గుంటూరు: ప్రభుత్వ వైఫల్యం, అసమర్థత కారణంగానే తురకపాలెం గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయని, ఆరు నెలలైనా ప్రభుత్వంలో చలనం రావడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తురకపాలెం గ్రామానికి చెందిన శీలం సలోమి (40) అనే మహిళను పరామర్శించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజధాని అమరావతికి సమీపంలో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకుంటే కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకోవాలని సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణం గ్రామంలో శాశ్వతంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి అందరికీ పరీక్షలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, సాకె శైలజానాథ్, పత్తిపాడు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి బాలసాని కిరణ్, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు సిటీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే... ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలి: మాజీ మంత్రి అంబటి రాంబాబు తురకపాలెం గ్రామంలో ఆరు నెలలుగా సాగుతున్న మరణాలు ఒక అంతులేని కథలాగా సాగుతున్నాయి. వైయస్ఆర్‌సీపీ నేతృత్వంలో ఇప్పటికే ఐదు సార్లు గ్రామాన్ని సందర్శించడతో పాటు బాధిత కుటుంబాలతో మాట్లాడటం జరిగింది. గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై ఇప్పటికే కలెక్టర్‌ని కూడా కలిసి వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో వినతిపత్రం కూడా అందజేశాం. ఇప్పటికే 45 మరణాలు సంభవించినా వ్యాధి నివారణపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఆధునిక వైద్యశాస్త్రం అందుబాటులో ఉన్నా గుంటూరుకి కూత వేటు దూరంలో ఉన్న తురకపాలెం గ్రామంలో పరిస్థితి ఇలా ఉందంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ అసమర్థత, అలసత్వమే. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోని గ్రామస్తుల ఆరోగ్యాన్ని కాపాడాలి. బాధితులకు మెరుగైన వైద్యం అదించాలి. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి సాకె శైలజానాథ్ తురకపాలెం గ్రామానికి చెందిన శీలం సలోమి(40) అనే మహిళ ఒళ్లంతా గడ్డలతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆరు నెలలుగా గ్రామంలో తాగునీరు కలుషితమై ఇప్పటికే 45 మంది చనిపోయినా ఈ ప్రభుత్వంలో చలనం రావడం లేదు. జ్వరమొస్తే వారం రోజుల్లో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో చనిపోతున్నా ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టుగా కూడా లేదు. వరుస మరణాలకు గల కారణాలను చెప్పడానికి ప్రభుత్వం ఇంకా వెనుకాడుతోంది. గ్రామం మొత్తాన్ని స్క్రీనింగ్ చేయాలని ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. దళితవాడలోనే ఎక్కువమంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లోనూ ఎక్కువ మంది వారే ఉన్నారు. పరిశుభ్రమైన తాగునీరు సరఫరా చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తులు చేస్తున్నా అధికారులు వినిపించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వానికి ప్రజారోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదని చెప్పడానికి తురకపాలెం ఘటనే ఉదాహరణ. ప్రజల ప్రాణాలకు డబ్బులతో విలువ కట్టాలని చూస్తున్నారు. మృతుల్లో కొద్దిమందికే రూ.5 లక్షలు పరిహారం అందించి చేతులు దులిపేసుకోవడం చాలా దారుణం. గ్రామంలో పరిస్థితి ఇంతదారుణంగా ఉన్నా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కనీసం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. తురకపాలెం మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం చెల్లించాలి. తక్షణం ప్రత్యేకమైన టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసి గ్రామానికి 5 కిమీల పరిధిలో అందరికీ టెస్టులు నిర్వహించాలి. గ్రామస్తులకు సురక్షితమైన మంచినీరు సరఫరా చేయాలి. స్థానికంగా పర్మినెంట్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలి: పత్తిపాడు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి బాలసాని కిరణ్ గుంటూరు నగరానికి కూతవేటు దూరంలో ఉన్న తురకపాలెం గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదు. శీలం సలోమి అనే మహిళ అస్వస్థతకు గురై గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. స్థానికంగా చికిత్స తీసుకుంటున్న ఇలాంటి వారు తురకపాలెం గ్రామంలో ఇంకా చాలామంది ఉన్నారు. గ్రామంలో ఆరు నెలలుగా వరుస మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకున్నపాపాన పోవడం లేదు. బాధితులు దళితులే కదా అనే చులకనభావం ప్రజల్లో కనిపిస్తోంది. తురకపాలెం గ్రామస్తులను ప్రజలు సామాజిక బహిష్కరణకు గురవుతున్నారు. మెలిడియోసిస్ కారణంగానే చనిపోతున్నారని వైద్యులు చెబుతున్నా గ్రామస్తులకు సురక్షిత మంచినీరు ఇవ్వలేకపోతున్నారు. తురకపాలెం గ్రామంలో వరుస మరణాలకు గల కారణాలను తక్షణం వెల్లడించాలి. స్థానికంగా పర్మినెంట్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి గ్రామస్తులందరికీ రక్త పరీక్షలు చేయాలి. ఈ గ్రామ దుస్థితిపై వైద్యసిబ్బందితో కమిటీ ఏర్పాటు చేయాలి. నేషనల్ హెల్త్ మిషన్ సాయం తీసుకోవాలి: వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి రాష్ట్ర రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న తురకపాలెం గ్రామంలో 45 మంది అంతుచిక్కని వ్యాధులతో వరుసగా చనిపోతున్నారు. ఈ మరణాలకు స్పష్టమైన కారణాలు ప్రభుత్వం చెప్పడం లేదు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరుగుతున్న మరణాలు. ఇవి హత్యలుగానే వైయస్ఆర్‌సీపీ భావిస్తోంది. గుంటూరు నగరానికి కూతవేటు దూరంలోనే వరుస మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకపోతే నేషనల్ హెల్త్ కమిషన్ సాయం తీసుకుని వరుస మరణాలపై దర్యాప్తు చేయాలి.