ఉత్సవాల పేరుతో అడుగడుగునా అధికార పార్టీ దోపిడీ

డొనేషన్ల పేరుతో రూ.70 కోట్ల వసూళ్లు 

విజయవాడ ఉత్సవాల్లో అధికార పార్టీ దోపిడీపై ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆగ్రహం  

తాడేపల్లి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్.

కూటమి పాలనలో పండగ నాడు కూడా సంతోషంగా లేని ప్రజలు

ఇచ్చిన హామీలు అమల్లో విఫలమైన ప్రభుత్వం

నిర్లక్ష్యానికి గురైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు

మా పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారంటూ చంద్రబాబు పచ్చి అబద్దాలు

చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తిన దేవినేని అవినాష్

విజయవాడ ఉత్సవాల పేరుతో అధికార పార్టీ నేతల దోపిడీ 

డోనేషన్ల పేరుతో దాదాపు రూ.70 కోట్లు దండుకున్నారు

ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి పోయింది?

కూటమి నేతలను నిలదీసిన దేవినేని అవినాష్

తాడేప‌ల్లి:  కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాక రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... సీఎం చంద్రబాబు మాత్రం తమ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారంటూ అబద్దాలు చెబుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విజయవాడ ఉత్సవాల పేరుతో కూటమి నేతలు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారని..  ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోయిందే చెప్పాలని నిలదీశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... 

● చంద్రబాబు పచ్చి అబద్దాలు...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతే తొలిసారి ఉత్సవాలు జరుగుతున్నట్టు.. సంబరాలు చేసుకోవడం ఇదే మొదటిసారి అన్నట్టు చంద్రబాబు తన ప్రసంగంలో బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏ రకంగా సంతోషంగా ఉన్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అమలు చేశారా? ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించారా? అధికారంలోకి రాగానే ప్రతి మహిళకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని కూడా విస్మరించారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగభృతి ఇస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేదు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న హామీ కూడా పూర్తి చేయలేదు. రైతులు, మహిళలు, విద్యార్ధులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఒకవైపు సంక్షేమకార్యక్రమాలు లేక, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... చంద్రబాబునాయుడు మాత్రం సంవత్సరం ఐదు నెలల క్రితం రాష్ట్రంలో విధ్వంసం ఉండేది, ఎవరూ సంతోషంగా లేరు, నేను వచ్చిన తర్వాత అందరూ సంతోషంగా ఉన్నారంటూ పచ్చి అబద్దాలు చెబుతున్నారు. 

● వైయస్ జగన్ హయాంలో సుభిక్షంగా ప్రజలు....

నిజానికి వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో దసరా, సంక్రాంతి, ఉగాది ఏ పండగ వచ్చినా ప్రభుత్వం ఆర్ధికంగా అండగా ఉండడంతో ప్రజలు సంతోషంగా ఉండేవారు. ఆయా పండగల సమయానికి సంక్షేమ పథకాలు క్రమం తప్పకుండా ప్రజలకు అందేవి. ప్రధానంగా విజయవాడ నగరంలో అయితే వైయస్.జగన్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి పనులపై ప్రజలు గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండేది. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవెంట్ మేనేజిమెంట్ మినహా రాష్ట్రంలో పాలన అన్నది లేకుండా పోయింది. రాష్ట్రంలో విద్య పరంగా కానీ, వైద్యం పరంగా గాని, లా అండ్ ఆర్డర్ పరంగా కానీ ఎవరైనా సంతోషంగా ఉన్నారా? వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందిలేకుండా పాలన అందించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో పాటు కొత్తగా సోషల్ మీడియా కేసులుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గతంలో అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ హిట్ అని సొంత డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేశారు. తాజాగా విజయవాడ ఉత్సవాలనూ చంద్రబాబు తన గొప్పలు చెప్పుకోవడానికే ఉపయోగించుకున్నారు.  మహిళలకు ఉచిత బస్సు అమలు చేయడం వల్ల అమ్మవారి దర్శనానికి వచ్చారని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి దశాబ్దాలగా ఉమ్మడి రాష్ట్రం సైతం దుర్గమ్మ దర్శనానికి మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలు, దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు దర్శనానికి  వస్తుంటారు. కానీ మీరు ఉచిత బస్సు పథకం ఇవ్వడం వల్ల పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారని చెప్పుకోవడం సిగ్గుచేటు. 

● ఉత్సవాల పేరుతో దోపిడీ...

గతంలో ఎప్పుడూ లేనంతగా ఉత్సవాలు నిర్వహించామని కూటమి నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఉత్సవాలు ప్రతిఏటా జరగడం ఆనవాయితీ. ఇవాళ కూటమి ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదు. ఉత్సవాల పేరుతో అధికార పార్టీ ఎంపీ, కూటమి నేతలు భారీ దోపిడీకి వేసిన స్కెచ్ ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడింది. ఉత్సవాల పేరుతో మచిలీపట్నం గొడుగు వేంకటేశ్వర స్వామికి చెందిన రూ.450 కోట్ల విలువైన దాదాపు 40 ఎకరాల భూములను కాజేయడానికి మీరు ప్రయత్నించిన మాట వాస్తవం కాదా? దేవాదాయశాఖ భూములను ఏదొక విధంగా తీసుకుని అందులో హోటల్స్, మల్టీప్లెక్స్, గోల్ఫ్స్ కోర్టు నిర్మాణం పేరుతో పంచుకోవడానికి మీరు ప్లాన్ చేసిన మాట వాస్తవం కాదా? కేవలం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం వల్లే అది ఆగింది.

● దోచుకున్న డబ్బెవరి జేబుల్లోకి పోయింది?... 

 మరోవైపు ఉత్సవాలు పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మెడికల్ అసోసియేషన్, హాస్పిటల్స్, హోటల్స్ అసోసియేషన్ల నుంచి  విజయవాడ ఎంపీ, అతని మనుషులు వైబ్రెంట్ విజయవాడ పేరుతో కోట్లాది రూపాయులు వసూలు చేసారు. దాన్ని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ వ్యాపారం సక్రమంగా సాగడం లేదు, డొనేషన్ల పేరుతో ఇబ్బంది పెట్టొద్దని మొత్తుకున్నా... వారిని వదిలిపెట్టలేదు. డొనేషన్లు ఇవ్వకపోతే ప్రభుత్వం వైపు నుంచి జీఎస్టీ అధికారులతో దాడులు చేయించి ఇబ్బందికి గురిచేస్తామని బెదిరించిన మాట వాస్తవం కాదా? ఇందులో ఎంపీ, టీడీపీ నేతలందరూ ఈ బలవంతపు వసూళ్లలో భాగస్వాములే. దాదాపు రూ.70 నుంచి రూ.100 కోట్లు ఇలా అక్రమంగా వసూళ్లు చేశారు. దోచుకున్న డబ్బులున్నీ ఎవరి జేబుల్లోకి పోయాయి?  ఒకవైపు ఉత్సవాల పేరుతో దోపిడీకి పాల్పడుతూ మరోవైపు మా వల్లే ఉత్సవాలు ఘనంగా జరిగాయి అని అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు. 

● వైయస్ జగన్ హయాంలోనే విజయవాడ అభివృద్ధి

విజయవాడ నగరం కేవలం వైయస్.జగన్ నాయకత్వంలోనే అభివృద్ధి చెందింది. ఎన్టీఆర్ జిల్లాలో పార్కులు, రోడ్లు, కృష్ణానదికి రిటైనింగ్ వాల్ నిర్మాణం వంటి ప్రజలకు ఉపయోగపడే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే.. ప్రజలు సంతోషంగా పండగ జరుపుకునే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే... అధికార పార్టీ నేతలు మాత్రం వ్యాపార సంస్థల నుంచి అక్రమ వసూళ్ల కోసం దౌర్జన్యాలకు పాల్పడిందని తేల్చిచెప్పారు. కూటమి ప్రతినిధులు చేసిన దుర్మార్గాలన్నింటినీ ప్రజా క్షేత్రంలో బయటపెడతామని హెచ్చరించారు.

Back to Top