కుయ్‌.. కుయ్‌.. మూగబోతోంది

పాడేరులో వైద్యం అంద‌క ఆటోలోనే శిశువు మ‌ర‌ణించ‌డం ప‌ట్ల వైయ‌స్ జ‌గ‌న్ దిగ్బ్రాంతి

కూట‌మి స‌ర్కార్ తీరుపై ఆగ్ర‌హం

తాడేప‌ల్లి:  కుయ్ ..కుయ్ మంటూ నిమిషాల వ్య‌వ‌ధిలో వ‌చ్చే 108 వాహ‌నాలు  కూట‌మి పాల‌న‌లో మూగ‌బోతున్నాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మండిపడ్డారు. ప్ర‌జ‌ల ప్రాణాలు గాలిలో క‌లిసిపోతున్నా..పాల‌కుల్లో చ‌ల‌నం రావ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో వైద్యం అందక ఆటోలోనే శిశువు మరణించ‌డం ప‌ట్ల వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. కూట‌మి స‌ర్కార్ తీరును ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ ఎండ‌గ‌ట్టారు. 

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..
కుయ్‌.. కుయ్‌.. మూగబోతోంది, ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు 
చంద్ర‌బాబు కూట‌మి ప్రభుత్వం ఉరివేస్తోంది. పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచ్చింది. చివరకు ఆటోలోనే ప్రసవం జరిగింది. వైద్యం అందక ఆటోలోనే శిశువు మరణించింది. 
వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో అంబులెన్స్‌లు,  పట్టణ ప్రాంతాల్లో ఫోన్‌చేసిన 15 నిమిషాల్లోగా 108 రావాలన్న నిబంధన ఉంటే, దాన్ని అధిగమిస్తూ 12-14 నిమిషాల్లోనే చేరుకునేవి. గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే, 16-17 నిమిషాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే, దీన్నికూడా అధిగమిస్తూ  22.12 నిమిషాల్లోనే చేరుకుని 108లు సేవలందించాయి. మరి ఎందుకు ఇప్పుడు చేరుకోవడంలేదు? ఫోన్‌ చేసినా ఎందుకు రావడంలేదు? ప్రభుత్వం అన్నది పనిచేస్తేనేకదా! కలెక్షన్ల మీద తప్ప ప్రజలమీద ధ్యాస ఉంటేకదా! అంటూ వైయ‌స్ జ‌గ‌న్ మండిప‌డ్డారు.

Back to Top