అనంతపురం : ఆర్డీటీ పరిరక్షణకు ప్రజా ఉద్యమం చేపడుతామని అనంతపురం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. గురువారం అనంతపురంలోని వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో అనంత వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ఆర్డీటీ సంస్థ రాజకీయాలు, మతాలు, కులాలకు అతీతంగా స్వచ్ఛందంగా సేవలు అందిస్తోంది. దేశంలోనే అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఆర్డీటీ సేవలు ఎనలేనివి. విద్య, వైద్యం, క్రీడ రంగాలతో పాటు పేదరికం రూపుమాపేందుకు ఆర్డీటీ కృషి చేస్తోంది. ప్రభుత్వానికి సమాంతరంగా సేవలు అందిస్తున్న ఆర్డీటీ కేంద్ర ప్రభుత్వ తీరుతో ఉనికి కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఆర్డీటీకి మతం బూచి చూపి దేశం నుంచి వెళ్లిపోయేలా చూస్తున్నారు. విదేశీ నిధులు రాకుండా అడ్డుకుని ఆర్డీటీ సేవలు అందించలేని పరిస్థితికి తెచ్చారు. ఆర్డీటీ మూతపడుతుందని ప్రజల్లో భయాందోళన ఉంది. ఎంతో మంది నిరుపేదలకు ఆర్డీటీ చేయూత ఇచ్చింది. మహిళా సాధికారతకు కృషి చేసింది. బత్తలపల్లి, కణేకల్లు, కళ్యాణదుర్గంలో ఆర్డీటీ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో ఏటా 8.50 లక్షల మందికి వైద్య సేవలు అందుతున్నాయి. కోవిడ్ వంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆర్డీటీ సంస్థ మార్గదర్శకంగా నిలిచింది. ఎంతో ఎఫెక్టివ్‌గా పని చేసింది. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయా పార్టీలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఆర్డీటీ సంస్థ సేవలు, ఆవశ్యకతపై ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశా. జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరాం. సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని విన్నవించా. అయినా ఫలితం శూన్యం. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కూడా గతంలో ఆర్డీటీతో చర్చించారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలోగా ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ కాకుంటే ఆర్డీటీ మూసివేసే పరిస్థితి వస్తుంది. ఆర్డీటీ విషయంలో ప్రజల్లో ఎంత ఆందోళన ఉందో ఇటీవల అనంతపురంలో జరిగిన నిరసనే నిదర్శనం. గత ఎన్నికల సమయంలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ ఆర్డీటీ ప్రతినిధులను కలిసి ఆర్డీటీకి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైనా పట్టించుకోలేదు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. చంద్రబాబు మద్దతు లేకపోతే ఎన్డీయే అధికారంలో ఉండదని టీడీపీ నాయకులే చెబుతున్నారు. చంద్రబాబుకు సొంత ప్రయోజనాలు తప్పితే ఆర్డీటీ విషయం పట్టడం లేదా? ఆర్డీటీపై లక్షలాది మంది ఆధారపడి ఉన్నారన్న విషయం ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేయించే విషయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపాలి ఆర్డీటీ పరిరక్షణ కోసం గతంలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తలారి రంగయ్య నాయకత్వంలో బైక్ ర్యాలీ, పాదయాత్రలు చేశాం. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఆర్డీటీ సేవలు కొనసాగేలా చూడాలి. అవసరమైతే అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపండి కేంద్రం కూడా ఆర్డీటీ సేవలు గుర్తించాలని కోరుతున్నాం. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తాం. ప్రభుత్వాలు దిగిరాకపోతే అందరినీ కలుపుకుని ప్రజా ఉద్యమం నిర్మించి ప్రభుత్వం మెడలు వంచుతాం. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం: విద్య, వైద్యం అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వాలే నిర్వహించాలి. వైయస్ఆర్‌సీపీ హయాంలో విద్య, వైద్యానికి పెద్దపీట వేశాం. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో 17 మెడికల్ కళాశాలలు తెచ్చాం. ఐదు కళాశాలలను పూర్తి చేసి 2023–2024 విద్యా సంవత్సరంలోనే తరగతులు ప్రారంభించాం. చంద్రబాబు తన వాళ్లకు దోచిపెట్టడానికే రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అమరావతి కోసం అప్పు తెచ్చి లక్ష కోట్లు పెడుతున్నారు. రైతుల నుంచి భూములు లాక్కుంటున్నారు. రాజధాని కూడా పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేస్తారా? మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెనుకొండలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల వద్ద శుక్రవారం (ఈనెల 19వ తేదీ) నిరసన తెలియజేస్తాం. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్ దుర్మార్గం తాడిపత్రిలో దౌర్జన్యం చేసే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఎందుకు అడ్డుకోరు? సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని తాడిపత్రిలోకి అనుమతించాలి ప్రతి సారి అడ్డంకులు సృష్టించడం సరికాదు తాడిపత్రిలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ప్రభుత్వానికి సమాంతరంగా తాడిపత్రిలో మరో వ్యవస్థ పనిచేస్తోంది. కలెక్టర్లు, ఎస్పీలతో ఇటీవల సమీక్షలు చేసిన చంద్రబాబు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని సూచించారు. మరి తాడిపత్రిలో ఏం జరుగుతోందో చంద్రబాబుకు తెలియదా? తాడిపత్రిలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై న్యాయపరంగా ముందుకెళ్తాం.