టినట్లు జనం వాపోతున్నారని పేర్కొన్నారు. మరి చంద్రబాబు ప్రభుత్వం ఏమిచేస్తున్నట్టని ఆయన నిలదీశారు. ఇప్పటికే ఒక సమయం సందర్బం లేకుండా యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని, మద్యం షాపుల లోనే కాకుండా చుట్టూ పక్కల మందుబాబులు తప్పతాగి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నా ఏమాత్రం చర్యలు లేవని భరత్ వాపోయారు. 
 
చివరకు యువకులు తప్పతాగి, నగర నడిబొడ్డున  పోలీసులపైనే దాడులకు దిగడం కూడా ఇటీవల చూశామని భరత్  ప్రస్తావించారు.  తప్పతాగిన యువకులు సృష్టించిన భీభత్సానికి జనం విస్తుపోయారన్నారు. చారిత్రాత్మక రాజమహేంద్రవరంలో కూటమి మంచి పాలన అంటే ఇదేనా అని భరత్ ప్రశ్నించారు. ఇది వైఫల్యం కాదా అని పేర్కొన్నారు.  వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో రాత్రి 8 గంటలు దాటితే మద్యం షాపులు మూతపడేవని, ఇప్పుడు ఎప్పుడు పడితే అమ్మేస్తున్నారని, దీంతో మందుబాబులు కూడా ఎక్కడ బడితే తాగుతున్నారని భరత్ పేర్కొన్నారు. ఈవిషయమై మీడియా ప్రతినిధులే పోలీసుల దగ్గర ప్రస్తావించారని ఆయన గుర్తుచేశారు. బెల్ట్ షాపులు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

Back to Top