తాడేపల్లి: పోలీసులకు చట్టం, కోర్టులంటే లెక్క లేకుండాపోయిందని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై సోషల్ మీడియా వేదికగా జనం గళం విప్పుతున్నారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయటానికే సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ నిర్బంధాలు విధిస్తున్నారని ఆక్షేపించారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమ కేసులతో భయపెడుతున్నారని ధ్వజమెత్తారు. బుధవారం మనోహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..` సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి అనే యువకుడిని తాడేపల్లి వద్ద పోలీసులు అక్రమంగా ఎత్తుకెళ్లారు. దీనిపై అతని భార్య హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. హైకోర్టుకు కూడా పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చారు. అతనిపై గంజాయి కేసు పెట్టటాన్ని హైకోర్టు సీరియస్ అయింది. తాడేపల్లి పీఎస్‌లో సవీంద్ర భార్య ఇచ్చిన ఫిర్యాదును కూడా పట్టించుకోలేదు. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు విచారణకు ఆదేశించింది. కోర్టు పోలీసు చర్యలను తప్పుపడుతున్నా..వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఇవాళ గుంటూరు శివారులో మరో సోషల్ మీడియా యాక్టివిస్ట్ తారక్ అనే యువకుడిని కూడా పోలీసులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై గుంటూరులో తారక్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదు. రాప్తాడు పీఎస్ లో సాయిభార్గవ్ అనే మరో సోషల్ మీడియా కార్యకర్తని నిర్బంధించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసులు పాటించటం లేదు. ఇలాంటి పరిస్థితులు సమాజానికి మంచిది కాదు. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తితే పోలీసులు భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. అక్రమ అరెస్టులు చేసి గంజాయి కేసులు పెడుతున్నారు. ఈ పరిస్థితులు మారకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. విలేకర్లు, న్యాయవాదుల మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. వీటన్నిటిపై న్యాయ పోరాటం చేస్తాం` అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.