పీపీపీ ముసుగులో ప్రజల ఆస్తుల దోపిడీ

చంద్రబాబు పాలనపై కారుమూరు వెంకటరెడ్డి ఫైర్‌

వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి.

రాష్ట్రంలో నారాసుర పరిపాలన సాగుతోంది

చంద్రబాబు, లోకేష్‌ పాలనను గాలికి వదిలేశారు

పీపీపీ పేరుతో ఎక్కడిక్కడ యథేచ్ఛగా ప్రైవేటీకరణ

‘క్యాష్‌–రాజేష్‌–లోకేష్‌’ ప్రైవేటీకరణలో ఇదే ఫార్ములా

క్యాష్‌ ఇస్తే విశాఖలో భూములు, రిషికొండ భవనాలు..

ఇంకా బీచ్‌ పక్కన స్థలాలు కూడా ఇస్తామంటున్నారు

విజయవాడ భవానీ ద్వీపం కూడా కట్టబెడతారు

స్టేడియాలు, పార్కులు, పోర్టులు, టూరిజం కేంద్రాలు..

వరసగా అన్నింటినీ ప్రైవేటీకరణకు తీసుకెళ్తున్నారు

కారుమూరు వెంకటరెడ్డి ఆక్షేపణ

పీపీపీ పేరుతో కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ హేయం

వాటిపై జగన్‌గారు ఇప్పటికే స్పష్టంగా హెచ్చరించారు

ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణపై న్యాయపోరాటం చేస్తాం

ప్రజల ఆస్తులను దోచిపెట్టాలని చూస్తే ఊర్కోబోము

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన కారుమూరు వెంకటరెడ్డి 

తాడేపల్లి:  రాష్ట్రంలో పీపీపీ (పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌) పేరుతో ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే దోపిడీ జరుగుతోందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌ పాలనలో ప్రభుత్వ భూములు, భవనాలు, మెడికల్‌ కాలేజీలు, ఆర్టీసీ ఆస్తులు సహా ప్రజల సంపదను ప్రైవేటీకరణ ముసుగులో కొందరు కార్పొరేట్‌ సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ విధానమే చివరకు ప్రభుత్వానికి పాడె కట్టే పరిస్థితిని తీసుకొస్తుందని హెచ్చరించారు. ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం వైయస్‌ఆర్‌సీపీ అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కారుమూరు వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
ప్రెస్‌మీట్‌లో కారుమూరు వెంకటరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

‘క్యాష్‌–రాజేష్‌–లోకేష్‌’ ఫార్ములా:
    రాష్ట్రంలో నారాసుర పరిపాలన సాగుతోంది. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ రెండేళ్లుగా పరిపాలనను గాలికి వదిలేసి పీపీపీ పాలన కొనసాగిస్తున్నారు. ప్రైవేటైజేషన్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పేరుతో ‘క్యాష్‌–రాజేష్‌–లోకేష్‌’ ఫార్ములాను అమలు చేస్తున్నారు. ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించే కార్యక్రమం నడుస్తోంది. ఏపీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తే సినిమా సన్నివేశాలు గుర్తుకు వస్తున్నాయి. డబ్బులు చెల్లిస్తే విశాఖలో భూములు కావాలా? రిషికొండలో వైయస్‌ జగన్‌ నిర్మించిన భవనాలు కావాలా? బీచ్‌ పక్కన లేదా ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని స్థలాలు కావాలా? అంటూ ఆఫర్లు ఇస్తున్న పరిస్థితి ఉంది.    
    విజయవాడలో భవానీ ద్వీపం, సితార సెంటర్‌ సహా ఎక్కడ భూములు కావాలన్నా ఇప్పిస్తామని చెబుతున్నారు. విశాఖలో స్టేడియాలు, పార్కులు, పోర్టులు, రాష్ట్రంలోని ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్లు, టూరిజం కేంద్రాలు, దేవాలయ భూములు, తిరుచానూరు, భోగాపురం భూములు, మెడికల్‌ కాలేజీలు, ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలు, ఆడిటోరియంలు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు, భూములు అన్నీ 99 పైసలకే ఇస్తామన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 

‘నీకింత. నాకింత’ అంటూ పంపకాలు:
    పీపీపీ పేరుతో ప్రభుత్వ ఆస్తులను మీకు కావాల్సిన వారికి దోచిపెట్టడం దారుణం. ‘ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు’ అన్నట్లుగా బినామీలు, రాకేష్, లోకేష్‌లు ప్రజల ఆస్తులను పంచుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో అధికారికంగా జరుగుతున్న దోపిడీ. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. 
    ఒక ‘పీ’ అంటే ప్రజలు, మరో ‘పీ’ అంటే ప్రభుత్వం, ఇంకో ‘పీ’ అంటే పాడె కట్టడం. మెడికల్‌ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే వైయస్‌ జగన్‌ హెచ్చరించారు. ప్రైవేటీకరణపై వైయస్‌ఆర్‌సీపీ న్యాయపోరాటం చేస్తుంది. ప్రజల ఆస్తులను దోచుకోవాలని చూస్తున్న వారికి ఈ మూడేళ్లే అవకాశం.

ఊర్కోబోము. పోరాడతాము:
    ప్రజల ఆస్తులను పప్పు బెల్లాల్లా పంచుకుంటామంటే వైయస్‌ఆర్‌సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు వేలం లేదా విధివిధానాల ప్రకారం భూములు కేటాయిస్తే వారు నిర్మాణాలు చేపడతారు. కానీ ఇక్కడ ప్రజల ఆస్తులను రహేజా వంటి రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇలా ప్రజల ఆస్తులను మీ ఇష్టం వచ్చినట్లు దోచిపెడితే ఆ రోడ్లపై ప్రజలు పన్నులు చెల్లించి నడవాలా? ఎవరు ఎవరికీ బినామీలుగా వ్యవహరిస్తున్నారో ప్రజలకు తెలుసు. అందుకే ప్రజల ఆస్తులను దోచిపెట్టే ప్రయత్నాలు జరిగితే వైయస్‌ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదు అని కారుమూరు వెంకటరెడ్డి హెచ్చరించారు.

Back to Top