సీబీఎన్ సిండికేట్ ఆధ్వర్యంలోనే కల్తీ మద్యం తయారీ 

కూటమి ప్రభుత్వంలో ఏరులై పారుతున్న కల్తీ మద్యం

అధికార పార్టీ నేతల కనుసన్నల్లో కల్తీ మద్యం తయారీ

తయారీ నుంచి అమ్మకాల వరకు కల్తీమద్యం ఆర్గనైజ్డ్ స్కామ్ 

సత్యసాయి జిల్లాలో భారీగా పట్టుబడ్డ కల్తీ మద్యం

పట్టుబడ్డ  సురేంద్రనాయుడు చంద్రబాబు సన్నిహితుడే

తేల్చి చెప్పిన వైయ‌స్ఆర్‌సీపీ  ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీ జే ఆర్ సుధాకర్ బాబు

వైయస్.జగన్ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు

అత్యంత పారదర్శకంగా మద్యం పాలసీ

మద్యం అమ్మకాల ద్వారా నేరుగా ప్రభుత్వ ఖజానాకే ఆదాయం

అయినా గత ప్రభుత్వంలో స్కామ్ అంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం

త‌ప్పుడు కేసులతో వైయ‌స్ఆర్‌సీపీ  నేతల అక్రమ అరెస్టులు

ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన సుధాకర్ బాబు

కల్తీ మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకూ టీడీపీ నేతలే

ప్రభుత్వ ఆదాయం టీడీపీ నేతల జేబుల్లోకే

చంద్రబాబు వ్యవస్థీకృత పాపాల్లో ఎల్లో మీడియాకు కూడా భాగస్వామ్యం 

అందుకే టీడీపీ నేతల కల్తీ మద్యం గురించి వార్తలు రాయని ఎల్లో మీడియా

ఆగ్రహం వ్యక్తం చేసిన టీజేఆర్ సుధాకర్ బాబు

తాడేపల్లి: కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని వైయ‌స్ఆర్‌సీపీ  ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీ జే ఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో నాణ్యమైన మద్యం అందిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు ఇవాళ కల్తీ మద్యాన్ని బహుమతిగా ఇచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగింది... డబ్బులు చేతులు మారాయని ఆభూతకల్పనలతో ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఇవాళ ఏకంగా కల్తీ మద్యం మాఫియాను తయారు చేశాడని స్పష్టం చేశారు.  ఆ మాఫియా ఆధ్వర్యంలో..  ప్రభుత్వ మద్యం దుకాణాల స్ధానంలో వచ్చిన ప్రైవేటు షాపుల్లోకి, కొత్తగా ఏర్పాటు చేసిన పర్మిట్ రూముల్లోకి కల్తీ మద్యం సరఫరా అవుతుందని తేల్చి చెప్పారు. సీబీఎన్ సిండికేట్ ఆధ్వర్యంలో  కల్తీ మద్యం వల్ల వేలాది మంది పేదలు ప్రాణాలు కోల్పోతున్నా.. కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
 
● సీబీఎన్ సిండికేట్ ఆధ్వర్యంలో కల్తీ మద్యం తయారీ..

వైయస్.జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టడంతో నేరుగా ప్రభుత్వ ఖజానాకే  కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కానీ చంద్రబాబు తాను అధికారంలోకి రాకముందే మద్యం మీద రకరకాల అభూతకల్పనలు ప్రచారం చేస్తూ... మద్యం పాలసీని సంస్కరిస్తానని మంచి మద్యాన్ని అందిస్తానని హామీ ఇచ్చాడు. బహుశా ప్రపంచంలో చంద్రబాబు తప్ప.. ఏ రాజకీయ నాయకుడు కూడా నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అందిస్తానని చెప్పలేదు.  ఇప్పుడున్న మద్యం పాలసీని మార్పు చేసి.. ఇంకా మెరుగైన పాలసీ రూపొందిస్తాడేమోనని చాలామంది భావించారు. కానీ చంద్రబాబు తాను చేయబోయే కుట్రకు.. మద్ధతుగా రాష్ట్రంలో లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించారు. మరోవైపు తన అనుయాయిలందరితో మద్యం సిండికేట్ ఏర్పాటు చేసి, మద్యం అమ్మకాలను ప్రైవేటు షాపులకు కేటాయించారు. ఆ షాపులన్నీ తన వాళ్లతో రూపొందిన  సిండికేట్ కే వచ్చేలా చేశాడు. వాళ్ల చేతుల్లో దుకాణాలు పెట్టి అక్కడ నుంచి బెల్టుషాపులు, వాటికి అనుగుణంగా పర్మిట్ రూములు కూడా ఏర్పాటు చేయించాడు. తద్వారా నారా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో మంచినీళ్లకు కొదువుందికానీ..మద్యానికి మాత్రం కొదువ లేకుండా చేశాడు. ఏ వీధిలో చూసినా, ఏ వాడలో చూసినా మద్యం ఏరులై పారుతుంది. ఇదంతా డైవర్ట్ చేయడానికి గత ప్రభుత్వంలో మద్యం స్కామ్ అని చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో భారీ కుట్రకు తెరలేపారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల కనుసన్నల్లోనే పెద్ద ఎత్తున కల్తీ మద్యం తయారీకి తెరలేపారు. నిన్న అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలో ములకల చెరువులో పెద్ద ఎత్తున పట్టుబడిన కల్తీ మద్యమే దీనికి నిదర్శనం. ప్రభుత్వ దాడిలోనే వేలకొలదీ తయారు చేసిన కల్తీమద్యం బాటిళ్లు పోలీసులకు దొరికాయి. ఇది ఎవరూ సృష్టించింది కాదు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ కూడా కాదు. 
కల్తీమద్యంతో పట్టుబడ్డ సురేంద్రనాయుడు  నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నహితుడైన స్ధానిక తెలుగుదేశం నాయకుడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందునుంచి ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలే కల్తీమద్యం తయారు చేస్తారు, అందుకు కావాల్సిన మడిసరుకు తెచ్చుకోవడం దగ్గర నుంచి ఆ కల్తీ మద్యం బాటిల్ అమ్మి... వినియోగదారుడికి చేరే వరకు జరుగుతున్న వ్యవస్ధీకృతమైన స్కామ్ జరుగుతోంది. నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన సూపర్ సిక్స్ ను తలదన్నేలా అమలు చేస్తున్న స్కామ్.. స్కీమ్ ఇది. ఇది చంద్రబాబు తయారు చేస్తున్న మద్యం. ఇది చంద్రబాబు సొంత జిల్లా పక్కనే తయారవుతుంది. రాయలసీమ జిల్లాలన్నింటికీ ఈ సరఫరా జరుగుతోంది. ఈ అక్రమ తయారీని వైయ‌స్ఆర్‌సీపీ  నేతలు పట్టించలేదు. కూటమి ప్రభుత్వంలో పోలీసులే స్వయంగా పెద్ద సంఖ్యలో కల్తీ మద్యం బాటిళ్లు పట్టుకున్నారు. ఇంకా తయారుచేయడానికి క్యాన్లలో సిద్ధంగా ఉన్న కల్తీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఇంత విచ్చలవిడిగా జరుగుతున్న కల్తీ మద్యం తయారీ, అమ్మకాలు బయటపడకుండా ఉండేందుకే... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేని మద్యం స్కామ్ ను తెరపైకి తెచ్చి... వైయస్.జగన్ కు సన్నిహితంగా ఉన్న వాళ్లను చంద్రబాబు అక్రమ అరెస్టులు చేసి జైళ్లకు పంపించాడు. గత ప్రభుత్వం తరహాలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపడితే.. ఇలా కల్తీ చేయాడనికి ఆస్కారం ఉండదు. కల్తీ జరిగితే ప్రభుత్వమే బాద్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి..గతంలో ఆ తప్పులు జరగలేదు. కానీ చంద్రబాబు ఇప్పుడు నకలీ మద్యం తయారు చేసి.. ప్రజల మీదకు రుద్దడానికి ఎంచుకున్న మార్గం.. గత ప్రభుత్వ మద్యం విధానం రద్దు... కొత్త మద్యం విధానం ముద్దు. అన్నమయ్య జిల్లాలో పట్టుబడ్డ కల్తీ మద్యమే ఇందుకు నిదర్శనం.
 
● వైయస్.జగన్ హయాంలో పారదర్శక మద్యం పాలసీ...

2019-24 మధ్య వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో కేవలం ఐదేళ్లలో ప్రభుత్వ మద్యం విక్రయాల ద్వారా దాదాపు రూ.1 లక్ష కోట్లు వచ్చింది. అంటే సగటున ఏడాదికి రూ.20వేల కోట్లు ఆదాయం రావాలి. మరి ఇవాళ ఆ డబ్బంతా ఏమైంది. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రావాల్సిన రూ.25వేల కోట్ల ఆదాయం ఏమైంది ? చంద్రబాబునాయుడు, ఆయన అనుయాయిలు, నకిలీ మద్యం కేసులో పట్టుబడ్డ సురేంద్ర నాయుడు జేబుల్లోకి, ఆయనపైన ఉన్న మంత్రులు స్ధాయి వ్యక్తి జేబుల్లోకి పోయింది. నకిలీ మద్యం కేసులో సురేంద్రనాయుడు పట్టుబడ్డ సమయానికి ఈ మొత్తం నకిలీ మద్యం తయారీకి మూలకారణమైన వ్యక్తి చంద్రబాబు ఎదురుగానే కూర్చున్నాడు. పట్టుబడ్డ నకిలీ మద్యం కేసును తారుమారు చేయడానికి విశ్వప్రయత్నాలు చేశారు. నిందితుడు సురేంద్రనాయుడు సీఎం చంద్రబాబుతో ఉన్న ఫోటోలు కూడా బయటపడ్డాయి. 
నిజానికి ప్రజాసంక్షేమం కోరుకునే ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజలను మద్యపానం చేయవద్దని, ఆరోగ్యం పాడవుతుంది, ఆదాయం కూడా కోల్పోతావని చెప్పాలి. అలా కాకుండా అత్యంత దుర్మార్గంగా నాణ్యమైన మందు అందిస్తానని, కావాల్సిన బ్రాండు ఇస్తామని చెప్పడం  మరింత దుర్మార్గం. ఒకవైపు మద్యాన్ని ఏరులై పారిస్తూ.. బెల్టుషాపులు, పర్మిట్ రూములకు పర్మిషన్ ఇస్తూ... మరింత దోచుకుంటున్నారు. ప్రభుత్వమిచ్చే చీప్ లిక్కర్ ను అత్యంత పేదవర్గానికి చెందినవారే కొంటున్నారు. అదే మద్యాన్ని వారికి దూరం చేస్తే... ఆ మిగిలిన డబ్బులు చూసి ఆ పేదింట ఇళ్లాలు ఎంతో ఆనందపడుతుంది. తలక్రిందులగా తపస్సు చేసినా చంద్రబాబుకు ఈ విషయం అర్ధం కాదు. 
అందుకే వైయస్.జగన్ మద్యాన్ని అందని ద్రాక్షగా చేయాలని తలిచి, మద్యాన్ని దశలవారీగా రాష్ట్రం నుంచి తీసివేయాలని నిర్ణయించారు. మరోవైపు మద్యం కల్తీ జరగకూడనది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అమ్మేలా చర్యలు తీసుకున్నారు. ఆ క్రమంలో ఎక్కడైనా మద్యం కల్తీ అయితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ఆ రకంగా వైయస్.జగన్ ప్రభుత్వంలో చేస్తే.. ఇవాళ చంద్రబాబు పాలనలో కల్తీ మద్యం యధేచ్చగా తయారు చేస్తున్నారు. కూటమి పెద్దల ఆధ్వర్యంలోనే కల్తీ మద్యం తయారీ, రవాణా, ప్రైవేటు మద్యం షాపుల్లో అమ్మకాలు కూడా సిండికేట్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. అదే సీబీఎన్ సిండికేట్. 

● నాణ్యమైన మద్యం హామీతో నకిలీ మద్యం సరఫరా..

సామాన్యుడికి అతి తక్కువ ధరకే మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని చెప్పి .. ఇవాళ నకిలీ మద్యాన్ని అంటగడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో కల్తీ ఏ స్ధాయిలో ఉందంటే... ఎక్కడో ఓ చోట నాటుసారా తయారు చేస్తున్న తరహాలో కాకుండా... ఏకంగా భారీ స్ధాయిలో పెద్ద ఎత్తున కల్తీ మద్యాన్ని తయారు చేసి వేల బాటిళ్లలో దాన్ని నింపి, సదరు కల్తీ మద్యానికి కేరళ బ్రాండ్ అని మరో పేరుతో అమ్మకాలు చేపడుతున్నారు. చంద్రబాబు పాలనలో ప్రతి మూడు బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ మద్యమేనని సుధాకర్ బాబు స్పష్టం చేశారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మి మోసపోయిన వారందరూ ఈ కల్తీ మద్యం తాగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన దుస్ధితి రాష్ట్రంలో నెలకొందని... చంద్రబాబు చేసిన ప్రతి అకృత్యానికి దేవుడు బదులుతీర్చుకుంటాడని హెచ్చరించారు. 

చిత్తూరు జిల్లాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టిన ఘటన అత్యంత దుర్మార్గమన్నారు. తక్షణమే ఘటనకు పాల్పడ్డ నిందితులను పట్టుకుని,వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో రక్షణ లేదని అనేకమార్లు నిరూపితమైందని... అందుకే దళితుల మీద దాడులు, బాబాసాహెబ్ విగ్రహాలు తగలబెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

Back to Top