తాడేపల్లి: సీఎం చంద్రబాబు సిగ్గులేకుండా అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను సమర్థించుకుంటూ మాట్లాడారని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఈ రాష్ట్రంలో పేదలకు వైద్య విద్యను, మెరుగైన వైద్యసేవలను దూరం చేస్తున్న దుర్మార్గుడు చంద్రబాబని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ ఎంతో విజన్‌తో శ్రీకారం చుట్టిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తనకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు సిద్దమైన చంద్రబాబు దానినే తన విజన్ అని చెప్పుకోవడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనమని ధ్వజమెత్తారు. వైద్యరంగంలో వైయస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన అన్ని కార్యక్రమాలకు పేర్లు మార్చి, వాటిని తానే ప్రారంభిస్తున్నట్లుగా చంద్రబాబు తన ప్రజెంటేషన్‌లో చెప్పుకోవడాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆక్షేపించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివిధ వర్గాల నుంచి వస్తున్న ఆగ్రహం నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటుందని ఆశించాం. కానీ సీఎం చంద్రబాబు మాత్రం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అమ్మేసేందుకే సిద్దమయ్యారు. ప్రపంచంలో జరిగే ప్రతి దానిని తానే కనిపెట్టానని, సాంకేతికతకు తానే ఆధ్యుడిని అంటూ నిస్సిగ్గుగా చెప్పుకోవడంలో చంద్రబాబు ఆరితేరిపోయాయి. తాజాగా ఆయన అసెంబ్లీలో వైద్యరంగంపై ఇచ్చిన ప్రజెంటేషన్, తన విజన్ అంటూ చేసిన వాగాఢంబరంను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. విజనరీని అని చెప్పుకునే అర్హత చంద్రబాబుకు లేదు ఏ నాయకుడి ఆలోచనలు అయినా ప్రజలకు మేలు చేసేలా ఉంటేనే వారిది విజన్ అంటారు. ఆనాడు స్వర్గీయ వైయస్ఆర్ ప్రజల ఆరోగ్యాల గురించి ఆలోచించి ఆరోగ్యశ్రీని అమలు చేశారు. ఆయన తరువాత వైయస్ జగన్ గారు ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేస్తూ, 95 శాతం కుటుంబాలకు వర్తింపచేస్తూ, 3257 ప్రోసీజర్ల వరకు విస్తరింప చేశారు. పేదవారి ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా ఆయన భావించారు. ఇదీ విజన్ అంటే. పేదల ఇంటికే వైద్యంను చేరువ చేయాలని, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను తీసుకువచ్చారు. ఏకంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకురావాలనే విజన్ వైయస్ జగన్ గారిది. నిత్యం ప్రజలకు ఎలా మేలు చేయాలనే తపన నుంచే ఇటువంటి విప్లవాత్మకమైన నిర్ణయాలతో విజనరీ పాలనను ప్రజలకు పరిచయం చేశారు. అంతేకానీ తాను గొప్ప విజనరీని అని ఆయన చంద్రబాబులా ఎక్కడా చెప్పుకోలేదు. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్‌లోని గణాంకాలను వల్లెవేసిన చంద్రబాబు చంద్రబాబు తన ప్రజెంటేషన్‌లో 2026లో ప్రపంచ జనాభా ఎలా ఉండబోతోంది, 2023, 2047లో ఇండియా ఎలా ఉండబోతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఎలా ఉండబోతున్నాయి. ఇలా గ్లోబల్ డెమోగ్రాఫిక్ అంశాలతో ఆయన ప్రసంగం మొదలు పెట్టారు. ఆయన చెప్పిన గణాంకాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. ఆయన మొత్తం ప్రసంగంలో ఈ రాష్ట్రంలోని ప్రజలు గురించి ఏం చెబుతారని అందరూ ఆశిస్తే, ఆయన రాష్ట్రం గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అర్థమవుతోంది. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ లోని గణాంకాలను చెబుతూ, తాను గొప్ప విజనరీగా ఆ సమాచారాన్ని వెల్లడిస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో వైద్యరంగంలో తీసుకువచ్చిన పెనుమార్పులు, ప్రగతిని చూసి జాతీయ స్థాయిలో ప్రజెంటేషన్స్‌లో మిగిలిన రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. ఈ మార్పుల్లో భాగంగానే ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్‌ను తీసుకువచ్చాం. దేశంలోనే ఆనాడు మా ప్రభుత్వం వైద్యరంగంలో నెంబర్ వన్ స్థానంలో నిలబడింది. రాష్ట్రానికి ఒక మంచి గుర్తింపును సాధించాం. నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల్లో ఆధునిక వసతులు, ఖాళీగా ఉన్న వైద్యులు, వైద్యసిబ్బంది పోస్ట్‌ల భర్తీ, మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైద్య రంగంలో ప్రగతిని సాధించాం. విలేజ్ క్లీనిక్ లను ఏర్పాటు చేసి, గ్రామస్థాయికే మెరుగైన వైద్యంను చేరువ చేశారు. వ్యాధులను నియంత్రణలోకి తేవడం, మెడికల్ సర్వేను నిర్వహించడం, వైద్యసేవలను పొందేందుకు కాల్సెంటర్లను ఇవ్వడం, ఇంటి వద్దకే వైద్యపరీక్షలను తీసుకువెళ్ళడం ఇలా అనేక చర్యలను గత ప్రభుత్వం చేపట్టింది. పబ్లిక్ హెల్త్ రంగంలో ఇవ్వన్నీ వైయస్ జగన్ గారి విజన్ వల్లే సాధించగలిగాం. వైద్యరంగంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలబెట్టిన వైయస్ జగన్ సంజీవని అంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో టెలిమెడిసిన్‌ను చేరువ చేసేందుకు చర్యలు తీసుకున్నాం. స్థానికంగా ఉన్న పీహెచ్‌సీలకు వైద్యం కోసం వెళ్ళిన వారికి మెరుగైన వైద్యం అవసరమని భావిస్తే, వీడియో కాన్ఫెరెన్స్, టెలికాన్ఫెరెన్స్ ద్వారా నిపుణులైన వైద్యులు తక్షణం రంగంలోకి వచ్చి, వైద్యపరమైన సేవలను అందించేలా వ్యవస్థను రూపకల్పన చేశాం. అలాగే 104 ద్వారా టెలి మెడిసన్ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఇంటి నుంచే వైద్య సహయాన్ని అందుకునేలా చర్యలు తీసుకున్నాం. ఈ మొత్తం వ్యవస్థలను ప్రైవేటు వారికి కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్దమయ్యారు. గత ప్రభుత్వం చేపట్టిన సేవలకే కొత్త పేర్లు పెట్టి, వాటిని తానే కనిపెట్టినట్లుగా ఆయన చెప్పుకుంటున్నారు. అలాగే 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ వ్యవస్థను ఆధునీకరించాం. అర్భన్ ఏరియాల్లో కేవలం పదిహేను నిమిషాల్లో, రూరల్ ఏరియాల్లో 20 నిమిషాల్లో, ట్రైబల్ ఏరియాలో 30 నిమిషాల్లో 108 అవసరమైన చోటికి వెళ్ళేలా ఒక గొప్ప వ్యవస్థను వైయస్ జగన్ గారు అమలులోకి తీసుకువచ్చారు. నిన్ననే ఏజెన్సీలో ఒక గర్భిణీకి అత్యవసరంగా వైద్యం అందించేందుకు 108 సకాలంలో చేరుకోకపోవడం, ఆటోలో ఆమెను తీసుకువచ్చే క్రమంలోనే ఆమె బిడ్డను ప్రసవించి, ఆ బిడ్డను కోల్పోవడం వంటి బాధాకరమైన ఘటన జరిగింది. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం కాదా? ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఖరీదైన వైద్యంను చేరువ చేసి ఆనాడు స్వర్గీయ వైయస్ఆర్, ఆ తరువాత వైయస్ జగన్ చేసిన కృషితో ఎందరో పేదల ప్రాణాలను కాపాడారు. పేదలకు ఎక్కువగా వస్తున్న జబ్బులు ఏమిటీ? ఇంకా ఎలాంటి వైద్య సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని వైయస్ జగన్ సర్వే నిర్వహించారు. ఆర్యోగశ్రీ కింద రూ.5 లక్షల వరకు ఉన్న పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. దీనిని కూడా తానే చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం 1.43 కోట్ల కుటుంబాలకు అంటే దాదాపు 95 శాతం జనాభాకు ఆరోగ్యశ్రీని వర్తింప చేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం 1.63 కోట్ల కుటుంబాలకు అంటే దాదాపు నూరుశాతం జనాభాకు మేం ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఇందులో బీపీఎల్ కింద 1.43 కుటుంబాలు ఉంటే, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మరో 20 లక్షల ఏపీఎల్ కుటుంబాలను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువచ్చామని చెబుతున్నారు. దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్న వారు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి, వైద్యసేవలు అందుకుంటారా? వారిని బలవంతంగా ఆరోగ్యశ్రీ కింద తీసుకువచ్చి నూరుశాతం జనాభాకు ఆరోగ్యశ్రీ సేవలు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్ళని ధనవంతులు ఇరవై లక్షల మందికి కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ తో టైఅప్ చేసుకున్న బీమా కంపెనీలకు ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తోంది. ఇది వృధా కాదా? దీని వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల అవినీతి లేదా? ప్రజాధనంను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం వెనుక ఈ ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి ఏమిటో చెప్పాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మేసుకుంటున్నారు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైయస్ జగన్ ప్రభుత్వం సరైన విధంగా నిధులను కేటాయించలేక పోవడం వల్ల, వాటిని కూటమి ప్రభుత్వం 33 ఏళ్ళకు ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇస్తోందని చంద్రబాబు చెప్పుకోచ్చారు. వైయస్ జగన్ చేసిన మంచిపైన విషం చిమ్మే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వైద్యవిద్యను చదవాలనుకున్న పేదల ఆకాంక్షలపై నీళ్ళు జల్లుతున్నారు. తనకు కావాల్సిన వారికి కాలేజీలను కట్టబెట్టేందుకు సిద్దమయ్యారు. 1923లో మొదటి ప్రభుత్వ మెడికల్ కాలేజీ అందుబాటులోకి వచ్చింది. ఆ తరువాత దాదాపు వందేళ్ళ తరువాత 2023లో సీఎం వైయస్ జగన్ ఈ రాష్ట్రంలో ఏకంగా 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించి కొత్త చరిత్రను సృష్టించారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలనే గొప్ప సంకల్పంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. వీటికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలను నిర్మించి, పేదలకు మెరుగైన వైద్యంను అందించేందుకు ఆయన తొలి అడుగు వేశారు. ఈ మంచి ప్రయత్నాలను కూడా సీఎంగా చంద్రబాబు నాశనం చేస్తున్నారు. తనకు కావాల్సిన వారికి ఈ ఆసుపత్రులను అప్పగించేందుకు తెగబడ్డారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కూటమి నాయకులు ఏం మాట్లాడారో ఈ సందర్భంగా వారికి సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తున్నాం. 'కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకు మెడికల్ సీట్లను అందిస్తాం, గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 108 ను మొదటి వంద రోజుల్లో రద్దు చేస్తామని' నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఆ హామీని ఎందుకు అమలు చేయలేకపోయారో నారా లోకేష్ చెప్పాలి. వైయస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీఓ నిజంగా మంచిది కాకపోతే ఎందుకు రద్దు చేయలేదు? కనీసం జీఓలో సవరణలకు కూడా తేలేకపోయారు. మరోవైపు ప్రైవేటుపరం చేసేందుకు సిద్దమయ్యారు. 2023లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన వైయస్ జగన్ వైయస్ జగన్ గారు సీఎంగా మే 31, 2021న కోవిడ్ పరిస్థితుల్లో ఒకేసారి 14 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వర్య్చువల్గా శంకుస్థాపన చేశారు. తరువాత మిగిలిన కాలేజీల పనులకు కూడా శ్రీకారం చుట్టారు. గత రెండేళ్ళలో యుద్దప్రాతిపదికన పనులు నిర్వహించి 2023న అయిదు కాలేజీలను సీఎంగా వైయస్ జగన్ ప్రారంభించారు. రెండోదశలో మరో అయిదు కాలేజీల పనులు పూర్తి చేసి, తరగతులు ప్రారంభించాలని చూశాం. ఈ లోగా ఎన్నికల ప్రక్రియ రావడం, మేం ఓటమి పాలయ్యాం. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శ్రద్దతీసుకుని ఉంటే మదనపల్లి, పాడేరు, ఆదోని, మార్కాపురం, పులివెందుల కాలేజీల్లో పనులు పూర్తయ్యి, తరగతులు మొదలయ్యేవి. వాటిపై దృష్టి సారించకుండా, వైయస్ఆర్సీపీ మీద ఫేక్ గ్రాఫిక్స్‌తో ఫేక్ ప్రచారానికే పరిమితమయ్యారు. మూడోదశలో మిగిలిన పిడుగురాళ్ళ, అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం కాలేజీలను పూర్తి చేసే ఉద్దేశం వారిలో కనిపించడం లేదు. మేం ప్రారంభించిన అయిదు మెడికల్ కాలేజీలు విజయనగరం నాబార్డ్ నుంచి రూ.500 కోట్లు, రాజమండ్రి కాలేజీని సెంట్రల్ స్పెషల్ అసిస్టెన్స్ ఫండ్స్ రూ.475కోట్లు, ఏలూరు కాలేజీకి సెంట్రల్ స్పెషల్ అసిస్టెన్స్ ఫండ్ రూ. 525 కోట్లు, మచిలీపట్నం కాలేజీకి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం కింద రూ. 550 కోట్లు, నంధ్యాల కాలేజీకి సెంట్రల్ స్పెషల్ అసిస్టెన్స్ ఫండ్ రూ.475 కోట్లు టైఅప్ చేశాం. రెండోదశలో పూర్తి చేయాల్సిన పాడేరు కాలేజీకి సెంట్రల్ స్పెషల్ అసిస్టెన్స్ ఫండ్ రూ.500 కోట్లు, మార్కాపురంకు నాబార్డ్ నిధులు రూ.475 కోట్లు, మదనపల్లి కాలేజీకి నాబార్డ్ నిధులు రూ.475 కోట్లు, పులివెందులకు నాబార్డ్ నుంచి రూ.500 కోట్లు, ఆదోనికి నాబార్డ్‌తో రూ.475 కోట్లతో టై అప్ చేశాం. ఇక మూడోదశలో నిర్మించే కాలేజీలకు గానూ పిడుగురాళ్ళకు సెంట్రల్ స్పెషల్ అసిస్టెన్స్ ఫండ్ రూ.500 కోట్లు, అమలాపురంకు నాబార్డ్ తో రూ.475 కోట్లు, బాపట్లకు నాబార్డ్‌తో రూ.505 కోట్లు, పెనుగొండకు నాబార్డ్‌తో రూ.475 కోట్లు, నర్సీపట్నంలో నాబార్డ్‌తో రూ.500 కోట్లు, పాలకొల్లు కాలేజీకి నాబార్డ్‌తో రూ.475 కోట్లు, పార్వతీపురం నాబార్డ్‌తో రూ.600 కోట్లతో టైఅప్ చేయడం జరిగింది. అన్నీ కాలేజీలకు దాదాపు యాబై ఎకరాలకు పైగా భూమి, నిర్మాణ వ్యయం కింద రూ.8480 కోట్లుతో చక్కని ప్రణాళికతో మెడికల్ కాలేజీల నిర్మాణంకు ప్రభుత్వం సిద్దమైంది. దీనిని అమలు చేయకుండా, ప్రైవేటు వారికి ఇవ్వాలనుకోవడంలో మీ అవినీతి లేదా? వీటిని పూర్తి చేస్తే వైయస్ జగన్ గారికి పేరు వస్తుందనే కుట్రతోనే పనిచేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ఎయిమ్స్ కూడా దాదాపు పదేళ్ళపాటు సిద్దార్థా మెడికల్ కాలేజీలో నడిపారు. ప్రభుత్వరంగంలో నిర్మించే మెడికల్ కాలేజీలను కూడా దశలవారీగా పూర్తి చేసుకోవాలే తప్ప, ఆర్థికంగా భారం అంటూ ప్రైవేటువారికి అప్పగిస్తారా? సింగిల్ టెండర్‌తో కావాల్సిన వారికే మెడికల్ కాలేజీ ధారాదత్తం 2018, మార్చి 6న కేంద్ర వైద్య, కుటుంబ ఆరోగ్యశాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లో రాష్ట్రాల్లో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం కింద అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు దీనిపై స్పందించలేదు. కొత్తగా ఒక్క మెడికల్ కాలేజీని అయినా రాష్ట్రంలో నిర్మిద్దామని అనుకోలేదు. వైయస్ జగన్ గారు అధికారంలోకి వచ్చిన తరువాత 17 మెడికల్ కాలేజీలను తెచ్చే ప్రయత్నం ప్రారంభించారు. దీనిని ఓర్వలేకపోతున్నారు. కొత్త కాలేజీలకు అనుగుణంగా అన్ని ఆసుపత్రులు, వసతులు ఉన్నా కూడా చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా దీనిని పట్టించుకోవడం లేదు. ప్రైవేటుపరం చేసేందుకు పిలిచిన టెండర్ నోటిఫికేషన్లో సింగిల్ బిడ్ వచ్చినా కూడా టెండర్ ప్రాసెస్ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. అంటే దీనిలో ఎక్కడా పారదర్శకత లేదు. వారికి కావాల్సిన వారితోనే టెండర్ వేయించి, వారికే దానిని అప్పగిస్తారు. వైయస్ జగన్ హయాంలో సింగిల్ టెండర్ విధానాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. కాలేజీ సీట్ల ఫీజులను కూడా భారీగా పెంచారు. ప్రైవేటువారిని ఆకర్షించడానికే పెంచామని చెబుతున్నారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.... - కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు కాలేజీ పనులను అర్థాంతరంగా నిలిపివేయాలని సేఫ్ క్లోజ్ పేరుతో లెటర్ ఇచ్చారు. నిధుల కొరత లేకుండా గత ప్రభుత్వం వివిధ కేటగిరిల నుంచి ఫండ్ టైఅప్ చేసినా కూడా దానిని పట్టించుకోకుండా, ప్రభుత్వంపై ఆర్థిక భారం అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. - మళ్ళీ మా ప్రభుత్వ రాగానే ఈ ప్రైవేటీకరణను రద్దు చేస్తాం. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన లీజులను రద్దు చేస్తాం. ప్రైవేటురంగంలో మెడికల్ కాలేజీల నిర్వహణ ఎక్కడా విజయవంతం కాలేదు.