గుంటూరు: రావిపాటివారిపాలెం గ్రామానికి చెందిన చిన్నారులపై అసభ్యకరంగా ప్రవర్తించిన శ్యామూల్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కూటమి ప్రభుత్వాన్ని ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త బాలసాని కిరణ్‌కుమార్ ప్రశ్నించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రావిపాటివారిపాలెం గ్రామానికి చెందిన చిన్నారులను ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులు, స్థానికంగా ఉన్న గ్రామ ప్రజలతో మాట్లాడారు. వారికి న్యాయం చేసే వరకూ పోరాడతానని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం, రక్షణ గాలికి వదిలేసి ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవటంలో బిజీగా ఉందని ధ్వజమెత్తారు. ఏడాదిన్నర కాలంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు నిత్యం జరుగతూనే ఉన్నాయని, మహిళలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులపై వాసిమళ్ల శ్యామూల్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించినా కనీసం నియోజకవర్గ ఎమ్మెల్యేకు చీమ కుట్టినట్టయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రజల ఇబ్బందులను పట్టించుకోలేని ఎమ్మెల్యే ఉన్నా.. లేకున్నా ఒకటేనన్నారు. అసాంఘీక శక్తులకు ఎమ్మెల్యే అండ ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి అండగా ఉంటున్నారని బాలసాని కిరణ్‌కుమార్ మండిపడ్డారు. చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవటం గానీ, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు గానీ ఎమ్మెల్యేకు సమయం లేకపోవటం చూస్తే కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు పేదలు, ప్రజలంటే ఎంత చిన్నచూపో అర్థమవుతుందన్నారు. మహిళలు, ముక్కు పచ్చలారని చిన్నారులపై సైతం అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని కఠినం గా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి నేతల తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తగిన బుద్ధి చెబుతారని కిరణ్‌కుమార్ హెచ్చరించారు.