మచిలీపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ లిక్కర్ తయారు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్న నిందితులంతా టీడీపీ నాయకులేనని, కానీ వారిని లోతుగా విచారించకుండా తూతూ మంత్రంగా చార్జిషీట్లు వేస్తున్నారన్న పేర్ని నాని, దీనిపై వైయస్ఆర్‌సీపీ మాట్లాడితే నిందితులంతా మా పార్టీ కోవర్టులని అడ్డగోలుగా వాదించడం సిగ్గుచేటని మండిపడ్డారు. మచిలీపట్నం లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ కేసుల్లో టీడీపీ నాయకులు దొరికిపోతున్నా వాటిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కల్తీ లిక్కర్ తయారు చేస్తూ నిందితులు ఆధారాలతో సహా దొరికిపోతున్నా ఈనాడు, ఆంధ్రజ్యోతి అసత్య కథనాలతో వైయస్ఆర్‌సీపీ మీద నిందలు మోపడం దారుణమన్నారు. లిక్కర్ కేసులను అడ్డం పెట్టుకుని ఒక కులంపై బురదజల్లడమే తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. రెడ్లు మీద అంత కోపంగా ఉంటే వారిని కూటమి నుంచి బయటకు పంపాలని మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ● కల్తీ లిక్కర్ రాకెట్ పై చంద్రబాబు, లోకేష్ ఎందుకు స్పందించడం లేదు..? రాష్ట్రంలో వరుసగా పట్టుబడుతున్న కల్తీ లిక్కర్ పరిశ్రమలు, వాటితో టీడీపీ కీలక నాయకులకు సంబంధాలున్నట్టు దొరుకుతున్న ఆధారాలు చూస్తుంటే ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలే గద్దలుగా మారి ప్రజలను దోచుకుంటున్నారని స్పష్టంగా అర్థమైపోతుంది. అక్రమ సంపాదన కోసం తండ్రీకొడుకులు నారా చంద్రబాబు, నారా లోకేష్ ఎన్నెన్ని తప్పుడు పనులు, దారుణాలు చేస్తున్నారో చెప్పడానికి సమయం సరిపోవడం లేదు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకల చెరువులో పట్టుబడిన నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలో తయారవుతున్న కల్తీ లిక్కర్ తాగి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఒక డిస్టిలరీ తరహాలో లిక్కర్ బాటిల్స్, వివిధ బ్రాండ్లకు సంబంధించి నకిలీ లేబుల్స్, మూతలు, సీలింగ్, ప్యాకింగ్ యంత్రాలు తదితర అన్నిరకాల సామగ్రి సమకూర్చుకుని మరీ దందా సాగించడం చూసి రాష్ట్ర ప్రజలతో పాటు ఎక్సైజ్ శాఖ సిబ్బంది సైతం విస్తుపోతున్నారు. దీనికి ముందు అమలాపురం, నెల్లూరు, రేపల్లె, పాలకొల్లు, అనకాపల్లి జిల్లా పరవాడలోనూ ఎక్సైజ్ పోలీసులు కల్తీ లిక్కర్ రాకెట్ గుట్టురట్టు చేశారు. పేరున్న బ్రాండ్ల పేరుతో నకిలీ లేబుల్స్ తో ప్లాస్టిక్ బాటిళ్లలో కల్తీ లిక్కర్ ని నింపిన లక్షలాది బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరవాడ నకిలీ మద్యం తయారీ కేసులో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుడు రుత్తుల రాము అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వాటాల పంపకాల కోసం జరిగిన కుమ్ములాటతో ఈ అక్రమాలన్నీ బయటకొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ భారీ ఎత్తున కల్తీ లిక్కర్ రాకెట్ వెలుగు చూస్తుంటే ఎక్సైజ్ మంత్రికానీ, ఆ జిల్లాకు చెందిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ నోరెత్తడం లేదు. ఎప్పుడూ ఎక్స్‌లో యాక్టివ్ గా ఉండే నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తోపాటు సీఎం చంద్రబాబు కూడా కల్తీ లిక్కర్ వ్యాపారంపై స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కనీసం నిందితుల మీద చర్యలు తీసుకోవాలని స్టేట్‌మెంట్ కూడా ఇవ్వడానికి వెనుకాడుతున్నారంటే ఈ లిక్కర్ దందాతో వారికి సంబంధం ఉందన్న అనుమానాలు ఎవరికైనా కలగకుండా ఉండవు. కల్తీ లిక్కర్ కేసుల్లో పట్టుబడిన నిందితులపై చడీచప్పుడు కాకుండా విచారణ ముగించేస్తున్నారు. ● రెడ్లను టార్గెట్‌గా చేసి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో తప్పుడు కథనాలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాతో పాటు ఏ కేసులోనైనా అరెస్టయితే ముందుగా పోలీసులు చేసే పని వారి ఫోన్లు స్వాధీనం చేసుకోవడమే. కానీ ఏలూరు, అనకాపల్లి, పాలకొల్లు, నెల్లూరు.. కల్తీ లిక్కర్ కేసుల్లో పట్టుబడిన టీడీపీ నాయకుల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకోలేదు. అమాయకుల ప్రాణాలు తీస్తున్నా కల్తీ లిక్కర్ కేసులను లోతుగా విచారణ చేసే ప్రయత్నం చేయడం లేదు. పైన చంద్రబాబు, లోకేష్ స్థాయి నుంచి వచ్చే ఆదేశాలతో విచారణ ముగించేస్తున్నారు. ఒక పక్క నేరం చేసి అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా టీడీపీ నాయకులు, మంత్రులు.. వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆఫ్రికాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి లిక్కర్ ఫ్యాక్టరీలున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంబంధం లేకుండా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. మంత్రి అలా ఉంటే ఆయన్ను మించి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రెడ్డి కులం మీద విషం చిమ్మడమే ధ్యేయంగా అడ్డగోలు కథనాలు వండి వార్చారు. ఆఫ్రికాలో లిక్కర్ ఫ్యాక్టరీలన్నీ రెడ్లవేనని, వారూ వీరూ అంతా ఒకటేనని ఈనాడులో అర్థంపర్థం లేకుండా రాశారు. రెడ్లు ఎవరైనా తప్పు చేస్తూ దొరికిపోతే వారికి ఏదోక రకంగా జగన్‌తో లింకులు అంటగడతారు. ఏదో విధంగా వైయస్ జగన్ మీద విషం చిమ్మి ఆయన వ్యక్తిత్వం హననం చేయాలన్న కుట్ర తప్ప ఇంకోటి కాదు. రెడ్లు లిక్కర్ తయారు చేసే వారైతే వారిని టీడీపీ, జనసేన, బీజేపీలో ఇంకా ఎందుకు ఉంచుకున్నట్టు..? ● టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ పై విషం: తెలుగుదేశం అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో "ఆఫ్రికాలో నాటు సారా.. ఆంధ్రాలో నకిలీ సారా.. జగన్ ముఠా గుట్టు రట్టు చేసిన ఏపీ పోలీస్" అంటూ పోస్టులు పెట్టారు. "ఆఫ్రికాలో సారా వ్యాపారం చేయిస్తున్న జగన్ రెడ్డి. తన తమ్ముళ్ళు వైయస్ సునీల్ రెడ్డి, వైయస్ అనిల్ రెడ్డితో సారా వ్యాపారం. అక్కడ ఫార్ములా ఇక్కడ ఉపయోగించి గత 5 ఏళ్ళుగా జే-బ్రాండ్స్ తో నకిలీ మద్యం సరఫరా. కూటమి ప్రభుత్వం రాగానే సైలెంట్. మళ్ళీ 15 రోజుల కిందట పుంగనూరు, తంబళ్లపల్లె వైసీపీ ఎమ్మెల్యేలని అడ్డు పెట్టుకుని నకిలీ మద్యం దందా మొదలు. ఎక్సైజ్ పోలీసుల అప్రమత్తతతో గుట్టు రట్టయిన జగన్ రెడ్డి కుటుంబ నకిలీ మద్యం దందా!" "ములకల చెరువు నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు దాసరిపల్లి జయచంద్రా రెడ్డితో పాటు వైసీపీ పెద్దలతో లావాదేవీలు ఉన్న దేవరింటి రవి శంకర్ రెడ్డి, దేవరింటి రామకృష్ణా రెడ్డిలకు వైయస్ జగన్ మైన్స్ కట్టబెట్టాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు చేసే నకిలీ మద్యం ముడుపులు జగన్ కు చేరాయన్నట్టే కదా!" అంటూ వరుస పోస్టులు చేశారు. దేవరింటి రవి శంకర్ రెడ్డి, దేవరింటి రామకృష్ణా రెడ్డిలు రెడ్లు కాబట్టి వారికి వైయస్ జగన్ ప్రభుత్వంలో మైనింగ్ లైసెన్స్ వచ్చింది కాబట్టి వారు జయచంద్రా రెడ్డికి బాగా దగ్గర కాబట్టి ఈ లిక్కర్ దందాతో జగన్ కి సంబంధం ఉందని, ఆ డబ్బులన్నీ వైయస్ జగన్ కే చేరినట్టు టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో అడ్డగోలు రాతలు రాశారు. ● జయచంద్రా రెడ్డికి ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం లేదా..? ములకలచెరువు కల్తీ లిక్కర్ కేసులో నిందితుడైన ఈ జయచంద్రా రెడ్డిని జయహో బీసీ సదస్సులో చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారు. పార్టీలో చేర్చుకున్న మూడు నెలలకే ఆయనకు తంబళ్లపల్లె టీడీపీ టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా ఆయన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గానే కొనసాగుతున్నాడు. ఒకసారి జయచంద్రా రెడ్డి 2024 ఎన్నికల అఫిడవిట్ చూస్తే సెంట్రల్ ఆఫ్రికా, వెస్ట్ ఆప్రికాలలో తనకి రెండేసి ఫ్యాక్టరీలున్నట్టు ఆయనే స్వయంగా ప్రకటించుకున్నాడు. ఇలాంటి వ్యక్తిని చంద్రబాబు పిలిచి పార్టీలో చేర్చుకుని మూడు నెలల్లోనే తంబళ్లపల్లె టీడీపీ టికెట్ ఇచ్చాడు. ఇబ్రహీంపట్నం లిక్కర్ దందాలో పట్టుబడిన జనార్దన్ రావు సైతం టీడీపీ నాయకుడే. చంద్రబాబు నుంచి జయచంద్రా రెడ్డి పార్టీ బీఫారం తీసుకుంటున్న సందర్భంలో జనార్దన్ రావు కూడా పార్టీ కండువా కప్పుకుని పక్కనే ఉన్నాడు. ● యావజ్జీవ ఖైదీ కట్టా సురేంద్ర నాయుడిని బయటకు తెచ్చింది చంద్రబాబే: మరో నిందితుడు కట్టా సురేంద్ర నాయుడు సైతం టీడీపీ కండువా కప్పుకుని మంత్రి రాంప్రసాద్‌తోనే తిరుగుతున్నాడు. ఈ కట్టా సురేంద్ర నాయుడు 2002లో ఒక హత్య కేసులో అరెస్టయ్యాడు. ఈ కేసులో జిల్లా కోర్టు సురేంద్ర నాయుడికి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తే ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. కానీ హైకోర్టు సైతం కింది కోర్టు తీర్పునే సమర్థించింది. కానీ ఈ వ్యక్తికి 2014లో సీఎం అయిన చంద్రబాబు క్షమాభిక్ష పెట్టడంతో ఇప్పుడు స్వేచ్ఛగా బయట తిరుగుతూ కల్తీ లిక్కర్ దందా చేసుకుంటున్నాడు. సురేంద్ర నాయుడికి అన్ని డిపార్ట్ మెంట్ల నుంచి క్లీన్ సర్టిఫికెట్ ఇప్పించి బయటకు తెచ్చింది చంద్రబాబు కాదా? చంద్రబాబుకి చనువు లేకుండా, అతడి నుంచి చంద్రబాబుకి లాభం లేకపోయుంటే యావజ్జీవ శిక్షపడిన నిందితుడిని బయటకు తీసుకొచ్చారో టీడీపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఆఫ్రికాలో తనకు లిక్కర్ వ్యాపారాలున్నాయని అఫిడవిట్లో ప్రకటించిన జయచంద్రా రెడ్డికి పార్టీ కోసం కష్టపడుతున్న శంకర్ యాదవ్‌ను కూడా కాదని టికెట్ ఎలా ఇచ్చారు? మా కోవర్ట్ అయితే టికెట్ ఎలా ఇచ్చారు? జయచంద్రా రెడ్డిని పార్టీలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించింది ఈ సురేంద్ర నాయుడు కాదా? శంకర్ యాదవ్‌ని మోసం చేసి జయచంద్రా రెడ్డికి టికెట్ ఇవ్వడానికి ఎన్ని కోట్లు చేతులు మారాయో చిత్తూరు టీడీపీ కార్యకర్తలు తెలియవనుకున్నారా? ● చంద్రబాబు పాపాలు పండే రోజులు రాబోతున్నాయి: గతంలో వైయస్ఆర్‌సీపీలో పనిచేసినంత మాత్రాన వారంతా మా పార్టీ కోవర్టులవుతారా? మా కోవర్టులను చేర్చుకుని ఎంపీ, ఎమ్మెల్యే టికెట్‌లు ఎందుకిచ్చారు? మంత్రి పదవులు ఎందుకిచ్చారు? వాళ్లను కూడా సస్పెండ్ చేయకుండా టీడీపీలో ఎందుకు ఉంచుకున్నారు? ఇంత పక్కాగా దొంగ లిక్కర్ ఫ్యాక్టరీలు నడిపే వారంతా తెలుగుదేశం నాయకులేనని ఆధారాలతో సహా దొరికిపోతుంటే దాన్ని ఏదో విధంగా వైయస్ఆర్‌సీపీ మీదకు నెట్టేసి తప్పించుకోవాలన్న ఆరాటం తప్ప, ఆధారాలుండవు. నేరాల్లో దొరికిపోయాక టీడీపీ నాయకులు ఆడుతున్న అడ్డగోలు అబద్ధాలను, చంద్రబాబు చౌకబారు రాజకీయాలను గమనించమని రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. రాష్ట్ర ప్రజలే చంద్రబాబు దారుణాలకు విసిగిపోయి తరిమికొట్టే రోజు త్వరలోనే వస్తుందని పేర్ని నాని స్పష్టంచేశారు.