తిరుప‌తిలో `ఛ‌లో మెడికల్ కాలేజ్` పోస్టర్ ఆవిష్క‌ర‌ణ‌

తిరుప‌తి:  ప్ర‌భుత్వ  మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేట్‌ప‌రం చేయాల‌న్న కూట‌మి ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ ఈ నెల 19న త‌ల‌పెట్టిన ఛ‌లో మెడిక‌ల్ కాలేజ్ కార్య‌క్ర‌మం పోస్ట‌ర్‌ను గురువారం తిరుప‌తి న‌గ‌రంలో ఆవిష్క‌రించారు. వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, తిరుపతి సమన్వయకర్త  భూమన అభినయ్ రెడ్డి పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో పేద విద్యార్ధులకు మెడికల్‌ సీట్లు రావాలని, పేద రోగులకు సకాలంలో వైద్యసేవలు అందాలని రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్‌ కళాశాలలకు అప్పటి ముఖ్యమంత్రి వై.య‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి భూమిపూజ చేసి భవనాలు నిర్మించార‌న్నారు. 2023 ఏడాదిలో ఆరు మెడికల్‌ కళాశాలల్లో మెడికల్‌ విద్యార్దులు విద్యను అభ్యసిస్తుంటే, కూటమి పాలనలో మెడికల్‌ కళాశాలలను పీపీపీ పద్ధతిలో కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించాలని చూస్తోందని ధ్వ‌జ‌మెత్తారు.  దీనిని నిరసిస్తూ ఈనెల 19న  మెడికల్‌ కళాశాల వద్ద వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్ధి, యువ‌జ‌న‌ విభాగం అధ్యర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ‌న్నారు. ప్ర‌భుత్వ‌ మెడికల్‌ కళాశాలలను టీడీపీ కార్పొరేట్‌ నాయకులకు ధారాదత్తం చేయడానికి సీఎం చంద్రబాబు చర్యలు చేపడుతున్నారన్నారు.  వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో విద్య, వైద్యం రెండు క‌ళ్లుగా అప్పటి ముఖ్యమంత్రి వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలన చేస్తే, సీఎం చంద్రబాబు పాలనలో విద్య, వైద్య రంగాలను ప్రైవేట్‌ పరం చేస్తున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో విద్యార్థులకు ఫీజ్‌ రియింబర్స్‌మెంట్‌ చేసి పెద విద్యార్ధులు ఉన్నత చదువులు అభ్యసించాలని చేస్తే, నేటి పాలనలో పేద విద్యార్ధులు చదువుకు దూరం అవుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మెడికల్‌ కళాశాలలను దేశంలో ఎక్కడా ప్రైవేట్‌ పరం చేయలేదని, మన రాష్ట్రంలో సీఎం చంద్రబాబు మెడికల్‌ కళాశాలలను పీపీపీ పద్దతిలో కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడం అన్యాయమన్నారు.  కూటమి 15 నెలల పాలనలో రాష్ట్ర ప్రజలు విరక్తి చెందారని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అభిన‌య్‌రెడ్డి విమ‌ర్శించారు.

Back to Top