తాడేపల్లి: ప్రభుత్వం తక్షణమే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులతో మాట్లాడి పెండింగ్ బకాయిలు తక్షణం చెల్లించాలని మాజీ మంత్రి విడదల రజని డిమాండ్ చేశారు. తాడేపల్లి లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారని, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్‌సీ డాక్టర్లు ధర్నాలు చేస్తున్నా, ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు వైద్యం నిరాకరిస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకి అనుక్షణం దోచుకోవాలన్న ఆలోచన తప్ప ప్రజారోగ్యం మీద చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి విడదల రజని ధ్వజమెత్తారు. దివంగత వైయస్ఆర్ ఆంధ్రాలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేస్తుంటే, చంద్రబాబు మాత్రం నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే... ● ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు: చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు. ప్రభుత్వం నుంచి రూ.3 వేల కోట్లు బకాయిలు రాకపోవడంతో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు వైద్యం చేయలేమంటూ బోర్డులు పెట్టేస్తున్నాయి. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం 16 నెలలుగా చోద్యం చూస్తూ పేద ప్రజలను వారి మానాన వదిలేస్తోంది. పెండింగ్ బిల్లులు చెల్లింపు విషయంలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వానికి 20 సార్లు లేఖలు రాసినా పట్టించుకున్న పాపానపోవడం లేదు. ఈనెల 10 నుంచి వైద్యసేవలు నిలిపివేస్తున్నామని మరోసారి స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియేషన్ (ఆసా) పేరుతో ప్రభుత్వానికి వారు రాసిన లేఖలో " ఏడాది కాలంగా మేము పడుతున్న ఇబ్బందులను ప్రజలంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఇంతకాలం మీకు సేవ చేశాం. ఈ కష్టకాలంలో మాకు అండగా నిలవాలని ప్రజలను కోరుకుంటున్నాం." అని తమ ఆవేదన వెలిబుచ్చారు. ఆస్పత్రులతో మాట్లాడే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయకుండా ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారు. మొట్టమొదటిసారి ఏపీలోనే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం చూస్తే ఇంతకన్నా ప్రభుత్వ వైఫల్యం ఏముంటుంది? ఆరోగ్యశ్రీని ప్రైవేటుపరం చేస్తూ ఒకవైపు, ఆస్పత్రులకు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా వేధిస్తూ ఇంకోవైపు ఈ ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వైద్యం అందక ఎవరైనా చనిపోతే దానికి ప్రభుత్వమే బాద్యత వహించాలి. దాన్ని ప్రభుత్వ హత్యగానే భావించాల్సి ఉంటుంది. ● వైయస్ఆర్‌సీపీ హయాంలో విజయవంతంగా ఆరోగ్యశ్రీ: ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించడం వైయస్ జగన్ ప్రభుత్వ బాధ్యతగా భావించారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో ఆరోగ్యశ్రీని బలోపేతం చేసేలా 1059 ఉన్న ప్రొసీజర్లను 3257 కి పెంచడం జరిగింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఖ్యను కూడా పెంచాం. దీంతోపాటు లేవలేని స్థితిలో ఉన్న రోగి కోలుకుంటున్న సమయంలో ఆరోగ్య ఆసరా ఇచ్చి ఆదుకున్నాం. ఆరోగ్యశ్రీ లిమిట్‌ను రూ.25 లక్షలకు పెంచడం జరిగింది. కరోనా వంటి కష్టకాలంలో కూడా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకుండా ఆరోగ్య భద్రత కల్పించాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాం. సురక్ష పేరుతో సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లను గ్రామాలకు పంపించి టెస్టులు చేయించాం. కానీ ఇప్పుడవన్నీ నిర్వీర్యం చేశారు. ఇప్పుడు పరిస్థితిని చూస్తే పీహెచ్ సీ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు వైద్యం నిరాకరిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో పనిచేయలేమని డాక్టర్లు వెనక్కి వచ్చేస్తున్నారు. ఇవన్నీ చూశాక కూడా ప్రభుత్వంలో చలనం లేదు. విష జ్వరాలు, పచ్చ కామెర్లతో విద్యార్థులు చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. ఆఖరికి మెడికల్ కాలేజీలను సైతం ప్రైవేటీకరించేస్తున్నారు. ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధి చూపడం లేదు. ఎంత సేపటికీ దోచుకోవాలన్న యావ తప్ప, మంచి చేసే ఆలోచన చేయడం లేదు. చంద్రబాబు మోసపు హామీలు నమ్మి ఓటేసిన ప్రజలంతా ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. ● హైబ్రిడ్ మోడల్ పేరుతో దోపిడీ స్కెచ్: ఆరోగ్యశ్రీ లిమిట్‌ను రూ. 25 లక్షలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, హైబ్రిడ్ (ఇన్సూరెన్స్) మోడల్ తీసుకొచ్చి ఇప్పుడు ఏకంగా ఆరోగ్యశ్రీ స్కీమ్‌నే ఎత్తేసే కుట్ర చేస్తున్నాడు. దేశంలో 18 రాష్ట్రాలు ఈ హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్ గురించి అధ్యయనం చేసి వర్కౌట్ కావని గ్రహించి చివరికి ఆరోగ్యశ్రీ ట్రస్టు మోడల్ లోనే సేవలందిస్తున్నాయి. కానీ పక్క రాష్ట్రాల్లో ఫెయిల్ అయిన మోడల్‌ని ఏపీకి తీసుకురావాలని చూడటం ఆరోగ్యశ్రీ పేరుతో దోపిడీకి బాటలు వేయడమే. వైయస్ఆర్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని ఇప్పుడు దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తుంటే మన రాష్ట్రంలో పుట్టిన స్కీమ్‌ను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నాడు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది. ఆరోగ్యశ్రీని ఆరోగ్యవంతంగా నడిపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ● జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు: గతంలో మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం జీవో నెంబర్ 107 ద్వారా యాన్యుటీ ఆలోచన చేశాం. కానీ ఇది వర్కవుట్ కావడం లేదని గ్రహించి నాబార్డ్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ తో టైఅప్ చేయడం జరిగింది. పీపీపీ గురించి ఏనాడూ వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఆలోచన కూడా చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఆ సాకును మాపై నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. పీపీపీ ఆలోచన విరమించుకునే దాకా ప్రభుత్వంపై ప్రజల తరఫున వైయస్ఆర్‌సీపీ పోరాడుతుంది.