తిరుపతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించిన జీవోను వెనక్కి తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ తిరుపలి జిల్లా లీగల్ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం తిరుపతిలో జాయింట్ కలెక్టర్‌కు లీగల్ సెల్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్ర, ఐసిఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..`గత ఐదేళ్ల వైయస్ఆర్‌సీపీ పాలనలో రూ.8,500 కోట్ల వ్యయంతో వైయస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి 5 కాలేజీలను పూర్తి చేశారు. వాటిల్లో అడ్మిషన్లు పూర్తయ్యి క్లాసులు జరుగుతున్నాయి. ఎన్నికల నాటికి పూర్తయిన పాడేరు మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభించింది. మా నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మీద కక్షతో పులివెందుల మెడికల్ కాలేజీని మాత్రం ప్రారంభించకుండా ఎన్ఎంసీ సీట్లు కేటాయించినా వద్దని లేఖరాశారు. వీటితోపాటు రెండో దశలో ప్రారంభంకావాల్సిన మరో 3 మెడికల్ కాలేజీలు 90 శాతం పనులు పూర్తయినా, కూటమి ప్రభుత్వం వచ్చాక 15 నెలలుగా పెండింగ్ పనులను పూర్తి చేయకుండా పక్కనపెట్టేశారు. మూడో దశలో పూర్తి చేయాల్సిన కాలేజీలు సైతం పిల్లర్ల దశలో ఉన్నాయి. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి కూడా పనులన్నీ ప్రణాళిక ప్రకారం శరవేగంగా జరుగుతుండేవి. మెడికల్ కాలేజీలు పూర్తయితే వైయస్ జగన్‌కి మంచి పేరు వస్తోందన్న కుట్రతో ప్రారంభించకుండా సేఫ్ క్లోజర్ పేరుతో మూసేసిన నీచ చరిత్ర చంద్రబాబుది. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలని కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. కాలేజీల నిర్మాణం నిధుల కొరత కారణంగా ఆగిపోకూడదన్న ఉద్దేశంతో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, నాబార్డు నిధులు వచ్చేలా టైఅప్ చేసుకున్నారు. పేదల వైద్యం ప్రభుత్వ బాధ్యతగా భావించి వైయస్ జగన్ అంత గొప్పగా ఆలోచించి ముందుచూపుతో వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు వాటిని పీపీపీ పేరుతో పప్పు బెల్లాలకు తన వారికి కట్టబెట్టేందుకు సిద్దమయ్యారు. 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటువ్యక్తుల చేతుల్లో పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు, ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ప్రజారోగ్యం గురించి ఆలోచించకుండా, మెడిసిన్ చదివి డాక్టర్ కావాలని కలలు కంటున్న పేద విద్యార్థుల ఆశలను చిదిమేస్తూ దోపిడీయే ధ్యేయంగా సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నాడు` అని లీగల్ సెల్ నాయకులు విమర్శించారు.