పెనుకొండ: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేశామని నిరూపిస్తే ఎక్కడైనా, ఏ వేదికపైనైనా చర్చకు సిద్ధమని శ్రీసత్యసాయి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షురాలు, మాజీమంత్రి ఉషశ్రీచరణ్ మంత్రి సవితకు సవాల్ విసిరారు. పెనుకొండ మండల కేంద్రంలోని మునిమడుగు గ్రామపంచాయతీ పరిధిలోని అమ్మవారిపల్లి గ్రామంలో నిర్వహించిన "కాఫీ విత్ కేడర్" కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ.. రెండేళ్ల పాలనలో అన్ని హామీలు నెరవేర్చామని మంత్రి సవిత చెబుతున్నారని, అయితే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ యువతకు రెండేళ్లలో ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. అలాగే రైతులకు రైతు భరోసా పథకం కింద రెండేళ్లలో ఎన్నిసార్లు ఆర్థిక సాయం అందించారో వెల్లడించాలని కోరారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్లలో కనీసం ఆరు సిలిండర్లు ఇవ్వాల్సి ఉండగా నాలుగు సిలిండర్లు అయినా ఇచ్చినట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేశామని ప్రభుత్వం చెబుతోందని, అయితే రెండేళ్లలో ఎన్నిసార్లు ఆ పథకం కింద లబ్ధి అందించారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఆడబిడ్డ నిధి అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేస్తూ, రెండేళ్ల కాలంలో ఎంతమంది మహిళలకు ఆ సాయం అందించారో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ఈ హామీలన్నింటినీ పూర్తిగా అమలు చేశామని ఆధారాలతో నిరూపించగలిగితే, మంత్రి సవిత సూచించే ఏ ప్రదేశంలోనైనా బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఉషశ్రీచరణ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో పెనుకొండ మండలానికి చెందిన వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.