ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోరా!

కూట‌మి ప్ర‌భుత్వ తీరుపై మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఫైర్‌

రోడ్డు ప్ర‌మాద మృతుల పార్ధీవ‌దేహాల‌కు నివాళులు

బాధిత కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

నెల్లూరు జిల్లా:  ఇసుక మాఫియా కార‌ణంగా అమాయ‌క ప్ర‌జ‌ల ప్రాణాలు పోతున్నా..ప‌ట్టించుకోరా అంటూ నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. నెల్లూరు నగరం 16వ డివిజన్ లోని గుర్రాలమడుగు సంగంలో పెరమన వద్ద ఈ నెల 17న‌ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి పార్ధీవదేహాలను కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిలు సందర్శించి, పూల‌మాల‌లు వేసి నివాళులర్పించారు. అనంత‌రం బాధిత కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు. ఈ  కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. `సంగం మండలం, పెరుమన దగ్గర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం దురదృష్టకర సంఘటన.  రోడ్డు ప్రమాదాలు సాధారణంగా దురదృష్టకర పరిస్థితిలో సంభవిస్తాయి కానీ, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు గాలిలో కలిసి పోవ‌డం బాధాక‌రం. ఇసుక అధిక లోడుతో ఉన్న ట్రిప్పర్ రాంగ్ రూటులో అతి వేగంతో కారును ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందడం విచార‌క‌రం. నెల్లూరు జిల్లాలో పగలు, రాత్రి తేడా లేకుండా, అక్రమంగా ఇసుకను అతివేగంతో భారీ వాహనాలతో త‌ర‌లిస్తూ ఎంతోమంది ప్రాణాలను తీస్తున్నా..అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.  

పెరుమన దగ్గర ఇసుక అధికలోడుతో ఉన్న ట్రిప్పర్ రాంగ్ రూట్లో రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరు అవుతున్నారు.  మరణించిన వారి కుటుంబాల గోడు వర్ణాణాతీతం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, తెలుగుదేశం పార్టీ నాయకుల అవినీతి సంపాదన కోసం ఎన్ని కుటుంబాలు బలి తీసుకుంటారు.  నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా వల్ల ఇలాంటి ప్రమాదాలు కోకొల్లలుగా జరుగుతున్నాయి.  అధికార పార్టీ నేతలు ఉచిత ఇసుక పేరుతో అధిక రేట్లతో అనధికారకంగా ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.  అక్రమ ఇసుక దోపిడీయే ధ్యేయంగా కూటమినేతలు పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో సోమశిల నుండి నీరు విడుదల చేస్తే విరువూరు ఇసుక రీచ్ నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు నీటిలో చిక్కుకొని మునిగిపోయిన పరిస్థితులు.  

ఎస్పీ  స్పందించి అక్రమ ఇసుక, గ్రావెల్ త‌ర‌లిస్తూ అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్పీ  రాగద్వేషాలకతీతంగా, పారదర్శకంగా, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. పోలీసులు టిప్పర్ తోలిన డ్రైవర్ పైనే కాకుండా, ఈ ప్రమాదానికి కారణంగా భావించే అధిక లోడు ఇసుకను తరలిస్తున్న వ్యక్తులను, వాహన  యజమానిపై కూడా కేసు నమోదు చేయాలి. సీసీ ఫుటేజీల ఆధారంగా నిజానిజాలు తేల్చలే తప్ప, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి, కేసును నీరుగార్చే ప్రయత్నం చేయొద్దు. ప్ర‌మాదంలో చ‌నిపోయిన‌ ఒక్కొక్క కుటుంబానికి రూ.25 లక్షల ప‌రిహారం ప్ర‌భుత్వం వెంట‌నే చెల్లించాలి. మరో 25 లక్షలు ప్రమాదానికి కారణమైన వారి నుండి బాధిత కుటుంబాలకు అందించి, ఆదుకోవాలి` అని కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి డిమాండ్ చేశారు. 

Back to Top