న్యూఢిల్లీ: రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో జాండిస్ (హెపటైటిస్–ఏ ఇన్ఫెక్షన్) వల్ల 170 మంది విద్యార్థినిల అస్వస్థత, ఇద్దరు బాలికల మృతిపై అరకు ఎంపీ తనూజారాణి నేతృత్వంలో వైయస్ఆర్‌సీపీ ప్రతినిధుల బృందం ఢిల్లీలో జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మాజీ డిప్యూటీ సీఎంలు పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్న దొర, అరకు ఎమ్మెల్యే రేగా మత్స్యలింగం, మాజీ ఎమ్యేలే కె.భాగ్యలక్ష్మి, పార్వతీపురం మన్యం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శతృచర్ల పరీక్షిత్ రాజు, మాజీ ఎంపీ జి.మాధవి, విశాఖపట్నం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ జల్లి సుభద్ర, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి తదితరులు జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అంతర్‌సింగ్ ఆర్యను కలిసి వినతిపత్రం సమర్పించారు. కేవలం రాష్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఒకే స్కూల్‌లో ఇద్దరు విద్యార్ధినులు మృతి చెందడంతో పాటు, 170 మందికి పైగా జాండిస్ బారిన పడ్డారని వైయస్ఆర్‌సీపీ ప్రతినిధుల బృందం జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు వివరించింది. గిరిజన ప్రాంతాల్లో విద్యార్ధులకు కనీసం రక్షిత మంచినీరు అందించకపోవడం వల్లే నీరు, ఆహారం కలుషితమై వ్యాధి వ్యాప్తి చెందిందని వారు తెలిపారు. ఈ ఘటనపై కమిషన్ ఆధ్వర్యంలో ప్రత్యే దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి, విచారణ జరిపించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడినవైయస్ఆర్‌సీపీ ప్రతిని«ధులు, తమ విజ్ఞప్తిపై ఎస్టీ కమిషన్ సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. చనిపోయిన ఇద్దరు బాలికల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడంతో పాటు, గిరిజన స్కూళ్లలో రక్షిత మంచినీటితో సహా, అన్ని సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే..: గుమ్మా తనూజారాణి. అరకు ఎంపీ. – కురుపాంలోని గురుకుల పాఠశాలలో 170 మందికి పైగా గిరిజన బాలికలు జాండిస్‌తో బాధ పడుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించింది. గిరిజనుల సంక్షేమంపై ఎంతో చిత్తశుద్ధి ఉన్నట్లు మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారు? పరిస్థితిని వారు కనీసం సమీక్షించలేదు. బాధితులను పరామర్శించలేదు. పైగా వ్యక్తిగత శుభత్ర లేకపోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పడం అత్యంత బాధాకరం. కామెర్ల బారిన పడి మరణించిన బాలికల కుటుంబాలకు ప్రభుత్వం కచ్చితంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఉప ముఖ్యమంత్రి. – రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గిరిజనులకు జరుగుతున్న అన్యాయన్ని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని దేశమంతా తెలియజెప్పాలన్న ఉద్దేశంతోనే ఎన్‌హెచ్చార్సీని, ఎస్టీ కమిషన్‌ను కలిశాం. కురుపాంలో గిరిజన బాలికల గురుకల పాఠశాలలో 170 మంది పిల్లలు జాండిస్ బారిన పడగా, ఆ పక్కనే ఉన్న ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో కూడా మరో 40 మంది వ్యాధి బారిన పడడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ గిరిజన గురుకులాల్లో ఏడాదిన్నర కాలంగా మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణను గాలికొదిలేశారు. పిల్లలకు రక్షిత మంచినీరు అందించే ఆర్వో ప్లాంటు పని చేయడం లేదు. దాని ఫలితమే కురుపాం గురుకుల పాఠశాలలో పిల్లలు జాండిస్ బారిన పడ్డారు. ప్రభుత్వం, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇద్దరు విద్యార్థినులు చనిపోయారు. ఇవి ముమ్మాటీకీ ప్రభుత్వ హత్యలే. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే మేం రాజకీయం చేస్తున్నామంటున్న అధికార పార్టీ నేతలు, కురుపాం స్కూళ్లో సమస్యను మా పార్టీ నాయకులు బయటపెట్టిన తర్వాతే ప్రభుత్వం స్పందించిన మాట వాస్తవం కాదా? ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇద్దరు గిరిజన విద్యార్థినులు చనిపోతే కనీసం వారికి పరిహారం కూడా ఇప్పించలేని అసమర్థ వ్యక్తి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉండడం గిరిజనుల దౌర్భాగ్యం. ఆ కుటుంబాలకు కేవలం మట్టి ఖర్చుల కింద రూ.5 వేలు ఇచ్చి చేతులు దులుపుకోవడం దారుణం. ఆ కుటుంబాలకు మా పార్టీ తరపున రూ.5 లక్షల చొప్పున ఇస్తామని జగన్‌గారు ప్రకటించారు. పీడిక రాజన్నదొర. మాజీ ఉప ముఖ్యమంత్రి. – కురుపాం ఘటన దురదృష్టకరం. బాధాకరం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇద్దరు విద్యార్దినులు చనిపోయారు. బాధిత విద్యార్థినుల కుటుంబాల పట్ల ప్రభుత్వం కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించింది. కేవలం పిల్లల అపరిశుభ్రతే వ్యాధికి కారణమని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. అక్కడి దారుణ పరిస్థితిని ఇక్కడ వివరించి, దుర్ఘటనకు కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. మా విజ్ఞప్తికి ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు.