తిరుపతి: పవిత్రమైన ఆలయాల జీర్ణోదరణ కోసం నిర్ధేశించిన శ్రీవాణి ట్రస్ట్‌పై చంద్రబాబు రెండు నాలుకల దోరణితో మాట్లాడుతున్నారని మాజీ టీటీడీ బోర్డ్ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి లోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైయస్ఆర్‌సీపీ హయాంలో శ్రీవాణి ట్రస్టు గురించి ఆధారాలు లేకపోయినా తాము అధికారంలోకి వస్తే సీబీఐ విచారణ చేయిస్తానని చంద్రబాబు అనేకసార్లు మాట్లాడారని గుర్తు చేశారు. అదే చంద్రబాబు సీఎంగా ఇప్పుడు అందుకు భిన్నంగా శ్రీవాణి ట్రస్టును తానే ఏర్పాటు చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చిన నిధులతో దేశవ్యాప్తంగా 3500 ఆలయాలను నిర్మించడమే కాకుండా 300 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ బాధ్యతలు టీటీడీ తీసుకుందని వివరించారు. అలాంటి ట్రస్టును అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నాంటే... ● నాడు శ్రీవాణి ట్రస్టుపై సీబీఐ విచారణ చేయిస్తామన్నారు: వైయస్ఆర్‌సీపీ హయాంలో వైయస్ జగన్ గారు సీఎంగా ఉన్నంత కాలం శ్రీవాణి ట్రస్టుపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు నిరంతరం విషం చిమ్మారు. శ్రీవాణి ట్రస్టు అంతా అవినీతిమయంగా మారిందని, ఆ ట్రస్టు ద్వారా వచ్చిన సొమ్మంతా తాడేపల్లికి తరలిపోయేదని, రూ.10 వేల టికెట్‌లో రూ.500 టీటీడీకి వస్తాయని, మిగతావి వైయస్ఆర్‌సీపీ నాయకులే మింగేస్తున్నారని అత్యంత నీచంగా ప్రచారం చేశారు. ఇప్పుడు వారు చేసిన ప్రచారంలో దేనికీ ఒక్క ఆధారం చూపించలేదు. ● వైయస్ జగన్ ఆలోచనతోనే శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు మా నాయకులు వైయస్ జగన్ గారు సీఎంగా ఉన్నంత కాలం శ్రీవారి ఆలయ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా ఇంకా పెంచాలనే లక్ష్యంతోనే పనిచేశారు. అందుకోసం ఏం చేస్తే బాగుంటుందని అధికారంలోకి రాగానే మా అందరితోనూ చర్చించారు. టీటీడీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వేంకటేశ్వరస్వామి, లేదా హిందూ దేవాలయాలను నిర్మించాలని సూచించడంతో ఆ విధంగా ఐదేళ్ల ప్రణాళికలు రూపొందించాం. కొండ మీద లక్ష రూపాయలు మించి డబ్బు ఇచ్చిన వారికే స్వామివారి దర్శనంలో ప్రాధాన్యత ఇస్తున్నారని, అంత చెల్లించుకోలేని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాలు స్వామి వారిని దర్శించుకునేలా ఏం చేస్తే బాగుంటుందని అడిగారు. ఆయన ఆదేశాలతోనే రూ.10 వేలు చెల్లించిన వారికి శ్రీవెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి ట్రస్టు) ద్వారా దర్శన భాగ్యం కల్పించే ఆలోచన చేశారు. ఆ విధంగా శ్రీవాణి ట్రస్టు ఏర్పాటైంది. ఆ నిధులతోనే దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక శ్రీవాణి ట్రస్టు ఆలోచన తానే చేశానని సీఎం చంద్రబాబు చెప్పుకుంటున్నాడు. 2024 లో వైయస్ జగన్ మళ్లీ సీఎం అయి ఉంటే ఈ ఐదేళ్లలో దేశవ్యాప్తంగా లక్ష శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించేవారని ఎలాంటి అనుమానం లేకుండా చెప్పగలను. కానీ చంద్రబాబు హయాంలో వేలాదిగా హిందూ దేవాలయాలను నేలమట్టం చేశారు. వైయస్ జగన్ సీఎం అయిన 2019 నుంచి నేటి వరకు శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ. 2038 కోట్ల నిధులు సమకూరాయి. ● ఏఐతో స్వామివారి దర్శనం ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధం సీఎం చంద్రబాబు రంగనాయకుల మండపంలో తనను తాను పొగుడుకుంటూ శ్రీవాణి ట్రస్టు ద్వారా దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని కొత్తగా సూచనలు చేస్తున్నారు. అన్ని రాష్ట్ర రాజధానుల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మిస్తామని చంద్రబాబు తన ప్రసంగంలో చెప్పారు. కానీ వైయస్ జగన్ హయాంలోనే శ్రీనగర్ లో శ్రీవాణి ట్రస్టు నిధుల ద్వారా శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం జరిగింది. నవీ ముంబయిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని తలచి నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి స్వయంగా వైయస్ జగన్ ఫోన్ చేసి స్థలం ఇవ్వాలని అడిగితే దాదాపు రూ. వెయ్యి కోట్ల విలువైన స్థలాన్ని టీటీడీకి కేటాయించారు. అలాగే భువనేశ్వర్, విశాఖలో కూడా పెద్ద పెద్ద శ్రీవారి ఆలయాలను వైయస్ఆర్‌సీపీ హయాంలోనే శ్రీవాణి ట్రస్టు నిధులతో నిర్మించాం. గంటకు 4500 మందికి దర్శనం చేయించడమే గగనమైపోతుంటే, ఏఐ ద్వారా గంటకు 5500 మందికి దర్శనం చేయించాలని చంద్రబాబు ఆదేశాలిస్తున్నాడు. గర్భ గుడి లోపల ఇలాంటి టెక్నాలజీ వాడకూడదని ఆగమ శాస్త్ర నిబంధనలు చెబుతున్నాయని తెలిసి కూడా చంద్రబాబు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో ఆయనకే తెలియాలి. వ్యయప్రయాసలకోర్చి వేల కిమీల దూరం నుంచి వచ్చిన భక్తులు స్వామి వారిని చూసి సంతృప్తి చెందాలా లేదా అనేది ఆలోచించరా అని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి ఏఐ టెక్నాలజీతో సులభ దర్శనం చేయిస్తానని చెబుతున్నాడు. సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేసుకునే పవన్ కళ్యాణ్ శ్రీవారి ఆలయం మంచి చెడ్డల గురించి పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. అధికారంలోకి వస్తానే శ్రీవారి ట్రస్టును రద్దు చేస్తానని చెప్పిన నేటి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, నాడు మా హయాంలో శ్రీవాణి ట్రస్టు ద్వారా రోజుకి వెయ్యి టికెట్లు ఇస్తుంటే, ప్రస్తుతం ఆ సంఖ్యను 1500లకు పెంచేశారు. ఇక మీదట ఆ సంఖ్యను 2వేలకు పెంచాలని బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నది కూడా ఆయనే. ● జర్నలిస్ట్ ప్రశ్నలకు సమాధానాలు దివంగత వైయస్సార్ దయాదాక్షిణ్యాలతోనే ఇంట్లో కాల్పులు జరిగిన కేసు నుంచి బాలకృష్ణ బయటపడ్డాడు. నేడు బాలకృష్ణ ఆ కృతజ్ఞత లేకుండా ఆయన తనయుడు వైయస్ జగన్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడటం చాలా తప్పు. అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటలు చూస్తుంటే సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. ఆయన బాడీ లాంగ్వేజ్ చూసిన చాలా మంది బాలకృష్ణకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయించాలని అభిప్రాయపడ్డారు. దేన్నయితే ఉక్కుపాదంతో అణచివేస్తానని చంద్రబాబు చెబుతారో ఆయన హయాంలో ఆ కార్యక్రమం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. గ్రానైట్ అక్రమ తవ్వకాలు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో నిత్యకళ్యాణం పచ్చ తోరణం అన్నట్టు సాగుతోంది. గంజాయిని ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. కుప్పంలో జనసేన కార్యకర్త నుంచి వంద కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరి పంట మానేసి గంజాయి వ్యాపారం చేసుకుంటే మంచి ఆదాయం వస్తుందని చంద్రబాబు చెప్పకనే చెబుతున్నాడు.