తాడేపల్లి: సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్రరెడ్డి(కుంచాల సౌందరరెడ్డి) అక్రమ అరెస్టును ఏపీ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ కేసును సీబీఐ సుమోటోగా స్వీకరించి విచారణ చేయాలని, వచ్చే నెల 13వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సవీందర్రెడ్డి కేసులో తాడేపల్లి పోలీసులు హైకోర్టుకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆయన్ని అరెస్టు చేసిన సమయంపై రిమాండ్ రిపోర్టులో తప్పుడు సమాచారం పొందుపర్చారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 7గం. సమయంలో అదుపులోకి తీసుకున్నామని అందులో పేర్కొన్నారు. అయితే.. ఆయనను సాయంత్రం 4.30గంటలకే అరెస్టు చేసినట్లు సవీంద్ర రెడ్డి తరఫు లాయర్ సీసీటీవీ ఫుటేజ్‌ను కోర్టుకు సమర్పించారు. దీంతో పోలీసులు చెబుతున్న విషయంపై అనుమానాలు వ్యక్తం చేసిన హైకోర్టు .. ఆ వీడియోపై ప్రశ్నలు గుప్పించింది. ఈ వ్యవహారంలో అనుమానాలు ఉన్నాయిని.. పేర్కొంటూ సీసీటీవీ ఫుటేజీతో పాటు ఎక్కడ, ఎప్పుడు అరెస్ట్ చేశారో పూర్తి దర్యాఫ్తు చేసి నివేదిక ఇవ్వాలని మంగళగిరి కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం లోపు ఈ వివరాలను తెలియజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలంటూ ఆదేశించింది. ఇవాళ మంగళగిరి కోర్టు నివేదికను హైకోర్టుకు ఆదేశించడంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. తప్పుదోవ పట్టించిన పోలీసులు ముందు నుంచీ పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టాంచారని సవీంద్ర తరఫు లాయర్ పేర్కొంటున్నారు. 23వ తేదీ సాయంత్రం 7:30కు అరెస్ట్ చేశామని పోలీసులు కోర్టుకు తెలిపారు. 6:30కు అరెస్ట్ చేశారని నిందితుడు చెబుతున్నారు. కన్ఫెషన్ రిపోర్టులో 7:30కు అరెస్ట్ చేసినట్లు రాశారు. రిమాండ్ రిపోర్టులో మాత్రం 8:30కు అరెస్ట్ చేసినట్లు రాశారు. ప్రత్తిపాడు పోలీసులు అరెస్ట్ చేసినట్లు కోర్టుకు తెలిపారు. లాలాపేట ఎస్ హెచ్ వో శివప్రసాద్ అరెస్ట్ చేసినట్లు స్పష్టంగా ఉంది. 7 గంటలకు సవీంద్రరెడ్డి సతీమణి తాడేపల్లి పీఎస్ కు వచ్చినట్లు సీసీటీవీలో ఉంది. పోలీసులు చెప్పేదానికి, నిందితుడు చెబుతున్న దానికి పొంతన లేకపోవడంతో హైకోర్టు ఈ కేసును సీబీఐ సుమోటోగా స్వీకరించి విచారణ చేయాలని ఆదేశించింది.