అప్పుల‌పై కూట‌మి కుట్ర‌లు బ‌ట్ట‌బ‌య‌లు

అసెంబ్లీ సాక్షిగా అప్పులపై మంత్రి ప‌య్యావుల నిజాల ఒప్పుకోలు

కూటమి సర్కార్ తీరును ఎండగట్టిన వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్

తాడేప‌ల్లిలోని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన య‌ర్ర‌గొండ‌పాలెం ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ 

వైయస్సార్సీపీ హయాంలో అప్పులపై కూట‌మి చేసిందంతా దుష్ప్ర‌చారమే     

గత ఐదేళ్ల పాల‌న‌లో చేసిన అప్పులు రూ.3.70 ల‌క్ష‌ల కోట్లేన‌ని పయ్యావుల వెల్లడి

రూ.14 లక్షల కోట్లు అంటూ చేసిన ప్రచారం తప్పేనని తేలిపోయింది

ఇలా అబద్దాలు చెప్పడానికి సిగ్గుపడని కూటమి సర్కార్

వివ‌రాలు వెల్ల‌డించిన య‌ర్ర‌గొండ‌పాలెం ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్

తాడేప‌ల్లి: అసెంబ్లీ స‌మావేశాల సాక్షిగా అప్పుల‌పై కూట‌మి నాయకుల కుట్ర‌లు బట్టబయలు అయ్యాయని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైయస్ఆర్‌సీపీ పాల‌న‌లో రాష్ట్ర అప్పులు రూ. 14 ల‌క్ష‌ల కోట్ల‌న్న‌ట్టు చేసినదంతా దుష్ప్ర‌చారమేనని స్వయంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించిన గణాంకాలతో నిజం బయటపడిందని అన్నారు.  అయిదేళ్ళ వైయస్ జగన్ హయాంలో చేసిన అప్పులు కేవలం రూ.3.70 ల‌క్షల కోట్లేన‌ని ఆర్థిక మంత్రి ఎట్టకేలకు వాస్తవాన్ని బయటపెట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. అంటే రాజకీయంగా బురదచల్లేందుకే వైయస్ జగన్ పాలనపై అసత్య ప్రచారం చేసినట్లుగా కూటమి ప్రభుత్వమే తప్పును అంగీకరించిందని, కూటమి దిగజారుడు ప్రచారాల్లోని అవాస్తవాలు ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... 

రూ. 14 ల‌క్ష‌ల కోట్ల అప్పులు అబ‌ద్ధ‌మ‌ని తేలిపోయింది 

అబద్ధాల‌తోనే రాబోయే నాలుగేళ్లు ప్ర‌భుత్వాన్ని న‌డ‌పాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం క‌ల‌లు కంటోంది. వైయస్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు రాష్ట్ర అప్పులు రూ. 14 ల‌క్ష‌ల కోట్లంటూ విప‌రీతంగా త‌ప్పుడు ప్ర‌చారం చేసింది. వైయస్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం మీద బుర‌ద జ‌ల్ల‌డ‌మే ల‌క్ష్యంగా అప్పుల‌తో రాష్ట్రం శ్రీలంక అయిపోయింద‌ని ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, లోకేష్ ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టించారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా తీరు మార్చుకోకుండా ప‌లు సందర్భాల్లో అవే అబ‌ద్ధాలను వ‌ల్లె వేస్తూ వ‌చ్చారు. నిజం నిల‌క‌డ మీద‌నే తెలుస్తుంద‌న్న‌ట్టు కూట‌మి కుట్ర‌లు బ‌ద్ద‌ల‌య్యాయి. అప్పుల‌పై కూట‌మి నాయ‌కులు చెప్పిన మాట‌ల‌న్నీ ప‌చ్చి అబ‌ద్ధాల‌ని వారే అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. రాష్ట్ర అప్పుల‌పై వైయస్ఆర్‌సీపీ స‌భ్యుడిగా నేను అడిగిన ప్ర‌శ్న‌కు అసెంబ్లీ సాక్షిగా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ నిజాలను చెప్పాల్సి వచ్చింది. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి బడ్జెట్‌తోపాటు గ్యారెంటీ కలిపి మొత్తం అప్పు రూ.3,06,952.26 కోట్లుగా ఉందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. అలాగే వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3,70,897 కోట్లేనని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. అధికారంలోకి రావ‌డం కోసం తెలుగుదేశం నాయ‌కులు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని ప‌లుమార్లు ఆధారాల‌తో స‌హా వైయస్ఆర్‌సీపీ చెబుతూనే వ‌స్తోంది. తాజాగా ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల స‌మాధానంతో వైయస్ఆర్‌సీపీ హ‌యాంలో రూ. 14 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేశార‌ని జ‌రిగిన ప్ర‌చారమంతా అబ‌ద్ధ‌మేన‌ని తేలిపోయింది. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే 2024 జూన్‌ 12 నాటికి బడ్జెట్‌ అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు కలిపి మొత్తం రూ.6,77,849.80 కోట్లు మాత్రమే ఉన్నట్లు మంత్రి చెప్పాడు.
 
కాగ్ లెక్క‌ల‌పైనా మంత్రి అబ‌ద్ధాలే 

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక గ‌డిచిన 15 నెల‌ల్లోనే దాదాపు రూ.2 ల‌క్ష‌ల కోట్ల‌కుపైగా అప్పు చేసింది. అప్పుల‌పై నేను అడిగిన అదే ప్ర‌శ్న‌లో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్స‌రానికి సంబంధించి చేసిన అప్పుల‌పై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే దానికి అసెంబ్లీ సాక్షిగా మంత్రి అబ‌ద్ధం చెప్పి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం అంటే కేవలం అయిదు నెలల్లో (ఆగ‌స్టు 31 నాటికి) చేసిన అప్పులు రూ. 44,364 వేల కోట్లు అని, దానిలో రూ.9,058 కోట్లు చెల్లింపులు చేశామని, మిగిలిన నికర అప్పు రూ.35,305 కోట్లు అని వెల్లడించారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ కాగ్ చెప్పిన లెక్క‌ల ప్ర‌కారం ఏప్రిల్ నుంచి ఆగ‌స్టు వ‌ర‌కు చేసిన అప్పు అక్ష‌రాలా రూ.55,901 కోట్లని తన ఆడిట్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొంటున్నా కూడా ప్ర‌భుత్వం మాత్రం అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అడ్డ‌గోలుగా అబద్దాలు చెబుతోంది. ఇంత‌క‌న్నా దుర్మార్గం ఉంటుందా?  ఒక్క సంక్షేమ ప‌థ‌కం అమ‌లు చేయ‌క‌పోయినా ఇన్ని అప్పులు ఎందుకు చేశారంటే దానికి ప్ర‌భుత్వం వ‌ద్ద స‌మాధానం లేదు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి వివిధ మార్గాల ద్వారా వ‌చ్చిన ఆదాయం రూ. 61,578 కోట్లు కాగా, ఇది కాకుండా రిక‌వ‌రీ రుణం రూ. 31.25 కోట్లు. మొత్తం ఆదాయం రూ. 61,609 కోట్లు. ప్ర‌భుత్వం చేసిన వ్య‌యం రూ. 1,16,626.53 కోట్లు. లోటు రూ. 55,901 కోట్లని స్పష్టంగా అర్థ‌మైపోతున్నా సీఎం, డిప్యూటీ సీఎం స‌మ‌క్షంలో అసెంబ్లీ సాక్షిగా ప్ర‌జ‌ల‌కు ఆర్థిక మంత్రి  ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతున్నారు. 

అమ‌రావ‌తి మీదున్న శ్రద్ధ మెడిక‌ల్ కాలేజీల‌పై లేదు 

ఇది మంచి ప్ర‌భుత్వం కాదు.. ముంచే ప్ర‌భుత్వమ‌ని 15 నెల‌ల పాల‌న‌తో తేలిపోయింది. రైతులు పండించిన ఏ పంట‌కూ గిట్టుబాటు ధ‌ర ద‌క్క‌డం లేదు. ప్ర‌జ‌లు అనారోగ్యంతో మంచాన ప‌ట్టే పరిస్థితులు రాకూడ‌ద‌ని వైయ‌స్ జ‌గ‌న్ 17 మెడిక‌ల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 5 కాలేజీల‌ను పూర్తి చేసి క్లాసులు కూడా ప్రారంభించారు. కానీ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ప్రైవేటీకరణ పేరుతో ప‌ప్పు బెల్లాల‌కు అప్ప‌నంగా క‌ట్ట‌బెట్టేస్తున్నారు. నిర్మాణాలు ఆగ‌కూడ‌ద‌ని రూ. 5 వేల కోట్లు నాబార్డు నిధులు సిద్ధం చేసినా సీఎం చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేదు. ప్ర‌జారోగ్యాన్ని ప‌ణంగా పెట్టి మ‌రీ విలువైన భూములు అప్ప‌గించడ‌మే ధ్యేయంగా ప్రైవేటుకి అప్ప‌గించ‌డానికే చంద్రబాబు ఆస‌క్తి చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు ఆస్ప‌త్రుల‌న్నీ చంద్ర‌బాబు సామాజికవ‌ర్గానికి చెందిన‌వే కావ‌డంతో, ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలు వ‌స్తే వారికి న‌ష్టం జ‌రుగుతుంద‌ని చంద్ర‌బాబు భావ‌న‌. ఈ కాలేజీల‌ను వారికి అప్ప‌గించి ల‌బ్ధి చేకూర్చ‌డ‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు పావులు క‌దుపుతున్నారు. ఈ నిర్ణ‌యాన్ని వైయస్ఆర్‌సీపీ ఎట్టి ప‌రిస్థితుల్లో అంగీక‌రించ‌దు. ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ చ‌లో మెడిక‌ల్ కాలేజీ పేరిట మార్కాపురం మెడిక‌ల్ కాలేజీ వ‌ద్ద నిర‌స‌న‌కు వెళ్లినందుకు నాతో సహా వైయస్ఆర్‌సీపీ నాయ‌కుల మీద త‌ప్పుడు కేసులు న‌మోదు చేశారు. మార్కాపురం మెడిక‌ల్ కాలేజీ క‌ట్ట‌లేద‌ని పిల్ల‌ర్లు చూపించి కూట‌మి చేస్తున్న విష‌ప్ర‌చారాన్ని తిప్పికొడితే వారు త‌ట్టుకోలేక‌పోతున్నారు. చంద్ర‌బాబుకి అమ‌రావ‌తి రాజ‌ధాని మీదున్న శ్ర‌ద్ధ పేద ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన ఉచిత వైద్యం అందించ‌డంలో లేదు. తొమ్మిదేళ్లలో హైద‌రాబాద్ న‌గ‌రాన్ని నిర్మించాన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు, ఏడాదిన్న‌ర కాలంగా వెలిగొండ ప్రాజెక్టుకి ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు చేయ‌లేదు. తాను ముఖ్య‌మంత్రిగా చేసిన 15ఏళ్ల‌లో వెలిగొండ ప్రాజెక్టుకు ఎంతెంత ఖ‌ర్చు చేశారో చూపించాలి.  చంద్ర‌బాబు హ‌యాంలో రెండు ట‌న్నెల్స్ క‌లిపి 6 కిమీలు మాత్ర‌మే వెలిగొండ ప‌నులు జ‌రిగాయి. కాద‌ని నిరూపించే ద‌మ్ముందా చంద్రబాబూ అని స‌వాల్ చేస్తున్నా. రోడ్ల నిర్మాణానికి వైయస్ఆర్‌సీపీ హ‌యాంలో డీపీఆర్‌లు సిద్ధం చేసి టెండ‌ర్లు పిలిస్తే కూట‌మి ప్ర‌భుత్వం వాటిని ర‌ద్దు చేసి ప్యాచ్ వ‌ర్కులు చేస్తున్నారు. కేంద్ర నిధుల‌తో పంచాయ‌తీలో అక్క‌డ‌క్క‌డా రోడ్లేసి తామే చేశామ‌న్న‌ట్టు క‌ల‌రింగ్ ఇచ్చుకుంటున్నారు. 

ప్ర‌తిప‌క్ష గుర్తింపు ఇవ్వ‌డానికి ఎందుకంత భ‌యం?

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తుంటే స‌మాధానం చెప్పుకోలేక అసెంబ్లీకి రావడం లేద‌ని వైయస్ఆర్‌సీపీ మీద దుష్ప్ర‌చారం చేస్తున్నారు. గ‌వ‌ర్న‌ర్ సాక్షిగా ప్ర‌తిప‌క్ష గుర్తింపు కావాల‌ని కోరినా కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు. ప్రశ్నించ‌డానికి అసెంబ్లీలో స‌మ‌యం కావాల‌ని అడిగితే 11 మంది వైయస్ఆర్‌సీపీ స‌భ్యుల‌ను చూసి 164 మంది బ‌ల‌మున్న కూట‌మి భ‌యంతో వ‌ణికిపోతోంది. గ‌తంలో ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీకి కూడా ఎక్కువ స‌మయం ఇచ్చామ‌ని చెప్పుకునే చంద్ర‌బాబు, ముఖ్య‌మంత్రితోపాటు ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌కి స‌మానంగా అసెంబ్లీలో స‌మ‌యం ఇవ్వ‌డానికి ఎందుకు వ‌ణికిపోతున్నారు? స‌మ‌యం ఇస్తే మేం అసెంబ్లీకి వ‌స్తామ‌ని మేం అంటుంటే, అసెంబ్లీకి రాక‌పోతే స‌స్పెండ్ చేస్తామ‌ని స్పీక‌ర్ వితండ‌వాదం ఆడుతున్నారు. వైయస్ఆర్‌సీపీ స‌భ్యులు అసెంబ్లీలో మాట్లాడ‌టం మొద‌లుపెడితే ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైపోతాయ‌న్న భ‌యంతోనే మేం అసెంబ్లీకి రాకుండా చేసే కుట్ర‌లు చేస్తున్నారు. ప్రతిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ గారు ప్రెస్‌మీట్ పెట్టి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను వరుస‌గా ప్ర‌శ్నిస్తుంటే ఒక్క‌సారైనా స‌మాధానం చెప్పే సాహ‌సం చేయ‌లేక‌పోయారు. ప్ర‌తిప‌క్షంలేని శాస‌న‌స‌భ ఉంటుందా అని ఆలోచించుకోవాలి. 

అసెంబ్లీకి రాకుండా చంద్ర‌బాబు జీతం తీసుకోలేదా?  

చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉండి అసెంబ్లీకి రాకుండా ఇంటి రెంట్‌, జీతాలు, ఇత‌ర అల‌వెన్సుల‌తోపాటు ఆఖ‌రుకి డీజిల్ డ‌బ్బులు కూడా తీసుకున్నాడు. ఇది నిజ‌మో కాదో ఆయ‌న చెప్పాలి. అసెంబ్లీకి గైర్హాజ‌రు అయినా జీతాలు తీసుకున్నారో లేదో చెప్పాల‌ని ఆర్టీఐ ద్వారా కోర‌డం జ‌రిగింది. దీంతో అసెంబ్లీ సెక్ర‌ట‌రీ న‌న్ను పిలిచి ఆర్టీఐ ద్వారా చేసిన దరఖాస్తును వెన‌క్కి తీసుకోవాల్సిందిగా కోరినా నేను వెన‌క్కి త‌గ్గ‌లేదు. కానీ ఇప్ప‌టికీ దానికి సంబంధించినవివ‌రాలు ఇవ్వ‌డంలేదు. చంద్ర‌బాబు జీతాలు, ఇత‌ర అల‌వెన్సులు, డీజీల్ డ‌బ్బులు తీసుకోక‌పోయుంటే వివ‌రాలు ఇవ్వ‌డానికి ఎందుకు వెనుక‌డుగు వేస్తున్న‌ట్టు చెప్పాలి. 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించరా? 

య‌ర్ర‌గొండ‌పాలెం నియోజక‌వ‌ర్గంలో ఒక అట‌వీశాఖ ఉద్యోగిని ఎమ్మెల్యే కొడితే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి చీమ‌కుట్టిన‌ట్టు కూడా లేదు. గుప్త‌నిధుల కోసం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జిలు అడ‌వుల్లో జేసీబీల‌తో త‌వ్వ‌కాలు చేస్తున్నారు. దీనిమీద స్థానిక ఫారెస్ట్ ఆఫీస‌ర్‌తోపాటు ఇత‌ర అధికారులు ఫిర్యాదు చేశాం. అయినా క‌నీస స్పంద‌న లేదు. రాష్ట్రంలో పంచాయ‌తీల‌ను నిర్వీర్యం చేసి స‌ర్పంచ్ నిధుల‌ను కొల్ల‌గొడుతున్నారు. య‌ర్ర‌గొండ‌పాలెం నియోజ‌క‌వ‌ర్గంలో ఒక పంచాయ‌తీలో రూ.25 లక్ష‌ల స‌ర్పంచ్ నిధులను ఒక్క ప‌ని కూడా చేయ‌కుండానే కాజేశారు. దీనిపై క‌లెక్ట‌ర్‌, డీపీఓకి ఫిర్యాదు చేయ‌డం కూడా జ‌రిగింది. అయినా వారు స్పందించ‌డం లేదు. ఇప్ప‌టికైనా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఓజీ సినిమా మీద పెట్టిన శ్ర‌ద్ధ త‌న శాఖ మీద కూడా పెడితే బాగుంటుంది. 

విలేకరుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానమిస్తూ...

వైయస్ఆర్‌సీపీ అడ్డుకోవ‌డం వ‌ల్లే గ‌త ఐదేళ్లు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ ఆగిపోయిందని సాక్షాత్తు కేంద్ర‌మంత్రి చెప్పారు. కానీ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వేగంగా అడుగులు ప‌డుతున్నాయి. అందులో భాగంగా ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్నా కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు. చంద్ర‌బాబు స‌పోర్టుతో కేంద్రంలో ప్ర‌భుత్వం కొలువుదీరినా ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకునేలా ఆయ‌న పోరాడ‌లేకపోతున్నారు. గ్రామాల్లో స‌చివాల‌యాలు, విలేజ్ క్లీనిక్‌లు, ఆర్బీకే సెంట‌ర్ల ద్వారా సంక్షేమ ప‌థ‌కాల‌ను ఇంటింటికీ అందించిన విజ‌న‌రీ వైయ‌స్ జ‌గ‌న్, దేశంలోనే ఎక్కువ కేసులున్న ప్రిజ‌న‌రీ చంద్ర‌బాబు. సంప‌ద సృష్టిస్తాన‌ని అధికారంలోకి వ‌చ్చి, వైయ‌స్ జ‌గ‌న్ సృష్టించిన సంప‌ద‌ను అప్ప‌నంగా ప్రైవేటు వ్య‌క్తుల్లో చేతుల్లో పెడుతున్నాడు. ఏడాదిన్న‌ర కాకుండానే రూ. 2 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన చంద్ర‌బాబుని విజ‌న‌రీ అంటే జ‌నం న‌వ్వుతున్నారు. చంద్ర‌బాబు నిజంగా విజ‌న‌రీ అయితే గ‌తంలో ఐదేళ్లు, ఇప్పుడు ఏడాదిన్న‌ర పాల‌న‌లో ఎన్ని కంపెనీలు తెచ్చారు, ఎంత సంప‌ద సృష్టించారో చెప్పాలి.

Back to Top