ఉల్లి రైతుల జీవితాల‌తో కూట‌మి ప్ర‌భుత్వం చెల‌గాటం

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఎస్వీ మోహ‌న్‌రెడ్డి,  కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ ఆగ్ర‌హం

గిట్టుబాటు ధరను ఎత్తేసి పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వ ప్రకటనతో రైతుల ఆగ్ర‌హం

ఉల్లికి గిట్టు బాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ కోడుమూరు మండలంలో ధ‌ర్నా

రైతుల ఆందోళ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ సంఘీభావం

క‌ర్నూలు: ఉల్లి రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో  కూటమి ప్రభుత్వం విఫ‌లమైంద‌ని క‌ర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు ఎస్వీ మోహ‌న్‌రెడ్డి, కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త  కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ మండిప‌డ్డారు. ఉల్లికి గిట్టుబాటు ధరను ఎత్తేసి పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వ ప్రకటనతో రైతుల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉల్లికి గిట్టు బాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామంలో సోమ‌వారం రైతులు ఆందోళ‌న చేప‌ట్టారు. రైతుల ధ‌ర్నాకు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు సంఘీభావం ప్ర‌క‌టించారు. ఉల్లి రైతుల ప‌ట్ల ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరును వారు తీవ్రంగా త‌ప్ప‌ప‌ట్టారు.  

కొనుగోలు పేరుతో డ్రామా:  ఎస్వీ మోహ‌న్‌రెడ్డి
`కనీస గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న ఉల్లి రైతులు చివరకు పంటను రోడ్ల మీద పారవేస్తున్నారు. వారికి అండగా నిలుస్తూ, ఉల్లి కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం, పరిహారం పేరుతో డ్రామాలు ఆడుతోంది. తొలుత క్వింటా ఉల్లికి రూ.1200 గిట్టుబాటు ధరపై హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఎక్కడా పంట మాత్రం కొనుగోలు చేయలేదు. దీనిపై మా పార్టీ ఆందోళనకు దిగడంతో, ఉల్లి రైతులకు పరిహారం ఇస్తామని ప్రకటించింది. ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే, పరిహారం చెల్లిస్తారు. కానీ, ఇక్కడ ప్రభుత్వం విచిత్రంగా ఉల్లికి గిట్టుబాటు ధర ఇచ్చి, కొనుగోలు చేయకుండా, రైతులకు పరిహారం ఇస్తామని చెబుతోంది` అని ఎస్వీ మోహ‌న్‌రెడ్డి త‌ప్పుప‌ట్టారు.

ఎకరాకు రూ.80 వేలు నష్టం:  కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి
‘ఉల్లి ఎకరాకు దాదాపు 100 క్వింటాళ్ల వరకు పండుతుంది. అలా ఒక హెక్టార్‌లో దాదాపు 250 క్వింటాళ్ల ఉల్లి ఉత్పత్తి అవుతుంది. క్వింటా ఉల్లికి ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర రూ.1200. ఆ ప్రకారం ఒక హెక్టార్‌లో పండే ఉల్లికి రైతులకు రూ.3 లక్షల ఆదాయం రావాలి. కానీ, ఈ ప్రభుత్వం ఉల్లి రైతులకు ఒక్కో హెక్టార్‌కు రూ.50 వేల పరిహారం ఇస్తామని చెబుతోంది. నిజంగా అలా ఇచ్చినా, ఉల్లి రైతు ఒక్కో ఎకరానికి రూ.80 వేల చొప్పున నష్టపోతాడు. మరి ఈ ప్రభుత్వం వారిని ఏ విధంగా ఆదుకున్నట్లు! పైగా ఇస్తామన్న పరిహారానికి సంబంధించి, ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలు ప్రకటించలేదు. అలాంటప్పుడు అసలు ఆ పరిహారం ఎప్పుడిస్తారో కూడా తెలియడం లేదు.     అయినా కూటమి నేతలు మాత్రం గొప్పలు చెబుతున్నారు. ఉల్లి రైతులకు విపత్తులు వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెక్టారుకు రూ.25 వేలు ఇస్తాయి. కానీ, మేము రూ.50 వేలు ఇస్తున్నాం అని ఘనంగా చెప్పుకోవ‌డం సిగ్గుచేటు`  

ఉల్లికి గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాలి:  డాక్ట‌ర్‌ ఆదిమూల‌పు స‌తీష్‌
ఉల్లి రైతులను ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది.  రైతుల వద్ద 2.67 లక్షల టన్నుల ఉల్లి పంట ఉండగా, ఇప్పటి వరకు రూ.13 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. అలాంటప్పుడు మిగిలిన ఉల్లి పంట కొనుగోలు చేయాలంటే ప్రభుత్వానికి రూ.300 కోట్లు అవసరం. మరోవైపు ఉల్లి కొనుగోలు నిలిపి వేస్తున్నట్లు ఇప్పటికే మార్కెట్‌లో ప్రకటించారు. రైతులకు ఇస్తామన్న పరిహారంపై విధివిధానాలు ప్రకటించకుండానే, మార్కెట్లలో ఉల్లి కొనుగోళ్లు నిలిపి వేస్తామని ప్రకటించడం దుర్మార్గం. నిన్న క‌ర్నూలు మార్కెట్ యార్డులో ప్ర‌త్యేక స్టాల్స్ ఏర్పాటు చేసిన నేరుగా వినియోగ‌దారుల‌కు విక్ర‌యించాల‌న్న అధికారుల ప్ర‌య‌త్నం కూడా ఫ‌లించ‌లేదు. ఇలాంటి స‌మ‌యంలో రైతులు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. కనీసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి వారి నుంచి పంట కొనుగోళ్లు చేయకపోవడం దారుణం. ఉల్లికి గిట్టుబాటు ధ‌ర క‌ల్పించి  రైతులను ఆదుకోవాలి` అని డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ డిమాండ్ చేశారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Back to Top