`ముఖ్య` నేత‌లు ప్రత్యేక ప్రయాణాలు  

15 నెలల్లో దాదాపు 70 సార్లు సీఎం చంద్రబాబు హైదరాబాద్‌కు రాకపోకలు

మంత్రి లోకేశ్‌దీ అదే దారి.. 77 సార్లు హైదరాబాద్‌కు ప్రయాణం 

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ‘ప్రత్యేక’ ప్రయాణాలకు అంతేలేదు 

ఏపీలో కంటే హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉండడమే ఎక్కువ 

ప్రతిపక్షంలో ఉన్నపుడు వీరంతా ఏళ్లతరబడి రాష్ట్రం బయటే ఉన్నారు 

 మొదటి మూడేళ్లు రాష్ట్రం ముఖమే చూడలేదు 

అధికారంలో ఉన్నా.. ఇప్పుడు చుట్టపుచూపుగా విజయవాడ వస్తున్నారు 

ప్రత్యేక విమానాలలో ప్రయాణం.. ప్రజాధనం దురి్వనియోగం 

సోషల్‌ మీడియాలో, కూటమి వర్గాల్లో విస్తృత చర్చ   

సీఎంగా ఉండగా రెండు, మూడుసార్లు మించి హైదరాబాద్‌ వెళ్లని జగన్‌

అమరావతి: అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వారిది ఒకే తీరు. గన్నవరం విమానాశ్రయంలో ఎక్కే విమానం.. దిగే విమానం.. వారాంతం విశ్రాంతి కోసం ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజాధనాన్ని దురి్వనియోగం చేస్తున్నారనే చర్చ అటు టీడీపీ కూటమి వర్గాలో.. ఇటు అధికార వర్గాలు, సోషల్‌ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. ప్రాథమిక సమాచారం మేరకు.. ఈ 15 నెలల్లో సీఎం చంద్రబాబు దాదాపు 70 సార్లు గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లారు.  మంత్రి లోకేశ్‌ 77 సార్లు ‘ప్రత్యేక’ంగా ప్రయాణాలు చేశారని తెలుస్తోంది. 

ఇక డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ‘ప్రత్యేక’ ప్రయాణాలకు అంతేలేదు. ఆయన ఏపీలో కంటే హైదరాబాద్, ఇతర ప్రాంతాలలోనే ఎక్కువగా గడిపారు.  పట్టుమంటే పదిరోజులు ఆయన విజయవాడలో ఉన్న దాఖలాలే లేవని అధికారులు చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉన్నా చంద్ర­బాబు వారాంతంలో విశ్రాంతి తీసుకోవడానికి హైదరాబాద్‌కు వెళ్లి.. అక్కడ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో సరదాగా గడుపుతున్నారంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అధికారంలో ఉండి కూడా చుట్టపుచూపుగా విజయవాడ వస్తున్నారంటూ అధికారులు వ్యంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబుది అదే తీరు.

2019లో అధికారం కోల్పోయాక.. మూడేళ్లపాటు అంటే 2022 వరకూ ఏపీ ముఖం చూడలేదన్న సంగతి తెల్సిందే... కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్‌కే పరిమితమయ్యారని ఎత్తి చూపుతున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం ప్రజాసేవలో నిమగ్నమైతే.. కనీసం వారికి మనోధైర్యం కలి్పంచేందుకు కూడా చంద్రబాబు అప్పట్లో రాష్ట్రానికి రాలేదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు 2019 మే 30 నుంచి 2024 జూన్‌ 7 మధ్య రెండు మూడుసార్లు మాత్రమే హైదరాబాద్‌కు వెళ్లారని.. నిత్యం ప్రజలకు సుపరిపాలన అందించడానికే సమయం వెచ్చించారని గుర్తు చేస్తున్నారు.  


లోకేశ్‌ 77 సార్లు హైదరాబాద్‌కు.. 
మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ కూడా తండ్రి సీఎం చంద్రబాబు బాటలోనే పయనిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు 77 సార్లు వెళ్లినట్లు టీడీపీ కూటమి, సోషల్‌ మీడియాలో చర్చ సాగుతోంది. అంటే.. గత 15 నెలలుగా సగటున వారానికి ఒకసారి లోకేశ్‌ హైదరాబాద్‌కు వెళ్లి సరదాగా గడిపినట్లు సోషల్‌ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. గతేడాది ఆగస్టు 31న బుడమేరు వరద విజయవాడను చుట్టముట్టి.. విలయం సృష్టించి.. అపార ఆస్తి, ప్రాణనష్టం జరిగినప్పుడు కూడా లోకేశ్‌ హైదరాబాద్, ముంబయిలో ఉన్నారని ప్రజలు ఎత్తి చూపుతున్నారు.

2014–19 మధ్య టీడీపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు కూడా లోకేశ్‌ ఇదే రీతిలో వ్యవహరించారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోయాక.. మూడేళ్లపాటు రాష్ట్రానికి వచి్చంది వేళ్లపై లెక్కపెట్టవచ్చు. పాదయాత్ర, ఎన్నికల ప్రచారం సమయంలో మినహా లోకేశ్‌ మిగతా రోజుల్లో హైదరాబాద్‌కే పరిమితం అయ్యారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. 


పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక విమానంలో టూర్లు..
డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అందుబాటులో ఉండటం లేదని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఇటీవల వ్యాఖ్యానించడం తెలిసిందే... దీన్నిబట్టి పవన్‌ కళ్యాణ్‌ అటు అధికార వర్గాలు.. ఇటు ప్రజలకు ఏమాత్రం అందుబాటులో ఉంటున్నారన్నది స్పష్టమవుతోంది. కలెక్టర్ల సమావేశం వంటి ముఖ్యమైన సమావేశాలకు కూడా పవన్‌ కళ్యాణ్‌ డుమ్మా కొడుతుండడం అధికార వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

ఈ 15 నెలల్లో పవన్‌ విజయవాడలో ఉన్నది చాలా తక్కువని సోషల్‌ మీడియాలో, కూటమి వర్గాల్లో చర్చ సాగుతోంది. సినిమా షూటింగ్‌లు, వ్యక్తిగత పనుల నిమిత్తం పవన్‌ కళ్యాణ్‌ రాజధానిలో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువగా గడుపుతున్నారన్నది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వారాహి యాత్ర సమయంలో మినహా మిగతా సందర్భాల్లో కూడా పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్రంలో కాకుండా హైదరాబాద్, ఇతర ప్రాంతాలకే పరిమితమయ్యారు.  

Back to Top