స్పీకర్‌ రూలింగ్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించండి 

వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 

నాకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశాలివ్వండి

హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన వైయ‌స్ఆర్‌సీపీ పక్ష నేత వైఎస్‌ జగన్‌ 

నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నారు

శాసనసభ వ్యవహారాల మంత్రి కూడా ఇదే చెప్పారు

స్పీకర్‌ రూలింగ్‌ వెనుక రాజకీయ వైరం, పక్షపాతం.. అది అధికార పార్టీ సమష్టి నిర్ణయం 

సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలన్న సూత్రానికి తిలోదకాలు

ప్రతిపక్ష నేత గురించి రాజ్యాంగంలో, చట్టంలో స్పష్టమైన నిర్వచనం

సీట్ల ఆధారంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా లేదు 

ఈ లెక్కన వైయ‌స్ఆర్‌సీపీనే ఏకైక ప్రతిపక్ష పార్టీ.. 

అధికార యంత్రాంగమంతా పాలక వర్గానికి మడుగులొత్తుతోంది

ఈ పరిస్థితిలో ప్రజల గొంతుకగా భావించి మాట్లాడే అవకాశం ఇవ్వాలి

వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా అయ్యన్నపాత్రుడు, పయ్యావుల కేశవ్‌

నేడు ఈ పిటిషన్‌ను విచారించనున్న హైకోర్టు

తాడేప‌ల్లి: శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు తిరస్కరిస్తూ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఇచ్చిన రూలింగ్‌ను సవాలు చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ రూలింగ్‌ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రూలింగ్‌ను ఆంధ్రప్రదేశ్‌ జీత భత్యాలు, పెన్షన్లు, అనర్హతల తొలగింపు చట్టానికి విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. 

తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యంలో శాసనసభ కార్యదర్శి, స్పీకర్‌ కార్యదర్శి, న్యాయ, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శితోపాటు స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరపనుంది. వైఎస్‌ జగన్‌ పిటిషన్‌లో ఏం చెప్పారంటే..

నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయం
గత ఏడాది మే 21వ తేదీన కొత్తగా ఎన్నికైన శాసనసభ సభ్యులకు ప్రమాణస్వీకార కార్యక్ర­మం చేపట్టారు. శాసనసభలో అనుసరిస్తున్న ఆనవా­యితీ ప్రకారం మొదటగా శాసనసభ పక్ష నేత లేదా అధికార కూటమి పార్టీ నాయకుడు ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత ప్రతిపక్షాల నుంచి ప్రతిపక్ష నేతగా పరిగణించే సభ్యుడి ప్రమాణ స్వీకారం జరగాలి. కానీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో అనుసరించిన విధానం మాత్రం ఈ ఆనవాయితీకి విరుద్ధంగా ఉంది. మొదట శాసన­సభ పక్ష నేత అయిన ముఖ్యమంత్రి ప్రమాణం చేశారు. ఆ తర్వాత మంత్రివర్గ సభ్యులు ప్రమా­ణం చేశారు. 

ఆ తర్వాతే నా వంతు వచ్చింది. తద్వారా ప్రతిపక్ష నేత పదవిని వైయ‌స్ఆర్‌సీపీ శాసనసభ పక్షానికి ఇవ్వకూడదన్న నిర్ణయానికి ముందుగానే వచ్చేశారు. రాష్ట్ర ప్రజల తరఫున ప్రశ్నలు లేవనెత్తే ప్రతిపక్ష స్వరాన్ని అణచి వేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారన్నది నాకు స్పష్టంగా అర్థమైంది. తెలుగుదేశం–జనసేన–­బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఉన్న ఏకైక పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ మాత్రమే. ఎన్నికల అనంతరం కూడా వైయ‌స్ఆర్‌సీపీ ఒక్కటే ప్రతిపక్ష పార్టీగా శాసనసభలో ఉంది. కాబట్టి, వైయ‌స్ఆర్‌సీపీనే అస­లైన ప్రతిపక్షం. అయినప్పటికీ 2024 జూన్‌ 21న అనుసరించిన సంప్రదాయ విరుద్ద విధానాన్ని బట్టి చూస్తే అధికార కూటమి నేతలు ముందుగానే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తేటతెల్లమవుతోంది.

నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని పయ్యావుల కేశవ్‌ చెప్పారు
గత ఏడాది జూన్‌ 24న నేను స్పీకర్‌కు లేఖ రాశాను. ప్రతిపక్ష నేత హోదా, ప్రజా సమస్యలపై మాట్లాడే విషయంలో తగినంత సమయం కల్పించాలని కోరాను. అంతేకాక గతంలో 10 శాతం సీట్లు కూడా పొందని రాజకీయ పార్టీలకు సైతం ప్రతిపక్ష నేత హోదా ఇచ్చిన ఉదంతాలను ఆ లేఖలో వివరించాను. అయితే స్పీకర్‌ నా లేఖ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌  మీడియాతో మాట్లాడుతూ అధికార కూటమి ఉద్దేశాన్ని బహిరంగ పరిచారు. 

వైయ‌స్ఆర్‌సీపీకి  10శాతం సీట్లు రాకపోవడంతో నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం అసాధ్యం అని, నేను కేవలం వైయ‌స్ఆర్‌సీపీ ఫ్లోర్‌ లీడర్‌ మాత్ర­మే­నని ఆయన స్పష్టంచేశారు. అంతేకాకుండా, వైయ‌స్ఆర్‌సీపీకి అసలు ప్రతిపక్ష హోదా రావాలంటే 10 సంవత్సరాలు పడుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ఈ వ్యాజ్యంలో వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చాను.

నా పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే స్పీకర్‌ రూలింగ్‌ 
నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై గత ఏడాది జూలై 23న నేను హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాను. ఆంధ్రప్రదేశ్‌ జీతభత్యాలు, పెన్షన్లు, అనర్హతల తొలగింపు చట్టం, 1953లోని 12–బి ప్రకారం నన్ను ప్రతిపక్ష నేతగా ప్రకటించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరాను. ఈ పిటిషన్‌లో పెండింగ్‌లో ఉండగానే శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఓ రూలింగ్‌ ఇచ్చారు. నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆ రూలింగ్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నేను ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశాను. స్పీకర్‌ రూలింగ్‌ అనేక చట్టాల ప్రకారం తప్పు. ఆ రూలింగ్‌లో అయ్యన్న పాత్రుడు ఉపయోగించిన శైలి, పదజాలాన్ని మొదటి నుంచి చివరి వరకు పరిశీలిస్తే, నా చట్టబద్ధమైన హక్కును నిరాకరించాలని ముందే నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.  

స్పీకర్‌ రూలింగ్‌ వెనుక రాజకీయ వైరం, పక్షపాతం
⇒ అధికార పార్టీ సభ్యులు తరచూ మీడియాతో మాట్లాడుతూ, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వబోమని బహిరంగంగానే ప్రకటించారు. దీన్నిబట్టి స్పీకర్‌ రూలింగ్‌ వెనకున్న అంత­రార్థం ఏమిటో స్పష్టమవుతోంది. ఇది స్పీకర్‌ మాత్రమే తీసుకున్న నిర్ణయం కాదు. అధికార పార్టీ సమష్టి నిర్ణయం. స్పీకర్‌ రూలింగ్‌ వ్యక్తిగత, రాజకీయ, శత్రుత్వ పూరితమైన వ్యాఖ్యలతో నిండిపోయింది. ఈ రూలింగ్‌ ఇవ్వడం వెనుక రాజకీయ వైరం, పక్షపాతం ఉన్నాయన్న విషయం స్పష్టమవుతోంది. న్యాయ నిష్పాక్షికత, పార్లమెంటరీ బాధ్యత, సమర్థవంతమైన ప్రతిపక్షం అనే మూల సూత్రాలను పూర్తిగా విస్మరించారు.  

⇒ ప్రతిపక్ష నేత హోదా విషయంలో అధికరణ 208 కింద నిర్ధిష్టమైన నియమావళి ఉంది. దీని ప్రకారం నాకు ఆ హోదాను అధికారికంగా ఇవ్వాలి. సీట్ల సంఖ్య ఆధారంగా ప్రతిపక్ష హోదా నిబంధన ఏ చట్టంలోనూ లేదు. శాసనసభలోని మొత్తం సీట్లలో 10 శాతం సీట్లు సాధించకపోయినా ఆ పార్టీలు ప్రధాన ప్రతిపక్ష హోదా పొందిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఆ పార్టీ నేత ప్రధాన ప్రతిపక్ష నేతగా నియమితు­లైన ఉదంతాలున్నాయి. ఇది పార్లమెంట్‌లోనే కాక దేశంలోని పలు శాసనసభల్లో జరిగింది. 

⇒ 1994లో మొత్తం 294 సీట్లలో కాంగ్రెస్‌ పార్టీ 26 సీట్లే గెలుచుకున్నప్పటికీ, ఆ పార్టీ నేత పి.జనార్దన్‌రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది. 2015లో ఢిల్లీలో బీజేపీకి 3 సీట్లే వచ్చినప్పటికీ, పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదానిచ్చారు. 

⇒ గత ఏడాది జూన్‌ 4 నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనల పట్ల కార్య­నిర్వా­హక శాఖ మౌనంగా ఉండిపోయింది. అధికార యంత్రాంగమంతా పాలక కూటమి రాజకీయ ప్రయో­జ­నాలకు మడుగులొత్తుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజల తరఫున మాట్లాడే, ప్రశ్నించే వేదిక శాసనసభే అవుతుంది. సభలో నేనే ఏకైక ప్రతిపక్ష గొంతుక అన్నది విస్మరించలేని నిజం. కాబట్టి, సభలో నా పార్టీ స్థానాల సంఖ్య ఆధారంగా కాకుండా, ప్రజల సమస్యలను ప్రతిబింబించే ప్రతిపక్ష స్వరం అనే అంశాన్ని పరిగణ­నలోకి తీసుకొని నాకు మాట్లాడే హక్కును ఇవ్వాలి.

⇒ పాలక పక్షం మా పార్టీ నేతలు, కార్యకర్తలపై జరిపిన క్రమ­బద్ధమైన హింస ప్రతిపక్షం, ప్రతిపక్ష నాయకుడి ప్రాము­ఖ్యతను మరింత స్పష్టం చేస్తోంది. ఈ హింస విషయంలో నేను 2024 జూన్‌ 7, 2024 జూలై 20వ తేదీల్లో కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాను. అధికార కూటమి రాజకీయ ప్రయోజనాల కోసం అధికార యంత్రాంగం ముఖ్యంగా పోలీసులు పని చేస్తున్నారు. తద్వారా ప్రజల సమస్యలపై గళమెత్తే హక్కును నిరాకరిస్తున్నారు.

⇒ స్పీకర్‌ రూలింగ్‌ కూటమి నేతల శతృత్వ భావాలకు, ఎన్నికల ఫలితాల తర్వాత పాలకవర్గ ప్రవర్తనకు అనుగుణంగా ఉంది. వ్యక్తిగత, రాజకీయ ద్వేషంతో కూడుకుని ఉంది. ఇది రాజ్యాంగ సూత్రాలకు, చట్టానికి విరుద్ధం. అందువల్ల దీన్ని రద్దు చేసి నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలి.  

Back to Top